చెప్పకూడదంటూనే అంతా?

స్పీకర్ పదవి అన్నది రాజ్యాంగ బద్ధంగా రాజకీయాలకు సంబంధం లేనిదిగా నిర్వచించబడింది. అయితే కొన్ని దశాబ్దాలుగా అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రాల వరకు చేయకూడదు, చెప్పకూడదు [more]

Update: 2020-01-19 16:30 GMT

స్పీకర్ పదవి అన్నది రాజ్యాంగ బద్ధంగా రాజకీయాలకు సంబంధం లేనిదిగా నిర్వచించబడింది. అయితే కొన్ని దశాబ్దాలుగా అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రాల వరకు చేయకూడదు, చెప్పకూడదు అన్న పనులనే స్పీకర్ లు చేస్తూ విమర్శల పాలౌతున్నారు. ఈ విషయంలో పార్లమెంట్ ఉభయ సభల్లో సంప్రదాయ విలువలు పాటిస్తున్నా రాష్ట్రాల్లో స్పీకర్ ల హవా మాములుగా వుండటంలేదని న్యాయనిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవిభక్త ఎపి విభజన సమయంలో నాటి స్పీకర్ మీరా కుమారి వ్యవహరించిన తీరుపై ఇప్పటికి సుప్రీం కోర్టు లో కేసుగా నడుస్తుంది. అధికారపక్షం ఎటు ఉంటే స్పీకర్ ఆటే అన్నట్లు గా వున్నప్పుడు వారికి ఒక పార్టీ కండువా కప్పేస్తే పోలా అని ప్రజాస్వామ్య వాదులు వెటకారం చేసేస్తున్నారు కూడా.

గతంలో యనమల, ఆ తరువాత …

ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడ్ని చేసిన సందర్భంలో స్పీకర్ గా వున్నారు యనమల రామకృష్ణుడు. ఆయనకు రాజకీయ భిక్ష ప్రసాదించిన ఎన్టీఆర్ ను కనీసం నిండు సభలో తన వేదన చెప్పుకోవడానికి సైతం ఆయన అనుమతి ఇవ్వలేదు. సభ్యుడిగా ఎన్టీఆర్ కు వున్న హక్కులను పూర్తిగా అణచివేశారనే విమర్శలను జీవితకాలం యనమలను వెంటాడుతూనే ఉంటాయనడంలో సందేహమే లేదు. కొన్ని సందర్భాల్లో నాడు సభలో తన వ్యవహార శైలిపై స్పీకర్ యనమల బాధ పడిన సందర్భాలు వున్నాయి. అయితే నాడు ఆ విధంగా యనమల వ్యవహరించకపోతే స్పీకర్ పదవిని సైతం బాబు పీకేసే పరిస్థితి ఉండటంతో ఈ విషయంలో రామకృష్ణుడు నిర్ణయాలను కొందరు తప్పుపట్టారు కానీ రాజ్యాంగ విలువలను ఆయన దిగజార్చారని విమర్శిస్తూనే వుంటారు.

కోడెల మరీ దారుణం …

ఒక స్పీకర్ ఎలా వుండకూడదో ఎపి రాజకీయాల్లో డాక్టర్ కోడెల శివప్రసాద్ నిరూపించేశారు. పల్నాడు పులిగా స్పీకర్ కాకముందు వరకు పేరున్న కోడెల ఆ తరువాత చంద్రబాబు పిల్లిగా మారిపోయారనే అపవాదు మూటగట్టుకున్నారు. ఇక చివరికి అసెంబ్లీ ఫర్నిచర్ కేసులనుంచి ఆయన కుటుంబం కె ట్యాక్స్ వసూలు ఆరోపణల వరకు ఆయన చివరి జీవితం చీకటి మయంగా మార్చేశాయి.

ఇప్పుడు తమ్మినేని ….

గతంలో స్పీకర్ లు బహిరంగంగా అధికారపార్టీలకు కొమ్ము కాస్తే నేను మాత్రం ఎందుకు తగ్గుతా అన్నట్లు వుంది ఎపి స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహార శైలి. ఆయన సైతం అధికారపార్టీ ఎమ్యెల్యే లేదా మంత్రి మాదిరి చేస్తున్న వ్యాఖ్యలు పలుసందర్భాల్లో విమర్శలకు దారితీస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాజధాని అంశంపై తమ్మినేని పార్టీ నాయకుడిలా విమర్శలు ఆరోపణలే కాదు విధానపర నిర్ణయాలు ముందే చెప్పేస్తూ అవన్నీ నేను చెప్పకూడదు అంటూ వ్యాఖ్యలు చేయడం విచిత్రం. నేను ముందు ఎమ్యెల్యేని ఆ తరువాతే స్పీకర్ ని అంటూ ఆ మధ్య తన నియోజకవర్గ రాజకీయాలపై ప్రత్యర్థుల పై విమర్శల వర్షం కురిపించిన సందర్భంలో చెలరేగారు తమ్మినేని. తాజాగా నేను ఉత్తరాంధ్ర వాసిగా తమ ప్రాంతంలో రాజధాని వుండాలని కోరుకుంటున్నా అంటూ అవన్నీ మాట్లాడకూడదు అంటూ చమత్కరిస్తున్నారు. ఇలా స్పీకర్ గా ఉన్నవారి వ్యవహారశైలి సాగడం పట్ల ప్రజాస్వామ్యవాదులు చూస్తూ వేదన చెందడం టివి చర్చల్లో వాపోవడం తప్ప ప్రయోజనం మాత్రం శూన్యమే.

Tags:    

Similar News