కొత్తగా ఏమీ లేదే… పెదవి విరుపులేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ఱ్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులను నియమించారు. అయితే ఇందులో నోరున్న వాళ్లు పెద్దగా లేరు. అంతేకాదు యువతకు ప్రాధాన్యం [more]

Update: 2020-09-27 11:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ఱ్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులను నియమించారు. అయితే ఇందులో నోరున్న వాళ్లు పెద్దగా లేరు. అంతేకాదు యువతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు చంద్రబాబు కొంత ప్రయత్నం చేశారనే చెప్పాలి. పాత నేతలను, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన వారిని ఇన్ ఛార్జులుగా చంద్రబాబు నియమించారు. అన్ని సామాజిక వర్గాల వారికీ ప్రాధాన్యత కల్పించేందుకు చంద్రబాబు కసరత్తు చేసినట్లు కనపడుతుంది.

నోరున్న నేతలు ఎవరూ…..

కూనరవికుమార్, జవహర్, కొనకళ్ల నారాయణ, శ్రావణ్ కుమార్, కాల్వ శ్రీనివాసులు, డీకే పార్థసారధి వంటి వారే కొంత నోరున్న నేతలు. మిగిలిన ఇన్ ఛార్జులు పెద్దగా దూకుడుగా వ్యవహరించలేరన్న వ్యాఖ్యలు పార్టీ నుంచే వినపడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి కూన రవికుమార్ ఎంపిక సరైందే. అయితే అదే సమయంలో యువత కోటాలో కిమిడి నాగార్జునకు విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించడాన్ని ఆ పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. ఆయన ఎవరికీ అందుబాటులో ఉండని వ్యక్తిగా పేరుండటమే దీనికి కారణం.

అవుట్ డేటెడ్ నేతలను……

కాకినాడ పార్లమెంటరీ బాధ్యతలను యువనేత జ్యోతుల నవీన్ కు అప్పగించారు. అదే సమయంలో రాజమండ్రి బాధ్యతలను కొత్తపల్లి జవహర్ కు కట్టబెట్టారు. ఇక విజయవాడ పార్లమెంటు చూసుకుంటే అవుట్ డేటెడ్ నేత నెట్టెం రఘురాంకు అప్పగించడంపై పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. నెట్టెం రఘురాం 1990వ దశకంలో పార్టీ యాక్టివ్ గా ఉండేవారు. ఆ తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. నెట్టెం రఘురాంకు పార్లమెంటరీ పార్టీ బాధ్యతలను అప్పగించడాన్ని పసుపు పార్టీ నేతలే తప్పుపడుతున్నారు.

ఇద్దరు మహిళలకు…

అనంతపురానికి ఊహించినట్లే మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను నియమించారు. హిందూపురం నియోజకవర్గానికి బీకే పార్థసారధిని నియమించారు. ఇక నంద్యాల పార్లమెంటును గౌరు వెంకటరెడ్డికి అప్పగించడం కూడా పార్టీ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు బాధ్యతలను షరా మామూలుగా సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు అప్పగించారు. ఇందులో యువతకు కూడా కొంత వరకూ ప్రాధాన్యత ఇచ్చారు. ముగ్గురు మహిళలకు ఈ జాబితాలో చంద్రబాబు చోటు కల్పించారు. మొత్తం మీద పార్టీని పెద్దగా ప్రభావం చేసే విధంగా ఎంపిక లేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News