నావ మునిగిపోతుందా

చంద్రబాబు అంటే చండశాసనుడే. ఆయన మాటే శిలాశాసనం. బాబే బాస్. ఆయనే ఫైనల్. నిన్నటి వరకూ ఇలా సాఫీగా సాగిపోయిన వ్యవహారం ఒక్కసారిగా తిరగబడిపోవడానికి కారణమేంటి. కేవలం [more]

Update: 2019-08-14 06:30 GMT

చంద్రబాబు అంటే చండశాసనుడే. ఆయన మాటే శిలాశాసనం. బాబే బాస్. ఆయనే ఫైనల్. నిన్నటి వరకూ ఇలా సాఫీగా సాగిపోయిన వ్యవహారం ఒక్కసారిగా తిరగబడిపోవడానికి కారణమేంటి. కేవలం అధికారమే చంద్రబాబును బలంగా చూపించిందా. బాబు అంటే నిజంగా నాయకులకు భయం భక్తి రెండూ లేవా, పార్టీ అంటే అంకితభావంతో పనిచేసే నేతలు కూడా లేరా. టీడీపీ ఓటమిపాలు అయిన తరువాత చంద్రబాబు నాయకత్వాన నిర్వహించిన తొలి రాష్ట్రస్థాయి సమావేశానికి సీనియర్లు ఝలక్ ఇవ్వడాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలి. పార్టీ దారుణమైన ఓటమి చవి చూసింది, విపక్షంలో ఉంది. ఇటువంటి కష్టమైన, క్లిష్టమైన పరిస్థితుల్లో పార్టీ కోసం తామంతా ఉన్నామని ఏకతాటి మీద నిలబడాల్సిన వారు ఇలా డుమ్మా కొట్టడమేంటి. బాబు ఈ వయసులో పార్టీ కోసం ఏదో చేయాలని తాపత్రయపడుతూంటే నేతలు సహకరించకపోవడాన్ని ఏ రకంగా చూడాలి.

కళ్ళ ముందే కనుమరుగా…

తెలుగుదేశం పార్టీ ఏక శిలా సదృశమని భావించిన వారికి మెల్లగా కనువిప్పు కలుగుతోంది. బీటలు వారిన స్థితి కళ్లెదుట దర్శనమిస్తోంది. చంద్రబాబు ఎంత గొంతు చించుకున్నా మేము రాం, కలవం, ఇలాగే ఉంటామని కొంతమంది నేతలు గట్టిగానే చెబుతున్నారు. అధికారంలో ఉన్నపుడు చంద్రబాబుని ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన వారు ఇపుడు ఎక్కడా చడీ చప్పుడు చేయడంలేదు. టీడీపీ భవిష్యత్తును వారు ముందే వూహించారా లేక అలా తయారుచేయాలనుకుంటున్నారా అంటే జవాబు కూడా సులువే. చంద్రబాబు చేతిలో ఏ రకమైన అధికారం లేదు. కనీసం ఎమ్మెల్సీని, ఒక రాజ్యసభ సభ్యున్ని గెలిపించుకుందామనుకుంటే కూడా అవసరమైన ఎమ్మెల్యేలు లేరు. దాంతో చంద్రబాబు ఏమిస్తారు, ఆయన దగ్గర ఏముందన్న ఉదాసీన భావంతోనే నాయకులు పార్టీ మీటింగులకు రావడం లేదని అంటున్నారు.

పుట్టె మునగడం ఖాయమా?

ఇలా అయితే టీడీపీ పుట్టె మునగడానికి ఎంతో కాలం పట్టదేమని అంటున్నారు. బలమైన నాయకులు, నమ్మిన వారు నాయకుని వెంట ఉండాలి. మరో వైపు చూస్తే జగన్ పదేళ్ళుగా అధికారంలో లేరు. ఎవరికీ ఏ రకమైనా సాయం చేసే స్థితిలో లేరు. కానీ వైసీపీ విపక్షంలో ఉన్నపుడు జగన్ వెన్నంటి ఎంతో మంది నాయకులు కనిపించేవారు. అదే ప్రతిపక్షంలోకి చంద్రబాబు ఇలా రాగానే అలా తమ్ముళ్ళు కనబడకుండా పక్క చూపులు చూస్తున్నారంటే పార్టీ మీద, నేత మీద ఎంతటి విశ్వాసం వుంచారో అర్ధమవుతోందని అంటున్నారు. మరో వైపు చంద్రబాబుకు వయసు అయిపోయింది, టీడీపీకి కూడా వయసు అయిపోయింది, లోకేష్ నాయకత్వం అంటే ఎవరికీ లెక్కే లేదు. గురి అంతకంటే లేదు. దాంతోనే టీడీపీ భవిష్యత్తు చంద్రబాబు కంటే బాగా వూహించిన తెలివైన నాయకులు ఇలా తప్పుకుంటున్నారని తెలుస్తోంది. ఇదే స్థితి కొనసాగితే మాత్రం చంద్రబాబు కళ్ల ముందే పార్టీ పుట్టె నిండా మునుగుతుందని అంటున్నారు.

Tags:    

Similar News