కంట్లో నలుసులా మారనున్నారా?

తెలంగాణ గవర్నర్ తమిళి సై బీజేపీకి ఆశాకిరణంగా మారారు. తమిళి సై గవర్నర్ గా బాధ్యతలను చేపట్టిన నాటి నుంచే బీజేపీకి కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది. [more]

Update: 2020-11-21 11:00 GMT

తెలంగాణ గవర్నర్ తమిళి సై బీజేపీకి ఆశాకిరణంగా మారారు. తమిళి సై గవర్నర్ గా బాధ్యతలను చేపట్టిన నాటి నుంచే బీజేపీకి కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ ఉండటం, దూకుడుగా వ్యవహరిస్తుండటం కొంత పార్టీకి అనుకూలంగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం నేపథ్యంలో తమిళిసై మరింత దూకుడుతో వ్యవహరిస్తారన్న టాక్ బలంగా విన్పిస్తుంది.

గవర్నర్ గా నియామకం తర్వాత…..

తమిళనాడులో బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసైని తెలంగాణ గవర్నర్ గా నియమించారు. ఆమె నియామకం అనూహ్యంగా జరిగిందే. తమిళి సైని నియమించినప్పుడే బీజేపీని తెలంగాణలో బలోపేతం చేయడానికే తీసుకువచ్చారన్న చర్చ జరిగింది. అందుకు తగ్గట్టుగానే తమిళిసై వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఆదేశించడం, పలు సూచనలు చేస్తూ అధికార పార్టీకి కొంత ఇబ్బందిగా మారారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా….

కరోనా బాగా విజృంభిస్తున్న సమయంలోనే మంత్రుల కంటే ఎక్కువగా తమిళి సై ఆసుపత్రులను సందర్శించారు. కరోనా కట్టడి లో కేసీఆర్ ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించలేదన్న కీలక వ్యాఖ్యలు చేేసి వార్తల్లోకి ఎక్కారు. దీనిపై టీఆర్ఎస్ నుంచి కూడా కొంత ఘాటుగా రిప్లై వచ్చినా వెంటనే సర్దుబాటు చేసింది అధిష్టానం. అలాగే వైస్ ఛాన్సిలర్లతో సమావేశం, నేరుగా చీఫ్ సెక్రటరీని తన వద్దకు పిలిపించుకుని కోవిడ్ పై సమీక్ష చేయడం వంటివి టీఆర్ఎస్ ను ఇరకాటంలోకి నెట్టాయి.

భవిష్యత్ లోనూ…..

తమిళిసై ఏ వ్యాఖ్యలు చేసినా టీఆర్ఎస్ నేతలు రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. భవిష్యత్ లోనూ తమిళి సై నుంచి సర్కార్ కు ఇబ్బందులు తప్పేట్లు లేవని అంటున్నారు. కేసీఆర్ ఎప్పటికప్పుడు గవర్నర్ ను కలుస్తూ మర్యాదపూర్వకంగా సమాచారాన్ని అందజేస్తున్నారు. కానీ గవర్నర్ విషయంలో టీఆర్ఎస్ నేతలకు అనేక అనుమానాలున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఈ అనుమానాలు మరింత బలపడ్డాయంటున్నారు. మొత్తం మీద తమిళి సై ఇకపై క్రియాశీలకంగా వ్యవహరిస్తారని, టీఆర్ఎస్ కంట్లో నలుసుగా మారతారన్న వ్యాఖ్యలయితే విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News