తమ్మినేని దారి చూపిస్తారా… ?

వైసీపీలో ఆయనది గౌరవప్రదమైన స్థానం. అదే స్పీకర్ పోస్ట్. రాజ్యాంగబద్ధమైన ఆ పదవిలో తమ్మినేని సీతారామ్ ని కూర్చోబెట్టి జగన్ న్యాయం చేశాను అనుకున్నారు. కానీ తనకు [more]

Update: 2021-08-27 12:30 GMT

వైసీపీలో ఆయనది గౌరవప్రదమైన స్థానం. అదే స్పీకర్ పోస్ట్. రాజ్యాంగబద్ధమైన ఆ పదవిలో తమ్మినేని సీతారామ్ ని కూర్చోబెట్టి జగన్ న్యాయం చేశాను అనుకున్నారు. కానీ తనకు అన్యాయం జరిగింది అన్నదే తమ్మినేని భావన. అయితే జగన్ మాటను కాదనలేక ఆయన వైసీపీ సర్కార్ ఏలుబడిలో ఇంటర్వల్ వరకూ కధ‌ నెట్టుకువచ్చారు. ఇక ముందుకు సాగలేను అనేస్తున్నారు. నాకు ఇస్తే మంత్రి పదవి ఇవ్వండి లేకపోతే స్పీకర్ పదవి కూడా వద్దు అంటూ కొత్తగా డిమాండ్లు పెడుతున్నట్లుగా టాక్. జగన్ నిజానికి పదవులలో శ్రీకాకుళం జిల్లాకు పెద్ద పీట వేశారు. అక్కడే డిప్యూటీ సీఎం ఉన్నారు. ఒక మంత్రి ఉన్నారు. స్పీకర్ ఉన్నారు. రేపో మాపో ఒక రాజ్య సభ ఎంపీ సీటు కూడా ఇవ్వనున్నారు.

పెద్దాయన మారాం…

ఇక తమ్మినేని సీతారామ్ విషయానికి వస్తే ఆయన మంత్రి పదవినే కోరుకుంటున్నారు. తన సత్తా చాటాలి అంటే చేతిలో అధికారం ఉండాల్సిందే అన్నది ఆయన భావన. దాని కోసం ఆయన జగన్ వద్దకు వెళ్ళి డైరెక్ట్ గా తన మనసులో మాటను అయితే చెప్పేశారు. నిజానికి ఎవరి విషయంలో ఎలా ఉన్నా తమ్మినేని సీతారామ్ అంటే జగన్ బాగా గౌరవం ఇస్తారు. దాంతో ఆయన తనకు ఇదే చివరి చాన్స్. ఇక ఎన్నికల్లో పోటీ చేసేది లేదు. గౌరవంగా తప్పుకోవాలంటే అమాత్య పీఠం అధిరోహించాల్సిందే అని గోడు వెళ్ళబోసుకున్నారుట. తనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ వద్దు అని అది కుమారుడి చిరంజీవి నాగ్ కి ఇవ్వాలని కూడా మరో రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నారుట.

చాన్స్ ఇస్తే ..?

తమ్మినేని సీతారామ్ విషయంలో సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి జగన్ ఏదో తలొగ్గి ఆయనకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం అయితే శ్రీకాకుళం జిల్లా వర్గాలలో వినిపిస్తోంది. దానికి తోడు జిల్లాలో రెండవ మంత్రిగా యువకుడు, వైద్యుడు అని అవకాశం ఇస్తే సీదరి అప్పలరాజు దూకుడు మరీ ఎక్కువ చేసి వచ్చిన ఛాన్స్ ని చెడగొట్టుకుంటున్నారు అన్నది కూడా ముఖ్యమంత్రికి చేరిన నివేదికలో ఉందిట. అందువల్ల ఆ విధంగా చూస్తే అప్పలరాజును తప్పిస్తారని, ఆ ఖాళీని కాళింగ సామాంజిక వర్గానికి చెందిన సీనియర్ నేత తమ్మినేని సీతారామ్ తో భర్తీ చేస్తారని అంటున్నారు. ఇక తమ్మినేనికి మంత్రి పదవి ఇవ్వాలని జగన్ కి అత్యంత ఆప్తుడు, సిక్కోలు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా గట్టిగా కోరుతున్నారుట.

క్యూ కట్టేస్తారా…?

తమ్మినేని సీతారామ్ కి కనుక జగన్ ఆఫర్ ఇస్తే మాత్రం వైసీపీ కొత్త క్యాబినెట్ మొత్తం సీనియర్లతోనే నిండిపోతుంది అంటున్నారు. నెల్లూరు నుంచి మాజీ మంత్రి ఆనం రామ‌నారాయణరెడ్డితో మొదలుపెట్టి సిక్కోలులోని ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్లు కూడా తమకూ చోటు అని డిమాండ్లు పెట్టేస్తారు. దాంతోనే జగన్ తటపటాయిస్తున్నారు అంటున్నారు. మొత్తానికి తమ్మినేని సీతారామ్ గేటు తీస్తే క్యాబినెట్ లోపలికి వెళ్ళేందుకు సీనియర్ల క్యూ చాలా పెద్దదిగానే ఉందిట. దీంతో జగన్ యూత్ క్యాబినెట్, ఎన్నికల క్యాబినెట్ ఆశలకు ఇది గండి కొట్టేలా ఉందని అంటున్నారు. మరి తమ్మినేని సీతారామ్ తో సహా ఎవరి డిమాండ్లను పట్టించుకోకుండా మొండిగా తన మనసులో అనుకున్న తీరుగానే కొత్త మంత్రులను తీసుకుంటారు అన్న మాట కూడా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News