స్పీక‌ర్ వార‌సుడు సిక్కోలు వైసీపీలో కాక రేపుతున్నాడే ?

శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో వైసీపీ నాయ‌కులు ఎవ‌రూ మాట్లాడ‌లేక పోతున్నారు. ఏం మాట్లాడితే..ఏం జ‌రుగుతుందోన‌ని నాయ‌కులు త‌ర్జన భ‌ర్జన [more]

Update: 2021-04-08 05:00 GMT

శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో వైసీపీ నాయ‌కులు ఎవ‌రూ మాట్లాడ‌లేక పోతున్నారు. ఏం మాట్లాడితే..ఏం జ‌రుగుతుందోన‌ని నాయ‌కులు త‌ర్జన భ‌ర్జన ప‌డుతున్నారు. విష‌యంలోకి వెళ్తే ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌న త‌న‌యుడు, విద్యావంతుడు చిరంజీవి నాగ్ ను రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చేందుకు ప్లాట్ ఫాం రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయ‌న పార్టీ విభాగంలో ప‌నిచేస్తున్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌దునైన నాయ‌కుడిగా త‌యారు చేస్తున్నట్టు త‌న కుమారుడి రాజ‌కీయాల‌ను తీర్చిదిద్ద‌డ‌మే త‌న ప‌ని అని త‌ర‌చుగా త‌మ్మినేని సీతారాం చెబుతున్నారు. అయితే.. అంద‌రూ కామ‌న్‌గానే వార‌సుడిని ప‌రిచ‌యం చేస్తున్నార‌ని అనుకున్నారు.

అనధికార ఎమ్మెల్యేగా….?

కానీ, వార‌సుడుగా రాజ‌కీయ అరంగేట్రం చేయాల‌ని భావిస్తున్న చిరంజీవి నాగ్ మాత్రం ఆముదాల వ‌ల‌స‌లో ఆయ‌నే అన‌ధికారిక ఎమ్మెల్యేగా చ‌క్రం తిప్పుతున్నారు. ఇటీవ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ త‌ర‌పున ఎక్కువ మంది స‌ర్పంచ్ అభ్యర్థుల‌ను ఎంపిక చేయ‌డం ద‌గ్గర నుంచి.. వారిని గెలిపించే బాధ్యతలు కూడా నాగ్ తీసుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తాను పోటీ చేస్తే నియోజ‌క‌వ‌ర్గంలో త‌న వ‌ర్గం యువ‌నేత‌లు బ‌లంగా ఉండాల‌న్న ప్లానింగ్‌తో ఈ ఎన్నికల్లో పూర్తిగా ఆయ‌నే చ‌క్రం తిప్పారు. ఇక త‌న స్వగ్రామంలో త‌న మాతృమూర్తిని గెలిపించుకునేందుకు తీవ్రంగా శ్రమించారు.

వచ్చే ఎన్నికల నాటికి…..

అంతే కాదు త‌న తండ్రి త‌మ్మినేని సీతారాంతో ఎవ‌రైనా భేటీ అయి.. స‌మ‌స్యల‌పై చ‌ర్చించాల‌ని అనుకుంటే ముందు త‌న‌కు చెప్పాల‌న్న కండీషన్లు ఉన్నాయి. దీంతో ఎవ‌రైనా స‌రే.. నాగ్‌నే సంప్రదించాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. కాళింగ సామాజిక వ‌ర్గంలో భ‌విష్యత్తులో తిరుగులేని యువ‌నేత‌గా కూడా స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం త‌న‌యుడిని ప్రొజెక్ట్ చేయ‌డాన్ని పార్టీలోని సీనియ‌ర్లుగా ఉన్న నాయ‌కులు స‌హించ‌లేక పోతున్నారు. దువ్వాడ శ్రీను వ‌ర్గంలో మాత్రం స్పీక‌ర్ కుమారుడిని నెంబ‌ర్ 1 నాయ‌కుడిగా ప్రచారం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్రమంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో రామ్మోహ‌న్‌కు పోటీగా నాగ్ ఎంపీ అభ్యర్థి అవుతాడ‌ని కూడా చెప్పుకుంటున్నారు.

మరో వర్గం నేతలు…

ఈ ప‌రిణామాలు కాళింగ వ‌ర్గంలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణితో పాటు పేరాడ తిల‌క్ లాంటి నేత‌ల‌తో పాటు మిగిలిన సీనియ‌ర్ నేత‌ల‌కు రుచించ‌డం లేదు. దువ్వాడ‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి రావ‌డం వెనుక స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం చ‌క్రం తిప్పార‌ని.. కాబ‌ట్టి హైక‌మాండ్ ద‌గ్గర ఆయ‌న‌కు మంచి ప‌లుకుబ‌డి భావిస్తోన్న జిల్లా పార్టీ నేత‌లు ప్రస్తుతానికి పైకీ ఏమీ అన‌క‌పోయినా గుంభ‌నంగా ఉంటున్నారు. ఏదేమైనా సిక్కోలు వైసీపీలో దువ్వాడ‌, స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం క‌లిసి చేస్తోన్న వ‌ర్గ రాజ‌కీయం మిగిలిన నేత‌ల్లో మంట పెడుతోన్న ప‌రిస్థితి ఉంది.

Tags:    

Similar News