మామ పట్టిన భరతం…!

రాజకీయాలందు సిక్కోలు రాజకీయం వేరయా అంటున్నారు. ఇక్కడ పార్టీలు ఉండవు కుటుంబాలు ఉంటాయి. మరో వైపు కుటుంబాలు ఉండవు. పార్టీలు మాత్రమే ఉంటాయి. చూస్తే పూర్తిగా పరస్పర [more]

Update: 2019-08-30 03:30 GMT

రాజకీయాలందు సిక్కోలు రాజకీయం వేరయా అంటున్నారు. ఇక్కడ పార్టీలు ఉండవు కుటుంబాలు ఉంటాయి. మరో వైపు కుటుంబాలు ఉండవు. పార్టీలు మాత్రమే ఉంటాయి. చూస్తే పూర్తిగా పరస్పర విరుద్ధంగా ఉంది కదా. అదే సిక్కోలు రాజకీయమంటే. కింజరపు ఫ్యామిలీ, ధర్మాన కుటుంబం పార్టీలకు అతీతంగా మూడున్నర దశాబ్దాలుగా కలసి ఉంటారు. ఒకరి గెలుపు కోసం మరొకరు సహాయ‌పడతారు. పొరపాటున కూడా బయటకు గట్టిగా పెద్దగా తిట్టుకున్నట్లు కనిపించరు. తాజా ఎన్నికల్లో శ్రీకాకుళంలో వైసీపీ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గెలిచినా, టెక్కలిలో మరో మాజీ మంత్రి, టీడీపీ నేత కింజారపు అచ్చెన్నాయుడు గెలిచినా, అబ్బాయి రామ్మోహననాయుడు రెండుసార్లు శ్రీకాకుళం ఎంపీగా విజయకేతనం ఎగురవేసినా కూడా అది కుటుంబాల గొప్ప తప్ప పార్టీలది కానే కాదంటారు. ఇవన్నీ ఇలా ఉంచితే ఇదే జిల్లాలో మరో కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో మాత్రం రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతూ అనుబంధాలను వేరు చేస్తున్నాయి. పార్టీలు వచ్చి చిచ్చు పెట్టి నువ్వా నేనా అని సవాల్ చేస్తున్నాయి. వారే ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన సొంత మేనల్లుడు, మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్. ఇపుడు కూన రవికుమార్ రచ్చ జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు రేకెత్తిస్తోంది.

మేనమామతో పెట్టుకున్నారా…?

ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తాజాగా వివాదాల్లోకి వచ్చారు. ఆయన ఏకంగా ప్రభుత్వ అధికారులను బెదిరించి సర్కార్ కార్యాలలయంలోనే తన మందీ మార్బలంతో హల్ చల్ చేసిన ఘటన ఏపీవ్యాప్తంగా చర్చగా ఉంది. దీని మీద కూనకు అరెస్ట్ వారెంట్లు కూడా వెళ్ళాయి. దీనికి కారణం వెనకాల ఆయన సొంత మేనమామ స్పీకర్ తమ్మినేని సీతారాం అని అంతా అంటున్నారు. తమ్మినేని సీతారాం 1999 ఎన్నికల తరువాత సరిగ్గా 20 ఏళ్ళకు ఆముదలవలస నుంచి గెలిచారు. ఆయన టీడీపీలో ఉన్నపుడు పక్కన ఉన్న మేనల్లుడు కూన రవికుమార్ తరువాత కాలంలో ఏకు మేకు అయ్యాడు. 2008లో టీడీపీని తమ్మినేని సీతారాం వీడి ప్రజారాజ్యంలో చేరినపుడు వెంట రాని కూన రవికుమార్ టీడీపీలోనే ఉండిపొయారు. అలా 2009, 2014 ఎన్నికల్లో రెండు మార్లు తమ్మినేని సీతారాంని ఓడించిన ఘనత‌ మేనల్లుడు కూన రవికుమార్ కు దక్కింది. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ తరఫున మామ జెండా ఎగరేశారు. ఇక గతంలో తమ్మినేని సీతారం ప్రతిపక్షంలో ఉన్నపుడు కూన రవికుమార్ ఆయన్ని ఇలాగే అల్లరిపెట్టి పోలీస్ స్టేషన్ దాకా తీసుకువచ్చి అరెస్టులు చేయించిన ఘటనలు ఉన్నాయి. ఇపుడు మామ చేతికి అధికారం వచ్చింది, అందుకే కూన రవికుమార్ అరెస్ట్ కోసం ఆయన వ్యూహ రచన చేశారని అంటున్నారు.

సోలోగానే తమ్మినేని పట్టు….

ఇక శ్రీకాకుళం జిల్లాలో తమ్మినేనిది ఒక స్థాయి రాజకీయం. ఆయన టీడీపీలో ఉన్నా కూడా కింజరపు సోదరులతో అంటీముట్టనట్లుగానే ఉండేవారు. మరో వైపు అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్న ధర్మానతో ఎటూ పోరాటం ఉండేది. ఇపుడు వైసీపీ అధికారంలోకి వచ్చినా కూడా తమ్మినేని సీతారాం సొంతంగా పోరాటమే చేస్తున్నారని అంటున్నారు. ఆయన కంటే కూడా మేనల్లుడు కూన రవికుమార్ పలుకుబడి ఎక్కువగా ఉంటోంది. దానికి కారణం ఆయన వెనకాల అచ్చెన్న, ఆయనకు దన్నుగా ధర్మాన కుటుంబం ఉండడమేనని అంటున్నారు. ఈ దన్నుతో కూన తానే ఆముదాల వలస ఎమ్మెల్యేగా భావిస్తూ అధికారులను సైతం ఇదివరకు మాదిరిగా దబాయించడమంతోనే తమ్మినేని సీతారాంకి అడ్డంగా దొరికారు. ఇక తమ్మినేని సీతారాం స్పీకర్ గా అయినా కూడా కూన తన దూకుడు తగ్గించకుండా ఏకంగా మామ‌ మీదకే సవాల్ చేస్తూ రావడంతో ఇపుడు కూనను బంధించాలని తమ్మినేని చూస్తున్నారని టాక్. నాడు మామను అరెస్ట్ చేయించి అల్లుడు భరతం పడితే ఇపుడు అల్లుడిని అరెస్ట్ చేయించి మామ భరతం పడుతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కుటుంబాలు, పార్టీల మధ్య రంజైన రాజకీయం సాగుతోందని అంటున్నారు.

Tags:    

Similar News