తమ్మినేనితోనే తంటా…అంతా ?

ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపిన ఆయన తరువాత కాలంలో ప్రజారాజ్యం, అటునుంచి వైసీపీలో చేరి స్పీకర్ గా ప్రస్తుతం [more]

Update: 2020-04-30 02:00 GMT

ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపిన ఆయన తరువాత కాలంలో ప్రజారాజ్యం, అటునుంచి వైసీపీలో చేరి స్పీకర్ గా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. ఇక తమ్మినేని సీతారాం ఆవేశంలో, అతి ఉత్సాహంలో చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. తాజాగా ఆయన ప్రతిపక్ష పార్టీ నేత అవతారం ఎత్తారు. శ్రీకాకుళం జిలాల్లో అక్రమ మద్యం ఏరులై పారుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు ఎక్సైజ్ శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. నిజంగా ఇది ప్రభుత్వాన్ని నిలదీసినట్లే. ప్రతిపక్షాలకు ఆయుధం అందించినట్లే.

మీడియా ముందు…..

తాను ఇదే విషయం ముఖ్యమంత్రికి స్వయంగా చెప్పాలనుకున్నానని కానీ కరోనా వల్ల లాక్ డౌన్ నేపధ్యంలో కలవలేకపోయాయని తమ్మినేని సీతారాం అంటున్నారు. తన సొంత జిల్లాలో ఈ రకమైన దారుణాలు జరుగుతున్నాయని, అందుకే తాను నోరు మెదపకుండా ఉండలేకపోతున్నానని చెప్పేశారు. తాను తప్పనిసరిగా మీడియా ముందుకు రావాల్సిన అవసరం వచ్చిందని అంటున్నారు. ఇక తాను గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశానని, ఆ అనుభవంతో చెబుతున్నానని, ఇలాగేనా అక్రమ మద్యాన్ని కట్టడి చేయడం అంటూ తమ్మినేని సీతారాం విరుచుకుపడ్డారు. తన సొంత నియోజకవర్గం ఆముదాలవలసలో ఒక గది నిండా మద్యం బాటిళ్ళు ఉన్నాయని కూడా ఆయన అంటున్నారు.

తమ్ముళ్ళ బాణం…..

ఏకంగా ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన రాజ్యంగ బద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం జగన్ సర్కార్ని నిలదీసేలా మాట్లాడడంతో తమ్ముళ్ళకు ఎక్కడలేని బలం వచ్చేసింది. దాంతో ఇన్నాళ్ళూ సైలెంట్ గా ఉన్న ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కళా వెంకటరావు జగన్ మీద బాణాలు వేశారు. ఏం చేస్తోంది ఈ సర్కార్, మీ స్పీకరే చెప్పారు, మీది అసమర్ధ సర్కార్ అంటూ నిప్పులు చెరిగారు. అక్రమ మద్యం ఏరులై పారుతూంటే మద్య నిషేధం అని కబుర్లు చెబుతారేం అని కూడా అంటూ గట్టిగానే తగులుకున్నారు.

విభేదాలా…?

నిజానికి తమ్మినేని సీతారాం తనకు తానుగానే జిల్లాలో మంత్రిగానే వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఆయనకు జిల్లాలో మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ తో రాజకీయ విభేదాలు ఉన్నాయని అంటున్నారు. ఇపుడు సమయం చూసుకుని మరీ ఆయన బాణాలు ఇలా వేశారని అంటున్నారు. జిల్లాలో అక్రమ మద్యం పారడం వెనక అధికార పార్టీ పెద్దల హస్తం ఉందని తమ్మినేని సీతారాం భావిస్తున్నారు. పైగా టీడీపీ, వైసీపీ నేతల చీకటి దోస్తీపైన కూడా ఆయన అనుమానిస్తున్నారు. అందుకే ఆయన‌కు టీడీపీలో అచ్చెన్నాయుడు వర్గంతో విభేదాలు ఉన్న కళా వెంకటరావు నుంచి వెంటనే మద్దతు లభించింది. అంటే జిల్లాలో మద్యం వ్యాపారాలు టీడీపీ వైసీపీ కలసి చేస్తూ జగన్ సర్కార్ ఆశయాలను తుంగలోకి తొక్కేస్తున్నారన్న అక్కసుతో పాటు, వ్యక్తిగత రాజకీయాలు తమ్మినెనై చేత ఈ విమర్శలు చేయించారని భావిస్తున్నారు. ఈ వ్యవహారం ఎక్కడి దాకా పోతుందో చూడాలి.

Tags:    

Similar News