భారత్ తో ఆ సంబంధాలు కొనసాగిస్తారా?

టెహరాన్ అధికార పీఠాన్ని త్వరలో కొత్త నేత అధిష్టించనున్నారు. సంస్కరణవాది అయిన ప్రస్తుత అధ్యక్షుడు హసన్ రౌహానీ స్థానంలో అతివాద నేతగా పేరు గాంచిన కొత్త అధ్యక్షుడు [more]

Update: 2021-07-09 16:30 GMT

టెహరాన్ అధికార పీఠాన్ని త్వరలో కొత్త నేత అధిష్టించనున్నారు. సంస్కరణవాది అయిన ప్రస్తుత అధ్యక్షుడు హసన్ రౌహానీ స్థానంలో అతివాద నేతగా పేరు గాంచిన కొత్త అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ (60) ఆగస్టు మొదటివారంలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన ఈ పశ్చిమాసియా దేశ ఎన్నికల్లో రైసీ కి 1.78 కోట్ల ఓట్లు వచ్చాయి. దేశ చరిత్రలో అతి తక్కువ పోలింగ్ నమోదైన ఎన్నిక ఇది. దేశ సర్వోన్నత నేత ఆయతుల్లా ఖొమేనీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలివి. బలమైన ప్రత్యర్థులను అనర్హులుగా ప్రకటించడంతో మిగిలిన ముగ్గురు ప్రత్యర్థులు పెద్దగా పోటీ ఇవ్వలేదు. కొత్త అధినేత రైసీ ఇప్పటివరకు దేశ న్యాయవ్యవస్థ అధిపతిగా వ్యవహరించారు. రైసీ స్వయంగా మహ్మద్ ప్రవక్త ప్రత్యక్ష వారసత్వం గల కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం. అందుకు తగ్గట్లుగా ఆయన ఎప్పుడూ నల్లటి తలపాగా ధరిస్తుంటారు. సర్వోన్నత నేత ఆయతుల్లా ఆలీ ఖొమేనీకి రైసీ సన్నిహితుడన్న పేరుంది.

తొలి నుంచి…..

కొత్త అధినేత రైసీ సహజంగానే వివిధ దేశాల నుంచి అభినందలు అందుకున్నారు. భారత్ కూడా ఈ మేరకు ఆయనను అభినందించింది. నిజానికి న్యూఢిల్లీ- టెహరాన్ మధ్య మొదటి నుంచీ మంచి సంబంధాలే ఉన్నాయి. 70వ దశకంలో ఇరాన్ రాజు షా హయాం నుంచి ఇరు దేశాల అధినేతల పరస్పర పర్యటనలు సాగాయి. కానీ గత కొన్నేళ్లుగా రెండు దేశాల మధ్య కొంత స్తబ్ధత ఏర్పడింది. ఇదేమీ నాయకుల మధ్య ఏర్పడిన అపోహ కానే కాదు. అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితులే ఇందుకు కారణం. అమెరికా, చైనా కూడా ఇందుకు కొంతవరకు కారణం.ప్రపంచీకరణ తరవాత భారత్ – అమెరికా మధ్య సంబంధాలు బలోపేతమయ్యాయి. అదే సమయం లో ఐరోపా సమాఖ్యతోనూ భారత్ సన్నిహితంగా ఉంటోంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెలతో భారత్ కు బలమైన వాణిజ్య, స్నేహ సంబందాలు కొనసాగుతున్నాయి. ఈ దేశాలన్నింటితో ఇరాన్ కు బద్ధ వైరముంది. అంతర్జాతీయంగా సౌదీ అరేబియా- ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎప్పుడూ ఉంటుంది.

అమెరికాతో వైరం….

ఇరాన్ షియా దేశం కాగా, సౌదీ సున్నీ దేశం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కూడా సున్నీ దేశమే కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా షియా, సున్నీల మధ్య విభేదాలు కొత్తేమీ కాదు. షియాలకు ప్రాతినిధ్యం వహిస్తుందన్న పేరు ఇరాన్ కు ఉంది. అమెరికాతో ఇరాన్ కు మొదటి నుంచీ వైరం ఉంది. ఐరోపా సమాఖ్యతోనూ ఇదే పరిస్థితి. పశ్చిమాసియాలోని యూదురాజ్యం ఇజ్రెయల్ తో ఇరాన్ కు గల వైరం బహిరంగమే. పాలస్తీనాకు గట్టి మద్దతుదారుగా నిలిచే ఇరాన్ సహజంగానే ఇజ్రయెల్ ను వ్యతిరేకిస్తోంది. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ నుంచి చమురు దిగుమతులను భారత్ ఆపేసింది. ఇది ఇరాన్ కు ఎంతమాత్రం నచ్చలేదు. కీలకమైన కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ కు అనుకూలంగా ఇరాన్ మాట్లాడటం భారత్ కు మింగుడు పడని పరిణామం. ఇటువంటి ఘటనలు రెండు దేశాల మధ్య దూరాన్ని బాగా పెంచాయి.

ఇరు దేశాల ప్రయోజనాలు….

ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకుని ఇరాన్ వైపు చైనా మొగ్గు చూపింది. రష్యా కూడా దాదాపు ఇదే వైఖరిని అవలంబించింది. ఆ దేశానికి చైనా, రష్యా అంతర్జాతీయగాతో పాటు ఇతరత్రా అండదండలు అందిస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఈ పరిస్థితులు భారత్ – ఇరాన్ సంబంధాలపై ప్రభావం చూపిన మాట వాస్తవం. అయినప్పటికీ టెహరాన్ తో స్నేహ సంబంధాలకు భారత్ వైపు నుంచి ప్రయత్నాలు జరగక పోలేదు. ఇరాన్ లోని ఛాబహర్ ఓడరేవు నిర్మాణ ఒప్పందాన్ని భారత్ పొందింది. ఇది పూర్తయితే రెండు దేశాల మధ్య నౌకాయనం పరంగా దూరం బాగా త గ్గుతుంది. పాకిస్థాన్ లోని గ్వదర్ ఓటరేవుకు పోటీగా ఛాబహర్ ఓడరేవు పనులను భారత్ చేపట్టింది. గ్వదర్ రేవు పనిని చైనా పూర్తి చేసింది. మారిన పరిస్థితుల్లో ఉభయ దేశాలు మరింత సంయమనం పాటించాలి. తమకున్న పరిమితులను పరిగణనలోకి తీసుకుని ఇరు దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకు సాగాలి. అపోహలను తొలగించుకోవాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News