గన్నవరాన్ని ఇక వదిలేసుకున్నట్లేనా?

గన్నవరం రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. నిత్యం గరం గరంగానే ఉంటాయి. అయితే గన్నవరంలో పట్టు సంపాదించేందుకు టీడీపీ ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదు. వైసీపీలో ఉన్న విభేదాలను [more]

Update: 2021-01-05 14:30 GMT

గన్నవరం రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. నిత్యం గరం గరంగానే ఉంటాయి. అయితే గన్నవరంలో పట్టు సంపాదించేందుకు టీడీపీ ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదు. వైసీపీలో ఉన్న విభేదాలను కనీసం సొమ్ము చేసుకునేందుకు కూడా టీడీపీ నేతలు ధైర్యం చేయడం లేదు. ఉన్న అవకాశాలను వాడుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించడం లేదు. దీంతో గన్నవరంపై టీడీపీ ఆశలు వదిలేసుకుందా? లేక సమయం కోసం మరింత వేచి చూడాలని భావిస్తుందా? అన్నది చర్చగా మారింది.

మొత్తం మూడు గ్రూపులు…..

గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ మూడు గ్రూపులున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ మీద గెలిచి వైసీపీకి మద్దతుగా నిలిచారు. మొన్నటి ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావుకు డీసీఎంఎస్ ఛైర్మన్ పదవి ఇచ్చి జగన్ సంతృప్తి పర్చారు. కానీ వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గాల మధ్య నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. జగన్ స్వయంగా ఇద్దరి చేతులు కలిపినా కూడా ఫలితం కన్పించడం లేదు.

నిత్యం ఘర్షణలే…..

ఏ అధికారిక కార్యక్రమం ఏర్పాటు చేసినా సరే రెండు వర్గాలు ఘర్షణకు దిగుతున్నాయి. తాజాగా పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలోనూ రెండు వర్గాలు కొట్టుకున్నాయి. దీంతో వైసీపీలో ఈ రెండు వర్గాలు ఇక కలిసే అవకాశం లేదని జరుగుతున్న పరిణామాలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే వల్లభనేని వంశీతో పాటు వైసీపీలోకి వచ్చిన కొందరు నేతలు అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ మాత్రం….

ఈ నేపథ్యంలో తెలుగుదేశం బలోపేతానికి నేతలు శ్రమపడాల్సి ఉంది. వల్లభనేని వంశీ పార్టీని వీడి వెళ్లిపోయిన చాలా రోజుల తర్వాత చంద్రబాబు గన్నవరం నియోజకవర్గానికి బచ్చుల అర్జునుడును ఇన్ ఛార్జిగా నియమించారు. ఆయన గన్నవరంపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నారు. బలమైన, ఇమేజ్ ఉన్న వల్లభనేని వంశీ ని ఎదుర్కొనాలంటే ఇప్పటి నుంచే శ్రమించక తప్పదు. కానీ టీడీపీ నేతలు మాత్రం ఆ ప్రయత్నాల్లో లేరు. మరి అంది వచ్చిన అవకాశాన్ని టీడీపీ నేతలు ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారన్నది ఆ పార్టీ క్యాడర్ కు మాత్రం ప్రశ్నగానే ఉంది.

Tags:    

Similar News