వీళ్లిద్దరి పనీ ఇదేనా..?

వారిద్దరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తర్వాత కీలకమైన వ్యక్తులు. క్లిష్ట సమయంలో బయటకు వచ్చి ప్రత్యర్థులపై మాటలతూటాలు పేల్చాల్సిన వారు. ఓ వైపు చంద్రబాబు నాయుడు [more]

Update: 2019-03-08 05:00 GMT

వారిద్దరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తర్వాత కీలకమైన వ్యక్తులు. క్లిష్ట సమయంలో బయటకు వచ్చి ప్రత్యర్థులపై మాటలతూటాలు పేల్చాల్సిన వారు. ఓ వైపు చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రతీరోజు విమర్శలు గుప్పిస్తూ మీడియాలో ఉంటుంటే వారు మాత్రం కేవలం లేఖలు, ట్వీట్లకే పరిమితం అవుతున్నారు. ఈ ఇద్దరిలో మొదటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ వ్యవహారం, మరోవైపు ఫారం -7 ద్వారా ఓట్ల తొలగింపు ఆరోపణలు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న ఈ సమయంలో ఆయన ట్విట్టర్ కే పరిమితమయ్యారు. ఐటీ గ్రిడ్ వ్యహారంలో ఏకంగా సుమారు 20 ట్వీట్లు చేశారు లోకేష్.

ట్వీట్లు చేస్తే చాలా..?

ఈ ట్వీట్ల ద్వారా జగన్, కేసీఆర్, మోడీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. ఎద్దేవా చేశారు. ప్రత్యారోపణలు చేశారు. అంతా బాగానే ఉంది కానీ ఇంత చేస్తున్న ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంటుంది. మిగతా మంత్రులు మాట్లాడుతున్నా… లోకేష్ మాట్లాడితే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ వైపు నుంచి కేటీఆర్ మాట్లాడుతున్నందున ఆయనకు కౌంటర్ గా లోకేష్ మాట్లాడితేనే బాగుంటుంది అని అంటున్నారు. కానీ ఆయన మాత్రం ట్విట్టర్ కే పరిమితం అవుతున్నారు. దీంతో ఆయన మాటలు ప్రజల్లోకి పూర్తిగా వెళ్లడం లేదు.

లేఖలకే పరిమితమైన కళా

ఇక, ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకటరావు కూడా ఇదే పద్ధతి అవలంభిస్తున్నారు. రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ఆయన సైతం నేరుగా మీడియా ముందుకు రావడం లేదు. బహిరంగ లేఖల ద్వారా ప్రత్యర్థులను విమర్శిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లకు సమయానుసారం ఆయన బహిరంగ లేఖలు రాస్తున్నారు. టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలనే ఆయన లేఖ రూపంలో విడుదల చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతలూ చంద్రబాబు తర్వాత కీలకమైన వ్యక్తులు. మిగతా వారి కంటే వీరు మాట్లాడితే ప్రజల్లోకి ఎక్కువ వెళుతుంది. కానీ, వీరి మాత్రం ఒకరు లేఖలకు, ఒకరు ట్వీట్లకే పరిమితం అయ్యారు.

Tags:    

Similar News