వంశీ క్లోజ్ ఫ్రెండ్ కూడా జంప్ అట

టీడీపీకి కంచుకోట వంటి కృష్ణా జిల్లాలో ఆ పార్టీ బ‌ల‌హీన ప‌డుతోంద‌నే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి 2014లో స‌త్తా చాటిన నాయ‌కులు ఈ ఏడాది జ‌రిగిన [more]

Update: 2019-11-23 09:30 GMT

టీడీపీకి కంచుకోట వంటి కృష్ణా జిల్లాలో ఆ పార్టీ బ‌ల‌హీన ప‌డుతోంద‌నే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి 2014లో స‌త్తా చాటిన నాయ‌కులు ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో చ‌తికిల ప‌డ్డారు. ఇక్కడి మొత్తం 16 నియోజ‌క‌వ‌ర్గాల్లో కేవ‌లం రెండు చోట్ల మాత్రమే వైసీపీ విజ‌యం సాధించింది. ఇప్పుడు ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఒక‌టి గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీ పార్టీకి రాజీనామా చేశారు. ఇక‌, ఇక్కడ ఒక్కరే మిగులుతారు. అయితే, ఇప్పుడు ఓడిపోయిన వారిలోనూ ఒక‌రిద్దరు జంప్ చేసేందుకు రెడీగా ఉన్నార‌ని తెలుస్తోంది. ప్రధానంగా వల్లభనేని వంశీకి క్లోజ్ ఫ్రెండ్ అయిన పెన‌మ‌లూరు మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ బోడే ప్రసాద్ ప‌క్క చూపులు చూస్తున్నార‌ని అంటున్నారు.

డబ్బుల విషయంలో క్లారిటీ ఇచ్చినా….

2014లో పెనమలూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బోడే ప్రసాద్ మొన్న ఎన్నికల్లో మాజీ మంత్రి కొలుసు పార్థసారథి చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయిన బోడే ప్రసాద్ మొన్న వంశీ ఎపిసోడ్ తర్వాత తెరపైకి వచ్చారు. ఎన్నికల్లో ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ కు బోడే ప్రసాద్ డబ్బులు ఇచ్చారని వంశీ ఆరోపణలు చేయడంతో, వాటికి వివరణ ఇచ్చారు. తాను డ‌బ్బులు ఎవ‌రికీ ఇవ్వలేద‌న్నారు. అంతే త‌ప్ప.. అటు పార్టీ అధినేత చంద్రబాబును, పార్టీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి లోకేష్‌ను ఉతికి ఆరేసిన వంశీపై ఒక్కమాటంటే ఒక్కమాట కూడా అన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కానీ కృష్ణా జిల్లాలోని మిగిలిన నాయ‌కులు వంశీని మ‌న‌సారా తిట్టి పోశారు. ఇప్పటికీ తిడుతూనే ఉన్నారు.

కాల్ మనీ కేసు కూడా….

ఈ నేప‌థ్యంలో బోడే ప్రసాద్ ఫ్యూచ‌రేంటి? ఆయ‌న ఇప్పటి వ‌ర‌కు చంద్రబాబును వెనుకేసుకు వ‌చ్చి.. వంశీని ఒక్కమాటైనా అన‌క‌పోవ‌డం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అనే కోణంలో చ‌ర్చ సాగుతోంది. వాస్తవంగా బోడే ప్రసాద్, వంశీ మంచి స్నేహితులు. అందుకే రాజేంద్రప్రసాద్ విష‌యంలో తూతూ మంత్రంగా త‌న‌కు ఆయ‌న‌కు న‌గ‌దు లావాదేవీలు లేవ‌ని చిన్న వివ‌ర‌ణ ఇచ్చి స‌రిపెట్టేశారు. వంశీలా ఘాటుగా మాట్లాడ‌లేదు. అయితే, గ‌త ప్రభుత్వంలో తెర‌మీదికి వ‌చ్చిన కాల్ మ‌నీ కేసులో కీల‌క వ్యక్తిగా బోడే ప్రసాద్ పై కేసులు ఉన్నాయి. అదే స‌మ‌యంలో టీడీపీలో ఆయ‌న ఉన్నప్పటికీ.. పెన‌మ‌లూరులో ఆయ‌న‌కు వ్యతిరేకంగా గ్రూపు రాజ‌కీయాలు సాగుతున్నాయి. ఈ రెండు విష‌యాల్లోనూ చంద్రబాబుకు బోడే ప్రసాద్ గ‌తంలోనే విన‌తులు స‌మ‌ర్పించారు. త‌న‌ను లెక్క చేయ‌డం లేద‌ని పార్టీ నేత‌ల‌పై ఆయ‌న ఫిర్యాదు చేశారు. అయితే, ఇప్పటి వ‌ర‌కు కూడా చంద్రబాబు వాటిని ప‌రిష్కరించింది లేదు. అదే స‌మ‌యంలో పార్టీలో త‌న వాయిస్‌ను తొక్కి పెడుతున్నార‌నే వాద‌న కూడా ఉంది.

ఏకాకిగా మారతానని…..

ఈ నేప‌థ్యంలో ఇక‌, త‌న‌కు అంతో ఇంతో అండ‌గా ఉంటూ వ‌చ్చిన వంశీ ఇప్పుడు పార్టీ మార‌డంతో త‌ను మ‌రింత ఏకాకిగా మారిపోవ‌డం త‌థ్యమ‌ని బోడే ప్రసాద్ భావిస్తున్నారని తెలుస్తోంది. జిల్లాలో ఉమాతో పాటు మిగిలిన నేత‌ల‌తో ఆయ‌న పెద్దగా క‌ల‌వ‌రు. ఈ నేప‌థ్యంలో నే బోడే ప్రసాద్ పార్టీని వీడొచ్చనే అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది. తాను వైసీపీ ప్రభుత్వంపై ఎలాంటి విమ‌ర్శలు చేసినా.. గ‌తంలో ఆ పార్టీ నాయ‌కురాలు రోజాపై చేసిన తీవ్ర వ్యాఖ్యల కేసు, అన్నింటిక‌న్నా ముఖ్యమైన కాల్ మ‌నీ కేసు, బంద‌రురోడ్డు వెడ‌ల్పులో భూములు ఇవ్వ‌ని వారిని బెదిరించిన కేసులు బ‌య‌ట‌కు వ‌స్తే.. ఇబ్బందేన‌ని కూడా బోడే ప్రసాద్ భావిస్తున్నట్టు స‌మాచారం. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్పటి వ‌ర‌కు టీడీపీలో జ‌రుగుతున్న అంశాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఆయ‌న పార్టీలో ఉండ‌డం క‌న్నా బ‌య‌ట‌కు వ‌స్తేనే బెట‌ర‌ని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Tags:    

Similar News