తమ్మినేని మీద మరీ అంత పగా ?

తమ్మినేని సీతారామ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్. ఆయన రాజకీయ జన్మ టీడీపీ నుంచే జరిగింది. ఆయన సుదీర్ఘ కాలం పాటు ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. [more]

Update: 2021-02-17 08:00 GMT

తమ్మినేని సీతారామ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్. ఆయన రాజకీయ జన్మ టీడీపీ నుంచే జరిగింది. ఆయన సుదీర్ఘ కాలం పాటు ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక మంత్రిగా కూడా ఆయన సేవలు అందించారు. బలమైన కాళింగ సామాజికవర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్ కి ఎత్తులు ఎన్ని ఉన్నా కూడా నోటి ధాటి కూడా ఎక్కువ. అందుకే ఆయన శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కింజరాపు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడుల ధాటికి నిలబడలేకపోయారు అంటారు. ఇదిలా ఉంటే తొలి రెండు దశాబ్దాలు టీడీపీలో గడపిన తమ్మినేని సీతారామ్ ఆ తరువాత రెండు దశాబ్దాలు చంద్రబాబుకు ఎదురు నిలుస్తూ ప్రజారాజ్యం వైసీపీలలో కొనసాగారు.

సొంత ఇలాకలో ….

ఇక చంద్రబాబు నాయకత్వం పట్ల మొదట్లో మద్దతు ప్రకటించిన తమ్మినేని సీతారామ్ ఆ తరువాత ఆయన తనను పక్కన పెట్టి కింజరాపు సోదరులను బలపరచడంతో అసంతృప్తి వ్యక్తం చేశారని అంటారు. ఇక టీడీపీ నుంచి బయటపడిన తమ్మినేనికి చంద్రబాబే ప్రధాన టార్గెట్. ఆయన్ని విమర్శిస్తూ గట్టిగానే మాట్లాడుతారు. అయితే తమ్మినేని సీతారామ్ పట్ల చంద్రబాబుకు కూడా ఇంత రివెంజి ఉందని తాజాగా జరిగిన పరిణామాలతో తెలిసింది. అదేంటి అంటే తమ్మినేని సొంత నియోజకవర్గం ఆముదాలవలసలోని ఇలాకాగా ఉన్న తొగరాం పంచాయతీలో సర్పంచ్ పదవికి తన సతీమణి వాణిని పోటీకి పెట్టారు. దీన్ని ఏకగ్రీవం చేయాలని కూడా అనుకున్నారు.

బాబు రంగ ప్రవేశం ….

నిజానికి చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక తమ్మినేని సీతారామ్ టీడీపీలో కూడా పనిచేసిన నేత. ఆయన సొంత ఇలాకాలో సర్పంచ్ పదవి విషయంలో ఏకగ్రీవం కోసం లోకల్ టీడీపీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. తన బాధ ఏదో తాను పడుతున్నారు. కానీ మధ్యలో చంద్రబాబు ఎంట్రీనే విచిత్రంగా ఉంది. టీడీపీ లీడర్లకు ఫోన్ చేసి మరీ తమ్మినేని సీతారామ్ సతీమణి మీద టీడీపీ పోటీ చేసి తీరాల్సిందే అంటూ పట్టుపట్టి మరీ నామినేషన్ వేయించారు. అది కూడా తమ్మినేనికి వదిన గా ఉన్న భారతమ్మ ద్వారా నామినేషన్ వేయించి మరీ గట్టి షాక్ ఇచ్చేశారు.

ఎదగకూడదనే….?

తమ్మినేని సీతారామ్ తన తరువాత అటు కుమారుడు నాగ్ చిరంజీవిని రాజకీయాల్లోకి తెస్తున్నారు. అదే విధంగా భార్య సర్పంచ్ అయితే ఆముదాలవలసలో పట్టు పెరుగుతుందని భావించే ఆదిలోనే అడ్డుకట్ట వేయడానికే బాబు ఇలా ఫోన్ ద్వారా మరీ సీన్ లోకి వచ్చేశారు అంటున్నారు. అంతే కాదు తమ్మినేని సీతారామ్ తనను కాదని వెళ్లి ఎదురు నిలిచిన తీరు పట్ల కూడా బాబు ఆగ్రహించే ఈ విధంగా రివెంజ్ తీర్చుకుంటున్నారు అంటున్నారు. బాబు వైఖరి తెలిసిన వారు ఆయన ఎవరితోనూ గొడవలకు దిగరు అని చెబుతారు. తనను ఎన్ని మాటలు అన్నా కూడా చాలా మందిని అక్కున చేర్చుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ కొన్ని కేసులలో మాత్రం ఆయన అందరి లాంటి రాజకీయమే చేస్తారని, తమ్మినేని సీతారామ్ అలా బాబుకు శాశ్వత శత్రువు అని రుజువు చేసుకున్నారని అంటున్నారు. మొత్తానికి తమ్మినేని బాబుల మధ్య సమరం ఇక మీదట కూడా కొనసాగాల్సిందే అన్న మాట.

Tags:    

Similar News