తమ్ముళ్ళకు వైసీపీ ఫుల్ సపోర్ట్ ?

వైసీపీకి టీడీపీకి అసలు పడదు, ఉప్పూ నిప్పులా వారు ఉంటారు. ఏపీ రాజకీయం ఇంతలా భీకర పోరుగా మారడానికి ఈ వైషమ్యాలే కారణం. అయితే ఇది పై [more]

Update: 2020-11-02 14:30 GMT

వైసీపీకి టీడీపీకి అసలు పడదు, ఉప్పూ నిప్పులా వారు ఉంటారు. ఏపీ రాజకీయం ఇంతలా భీకర పోరుగా మారడానికి ఈ వైషమ్యాలే కారణం. అయితే ఇది పై స్థాయిలోనే ఉంది. క్షేత్ర స్థాయిలో మాత్రం ఇపుడిపుడే సీన్ మారుతోంది. అధికారంలోకి రాకముంది టీడీపీ తమ్ముళ్ళు అంటే మండిపడే వైసీపీ క్యాడర్ ఇపుడు సయోధ్యను కోరుకుంటున్నారుట. దీనికంతటికీ కారణం నిండా అసంతృప్తి వారిలో ఉండడమే. పదేళ్ళ తరువాత కష్టపడి అధికారంలోకి వచ్చినా తగిన గౌరవ మర్యాదలు దక్కడంలేదన్నదే వారి ఆవేదనట. అదే సమయంలో వాలంటీర్ల వ్యవస్థ పైన ఏకంగా వైసీపీ నేతలు, క్యాడరే తీవ్ర వ్యతిరేకతతో ఉండడం విశేషం.

హవా అక్కడేగా ….?

వాలంటీర్ల వ్యవస్థను జగన్ తీసుకువచ్చిన తరువాత వైసీపీ కార్యకర్తలను జనాలు అసలు పట్టించుకోవడంలేదు. వారు నేరుగా సచివాలయానికి వెళ్ళి తమ పని చేసుకుని వస్తున్నారు. అర్హత ఉంటే చాలు రేషన్ కార్డు, ఇంటి స్థలం, ఇతర సంక్షేమ పధకాలు అన్నీ ఇచ్చేయమని జగన్ పెద్ద ఆర్డర్ వేశారు. దాంతో వాలంటీర్లు కూడా కేవలం అర్హతలు చూస్తున్నారు. వాటితో ఎవరు వచ్చినా ఎటువంటి అభ్యంతరం లేకుండా వారికి రావాల్సినవి ఇచ్చేస్తున్నారు. మరి మధ్యలో వైసీపీ క్యాడర్ కి ఇక్కడ విలువ ఏముంది. తాము చెప్పి చేయించామని బిల్డప్ ఇవ్వడానికి కూడా వీలు లేకుండా ఉంది.

రగులుతున్న క్యాడర్ ……

ఇక గ్రామాల్లోనే అసలైన రాజకీయం ఇపుడు సాగుతోంది. అక్కడ టీడీపీ ఒకనాడు జన్మభూమి కమిటీల పేరిట కధ నడిపింది. నాడు వైసీపీ కార్యకర్తలు అంటే చాలు పక్కన పెట్టేసేవారు. అలాగే వైసీపీ అభిమానులు అని కూడా వివక్ష చూపించేవారు. దీంతో తమ్ముళ్ళ అధికార దర్పం నాడు సర్పంచుల కంటే కూడా ఎక్కువగా వెలిగిపోయేది. ఈ పరిణామాలను చూసిన వైసీపీ క్యాడర్ తాము అధికారంలోకి వస్తే ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకోవాలని కలలు కన్నారు. తాము పవర్ లోకి వస్తే టీడీపీ తమ్ముళ్ళకు చుక్కలు చూపించాలని కూడా భావించారు. కానీ ఇపుడు ఏమీ చేయలేక చేతులు ముడుచుకుంటున్నారుట.

ఫిర్యాదులకు మద్దతు….

వాలంటీర్ల వ్యవస్థ మీద ఇపుడు టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. అక్కడ సరిగ్గా పనులు కావడంలేదని ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. నిజానికి టీడీపీదీ ఇదే బాధ. తమ వారి కోసం పనులు చేయించుకోవాలని చూస్తే అనర్హత పేరిట పక్కన పెడుతున్నారన్నది వారి బాధ. అయితే నిబంధలన ప్రకారమే వాలంటీర్లు తమ పని తాము చేస్తున్నా గ్రామంలో పెత్తనం చేయాలనుకునే చోటా మోటా నాయకులకు మాత్రం ఇది భరించరానిదవుతోంది. దాంతో వారు ఫిర్యాదులు చేస్తున్నారు. ఉత్తరాంధ్రాలోని అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లాలో ఈ రకమైన ఫిర్యాదులు టీడీపీ చేస్తూంటే వైసీపీ నుంచి కూడా మద్దతు లభిస్తోందిట. తాము అనుకున్న పనిని ప్రత్యర్ధి పార్టీ చేస్తోందని సంబరపడుతోందిట. ఏది ఏమైనా వాలంటీర్ల వ్యవస్థ అంటే జగన్ మానస పుత్రిక. అది వైసీపీ నేతలకే నచ్చకపోవడం విడ్డూరమే. కానీ జగన్ మాత్రం ఫీడ్ బ్యాక్ ని వారి నుంచే నేరుగా తీసుకుంటూండడం కొసమెరుపు.

Tags:    

Similar News