జగన్ ఇలాకాలో టీడీపీ ఆశలు ఫలిస్తాయా..?

కడప జిల్లాలో ఈసారి ఫ్యాను గాలికి బ్రేక్ వేయాలని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా శ్రమించింది. అన్ని నియోజకవర్గాలనూ ముందునుంచే టార్గెట్ చేసి విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డింది. [more]

Update: 2019-04-28 01:30 GMT

కడప జిల్లాలో ఈసారి ఫ్యాను గాలికి బ్రేక్ వేయాలని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా శ్రమించింది. అన్ని నియోజకవర్గాలనూ ముందునుంచే టార్గెట్ చేసి విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్న మైదుకూరు నియోజకవర్గంలో ఈసారి పసుపు జెండా ఎగరేసేందుకు టీడీపీ నేతలు బాగానే కష్టపడ్డారు. దీంతో ఆ పార్టీ మైదుకూరుపై బాగానే ఆశలు పెట్టుకుంది. ఇక్కడి నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పుట్టా సుధాకర్ యాదవ్ గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇక, సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే శ్రమించింది. దీంతో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.

అభివృద్ధి క్రెడిట్ పుట్టాకే…

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుధాకర్ యాదవ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రఘురామిరెడ్డి 11,522 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 30 ఏళ్ల పాటు నియోజకవర్గంలో డీఎల్ రవీంద్రారెడ్డి, రఘురామిరెడ్డి మధ్యే ఆరు ఎన్నికల్లో పోటీ జరిగింది. ఇందులో డీఎల్ నాలుగుసార్లు, రఘురామిరెడ్డి రెండుసార్లు గెలిచారు. వీరికి ప్రత్యామ్నాయంగా 2014లో పుట్టా సుధాకర్ యాదవ్ వచ్చారు. బీసీ సామాజకవర్గం నేత కావడం, ఆర్థికంగా బలంగా ఉండటంతో ఆయన స్వల్ప కాలంలోనే నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగారు. దీంతో గత ఎన్నికల్లోనే ఆయన వైసీపీకి గట్టి పోటీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఆయనకు టీటీడీ ఛైర్మెన్ పదవి కూడా దక్కింది. గత ఎన్నికల్లో ఓడినా అధికార పార్టీ నియోజకవర్గ ఇంఛార్జిగా నియోజకవర్గంలో పుట్టా చక్రం తిప్పారు. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిపించారు. ఎమ్మెల్యేగా రఘురామిరెడ్డి ఉన్నా అభివృద్ధి క్రిడిట్ మాత్రం పుట్టా ఎగరేసుకొని పోయారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న సీనియర్ నేత, ఇక్కడ ఆరుసార్లు గెలిచిన డీఎల్ రవీంద్రారెడ్డి మొదట వైసీపీ టిక్కెట్ కోసం, తర్వాత టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నించారు.

వైసీపీకే మొగ్గు ఉన్నా….

తెలుగుదేశం పార్టీ టిక్కెట్ కోసం ఆయన అనేక ఆశలు పెట్టుకున్నా పుట్టా భీష్మించడంతో ఆయనకే టిక్కెట్ దక్కింది. దీంతో డీఎల్ రవీంద్రారెడ్డిని వైసీపీలోకి ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్నారు జగన్. డీఎల్ చేరిక మైదుకూరులో వైసీపీకి బాగా కలిసివచ్చింది. నియోజకవర్గంలో బలమైన నేతలుగా ఉన్న డీఎల్, రఘురామిరెడ్డి ఒక్కటవడంతో వైసీపీ మొగ్గు పెరిగింది. ఇక, పుట్టా సుధాకర్ యాదవ్ కూడా తీవ్ర పోటీ ఇచ్చారు. ముఖ్యంగా డబ్బు విషయంలో ఆయన ఎక్కడా వెనక్కు తగ్గలేదు. మొత్తానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైదుకూరులో విజయావకాశాలు కనిపిస్తున్నా తెలుగుదేశం పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చింది. ఎవరు గెలిచినా 10 వేలకు మించి మెజారిటీ వచ్చే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.

Tags:    

Similar News