ఈ ఉచ్చు నుంచి ఎలా బయటపడతారో?

ఆయన ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే స్వామీజీ, ఆధ్యాత్మిక ప్రపంచమే ఆయన మార్గం. వచ్చిన భక్తులకు ఉత్తమ తోవ చూపింబ్చి భక్తి, ముక్తి ప్రసాదించడం ఆయన కర్తవ్యం. [more]

Update: 2020-05-25 12:30 GMT

ఆయన ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే స్వామీజీ, ఆధ్యాత్మిక ప్రపంచమే ఆయన మార్గం. వచ్చిన భక్తులకు ఉత్తమ తోవ చూపింబ్చి భక్తి, ముక్తి ప్రసాదించడం ఆయన కర్తవ్యం. ఆయనే విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి. ఆయన కొంతవరకూ రాజకీయాల్లో వేలు పెట్టడంతో ఇపుడు చిక్కుల్లో పడుతున్నారు. విపక్షాలు నేరుగా టార్గెట్ చేస్తున్నాయి. ఆయన్ని కూడా వైసీపీలో కలిపేసి మరీ మాటల దాడి చేస్తున్నారు. ఇప్పుడేమంటారు స్వామీ అని కెలుకుతున్నారు. నిజానికి స్వరూపానందేంద్రస్వామి ఇపుడు రాజకీయాలకు కొంత దూరం పాటిస్తున్నారు.

జగన్ వైపు…..

స్వరూపానందేంద్రస్వామికి విశాఖలో ఆశ్రమం స్థాపనకు అప్పట్లో కాంగ్రెస్ పెద్దలు సాయం చేశారు. దాంతో పాటు వారంతా కూడా అప్పట్లో ఆశ్రమానికి తరచూ వచ్చేవారు. ఎవరు వచ్చినా కూడా తాను భక్తులుగానే చూస్తానని, తనకు రాజకీయలు, పార్టీలతో సంబంధం లేవని స్వరూపానందేంద్రస్వామి అనేకసార్లు స్పష్టంగా చెప్పారు. కానీ ఆయన్ని టీడీపీకి వ్యతిరేకంగా ముద్ర వేశారు తమ్ముళ్ళు. ఇక విశాఖకు చెందిన ఒక టీడీపీ ఎమ్మెల్యే అయితే స్వామిని దుర్భాషాలు ఆడిన ఘటనలు గతంలో ఉన్నాయి. స్వరూపానందేంద్రస్వామి జగన్ వైపు ఉన్నారని ఆయన వైసీపీ సభ్యత్వం తీసుకున్నారని కూడా నిందించారు.

నోరు విప్పాలట…..

ఇపుడు టీటీడీ భూముల అమ్మకం ఏపీ రాజకీయాల్లో చిచ్చు రేపుతోంది. దేవుడి భూములు అమ్ముతారా అంటూ విపక్షాలు గట్టిగానే తగులుకుంటున్నాయి. ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసిన బీజేపీ నేత రమేష్ నాయుడు ముందుగా విశాఖ స్వామిజీ పెదవి విప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీకి మద్దతుగా ఉన్న స్వరూపానందేంద్రస్వామి ఇపుడు అదే సర్కార్ ఇలాంటి పనులు చేస్తూంటే నచ్చచెబుతారా, లేక ఉద్యమిస్తారా అంటూ రమేష్ నాయుడు స్వామిని టార్గెట్ చేస్తున్నారు. ఇదే తోవలో మరికొంతమంది టీడీపీ నేతలు కూడా స్వామిని ఈ వివాదంలోకి లాగుతున్నారు.

సంబంధం లేదా..?

చాలాకాలంగా స్వరూపానందేంద్రస్వామి రాజకీయ ప్రకటనలు చేయడం మానుకున్నారు. ఆయన ఇపుడు పూర్తిగా ఆధ్యాత్మికత వైపే దృష్టి సారించారు. ఇక కేసీయార్, జగన్ తనకు భక్తులని, తన వద్దకు వస్తే ఆశీర్వాదం ఇచ్చానని కూడా అంటున్నారు. తనకు ఎవరైనా ఒకటేనని, వారు బయట ఏమైనా ఆశ్రమంలో ఒకసారి అడుగుపెట్టాక తన భక్తులే అవుతారని కూడా అంటున్నారు. స్వరూపానందేంద్రస్వామి ఇంతలా చెబుతున్నా కూడా ఆయన్ని కూడా రాజకీయ గాటకు కట్టేసి వైసీపీ చొక్కా తొడిగేస్తోంది విపక్ష రాజకీయం. మరి స్వరూపానందేంద్రస్వామి ఈ ఉచ్చునుంచి ఎలా తప్పించుంటారో చూడాలి. ఏది ఏమైనా రాజకీయం అంటేనే రొచ్చు. అది ఇప్పటికైనా స్వామికి అర్ధమవ్వాలి అంటున్నారు అధాత్మికప్రియులు.

Tags:    

Similar News