ఆ ఈక్వేషన్ కోడెల కుటుంబం కొంపముంచుతుందా?

టీడీపీలో గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ రాజ‌కీయంపై హాట్ హాట్ చ‌ర్చ న‌డుస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎవరికి ద‌క్కుతుంది? ఎవ‌రు యాక్టివ్‌గా ఉంటారు ? అనేది [more]

Update: 2020-03-30 08:00 GMT

టీడీపీలో గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ రాజ‌కీయంపై హాట్ హాట్ చ‌ర్చ న‌డుస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎవరికి ద‌క్కుతుంది? ఎవ‌రు యాక్టివ్‌గా ఉంటారు ? అనేది ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది. గ‌తంలో దివంగత కోడెల శివ‌ప్రసాద‌రావు ఇక్కడ నుంచి విజ‌యం సాధించి ఏపీ స్పీక‌ర్‌గా కూడా ప‌ద‌వి నిర్వహించారు. అయితే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోవ‌డం, త‌ర్వాత వివిధ కార‌ణాల‌తో ఆత్మహత్యకు పాల్పడడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సీటు విష‌యం ఇప్పటికీ చ‌ర్చనీయాంశంగా మారింది. కోడెల చ‌నిపోయిన‌ప్పటి నుంచి ఇక్కడ టీడీపీ ఇన్‌చార్జ్‌గా చంద్రబాబు ఎవ‌రిని నియ‌మించ‌లేదు.

కోడెల కుమారుడికి…..

కొద్ది రోజుల క్రిత‌మే ఏపీలో ఖాళీ అయిన నియోజ‌క‌వ‌ర్గాల‌కు కొత్త ఇన్‌చార్జ్‌ల‌ను నియ‌మించిన చంద్రబాబు బాప‌ట్లలో వేగేశ‌న న‌రేంద్రవ‌ర్మ, ప్రత్తిపాడులో మాజీ మంత్రి మాకినేని పెద‌ర‌త్తయ్య, మాచ‌ర్లలో కొమ్మారెడ్డి చ‌ల‌మారెడ్డికి బాధ్యత‌లు అప్పగించారు. స‌త్తెన‌ప‌ల్లిలో మాత్రం ఎవ్వరిని నియ‌మించ‌లేదు. కోడెల కుమారుడు డాక్టర్ శివ‌రామ‌కృష్ణ ఈ టికెట్‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, ఆయ‌న‌పై ప‌లు కేసులు న‌మోదు కావ‌డంతో ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. అయితే, ఈయ‌న స‌త్తెన‌ప‌ల్లి క‌న్నా కూడా త‌న తండ్రి ఆది నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన న‌ర‌స‌రావుపేట‌పై మ‌క్కువ పెంచుకున్నారు.

ఆ సీటు ఒక్కటే…?

అయితే, ఈ సీటును గ‌త ఎన్నిక‌ల్లో చ‌ద‌ల‌వాడ అర‌వింద్ బాబుకు చంద్రబాబు కేటాయించారు. దీంతో ఆయ‌న ఇక్కడే మ‌కాం వేశారు. ఆయ‌న బీసీ వ‌ర్గానికి చెందిన నేత కావ‌డంతో పాటు ఎన్నిక‌ల్లో ఓడినా న‌రసారావుపేట‌లో పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గానే ఉంటున్నారు. దీంతో ఆయ‌న్ను త‌ప్పించ‌డం అసాధ్యమే అవుతుంది. ఈ ప‌రిణామాల‌తో న‌ర‌స‌రావు పేట సీటును కోడెల‌ శివరామకృష్ణకు కేటాయించే అవ‌కాశం లేదు. మ‌రి స‌త్తెన‌ప‌ల్లి ఒక్కటే ఇప్పుడు కోడెల కుటుంబానికి మిగిలింది.

రాధాకు ఇవ్వాలని….

ఈ క్రమంలో స‌త్తెన‌ప‌ల్లిని ఆయ‌న‌కు చంద్రబాబు కేటాయిస్తారా లేదా అనేది ప్రశ్నగానే మిగిలింది. ప్రస్తుతం ఇక్కడ ఇంచార్జ్ లేకపోవ‌డం గ‌మ‌నార్హం. పార్టీ కార్యక్రమాల‌ను ప‌ట్టించుకునే నాథుడు కూడా లేడు. ఇదిలావుంటే, విజ‌య‌వాడ‌కు చెందిన వంగ‌వీటి రాధాకు ఈ సీటును అప్పగిస్తార‌నే ప్రచారం కొంద‌రు త‌మ్ముళ్ల మ‌ధ్య సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కాపు వ‌ర్గం ఎక్కువ‌గా ఉండ‌డంతో వంగ‌వీటి ఇక్కడ సునాయాశంగా విజ‌యం సాధిస్తార‌ని టీడీపీలో చ‌ర్చ సాగుతోంది.

రాయపాటి కుటుంబం కూడా….

స‌త్తెన‌ప‌ల్లిలో కాపుల‌తో పాటు క‌మ్మ వ‌ర్గం కూడా బ‌లంగా ఉంది. ఇక్కడ రాధాకు బాధ్యత‌లు అప్పగిస్తే కాపు + క‌మ్మ ఈక్వేష‌న్ పార్టీకి క‌లిసి వ‌స్తుంద‌ని చంద్రబాబు ప్లాన్ వేశార‌న్న ప్రచారం జ‌రిగింది. అయితే మ‌ధ్యలో ఏమైందో గాని రాధాకు ఇంకా బాధ్యత‌లు ఇవ్వలేదు. మ‌రోప‌క్క రాయ‌పాటి వ‌ర్గం కూడా ఈ సీటుపై ఆశ‌లు పెట్టుకుంది. ఈ క్రమంలో అటు కోడెల‌, ఇటు రాయ‌పాటిల‌కు కాకుండా వంగ‌వీటి కి ఇస్తే ఎవ‌రితోనూ విభేదాలు ఉండ‌బోవ‌న్నది టీడీపీ ఆలోచ‌న‌గా ఉంది. ఏదేమైనా ఇంత ట‌ఫ్ కాంపిటేష‌న్ నాలుగు ద‌శాబ్దాల కోడెల ఫ్యామిలీ రాజ‌కీయం గుంటూరు జిల్లాలో ఉంటుందా ? కోడెల‌తోనే ప‌రిస‌మాప్తి అవుతుందా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News