అందుకే …ఆమె ప్రత్యేకం

వందల మంది నాయకులు వస్తుంటారు. పోతుంటారు. చరిత్రలో తమకంటూ ఒక పేజీని సొంతం చేసుకునేవారు కొందరే. సమాజంలో మార్పుకోసం ప్రయత్నించడం, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రతిఘటించడం, నమ్మిన [more]

Update: 2019-08-07 15:30 GMT

వందల మంది నాయకులు వస్తుంటారు. పోతుంటారు. చరిత్రలో తమకంటూ ఒక పేజీని సొంతం చేసుకునేవారు కొందరే. సమాజంలో మార్పుకోసం ప్రయత్నించడం, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రతిఘటించడం, నమ్మిన సిద్ధాంతం కోసం వెనకడుగు వేయకుండా చివరి వరకూ నిలబడటం వీరి లక్షణాలు. ఆయా లక్షణాలను తన సహజసిద్ధ స్వభావంగా సంతరించుకుని మహిళా సాధికారతకు నిలువెత్తు రూపంగా నిలిచారు సుష్మాస్వరాజ్. విద్యార్థి దశ నుంచే ఉద్యమ రాజకీయాలలో ఉరకలు వేశారామె. అత్యవసర పరిస్థితి వంటి ప్రజావ్యతిరేక నిర్బంధాలను నిలదీయడమే కాదు..నిరసనల హోరెత్తించారు. పోరాటంలో, ఉద్యమంలో, ఆందోళనలో ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణలో స్త్రీ, పురుష అంతరాలు లేనేలేవని, తన జీవితాన్నే ఒక నిదర్శనగా నిరూపించారు. పదిసార్లు చట్టసభలకు ఎన్నికై తన గళాన్ని, వాదాన్ని, సైద్దాంతిక నిబద్ధతను ప్రతిధ్వనింపచేసిన సుష్మా స్వరాజ్ ఒక సమరశంఖం. అటల్ , అద్వానీ, ఇందిర వంటి నాయకుల ప్రతీకగా భాసిల్లిన ధైర్య సాహసాలు సుష్మను అసాధారణ వ్యక్తిని చేశాయి. జాతి మొత్తం స్మరించుకోవాల్సిన నేతగా నిలిపాయి.

రియల్ ఫైర్ బ్రాండ్…

చిన్నప్పటి నుంచే సుష్మా స్వరాజ్ ఫైర్ బ్రాండ్. దేశభక్తి ని ఉగ్గుపాలతోనే రంగరించుకున్నదని చెప్పాలి. అదే సమయంలో పౌరహక్కులంటే ప్రాణం. సాహిత్యం, చరిత్ర, సంస్క్రుతి సంప్రదాయాలంటే ఎనలేని మక్కువ. సైన్యంలో చేరి దేశ సేవ చేయాలని కలలు కన్నారు. మహిళల సైన్య ప్రవేశానికి అప్పటి నిబంధనలు అంగీకరించకపోవడంతో అటువైపు సాగలేదు ప్రస్థానం. విషయపరిజ్ణానం, ప్రజాసమస్యలపై చిత్తశుద్ది, ఎవరినైనా నిలదీసే వాగ్ధాటి కలిగిన ఆమెకు రాజకీయ రంగం ఘనంగా స్వాగతం పలికింది. ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన అత్యవసర పరిస్థితి ఆమెకు తొలి పోరాట వేదికగా మారింది. అదే రాజకీయ పునాదిగా నిలిచింది. 25 ఏళ్ల వయసులోనే చట్టసభకు ఎన్నిక కావడమే కాదు, హర్యానా మంత్రిగా మారడానికి కారణమైంది. దేశంలోనే అతి చిన్నవయసులో కేబినెట్ లో స్థానం దక్కించుకున్న తొలి మహిళ సుష్మ.

పౌర హక్కుల ప్రమాణం..

నాలుగు విడతలు లోక్ సభ కు మూడు సార్లు రాజ్యసభకు మరో మూడు పర్యాయాలు శాసనసభకు ఎన్నిక కావడం చిన్నవిషయం కాదు. ఈ రోజు ప్రధానిగా, హోం మంత్రిగా ఉన్న కీలక నేతలందరికంటే సుదీర్ఘమైన ప్రజాజీవితం గడపడం సుష్మకే చెల్లింది. 42 సంవత్సరాలపాటు క్రియాశీల రాజకీయ నేతగా, చట్టసభల సభ్యురాలిగా, మంత్రిగా పనిచేశారామె. ఆమె ఏ శాఖ చేపట్టినా పారదర్శకత, నూతన ప్రమాణాలకు నాంది పలకడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. దేశరాజధాని ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. సుష్మాస్వరాజ్ పార్లమెంటు లో సాగే చర్చలు తీరు తమ ప్రతినిధుల వైఖరి ప్రజలందరికీ తెలియాలని మొట్టమొదట నిర్ణయం తీసుకున్నారు . 1996లో కేవలం 13 రోజుల పాటు మాత్రమే అధికారంలో ఉన్న వాజపేయి ప్రభుత్వంలో సమాచార ప్రసార మంత్రిగా సుష్మ తీసుకున్న నిర్ణయమే పార్లమెంటు ప్రత్యక్షప్రసారాలు. కుటుంబ సంక్షేమం, సమాచాప్రసారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు,విదేశీ వ్యవహారాలు వంటి కీలక శాఖలను నిర్వహించడంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యమంత్రిగా, పార్టీకి అధికారప్రతినిధిగా , కేంద్రమంత్రిగా , ప్రధానప్రతిపక్ష నాయకురాలిగా సుష్మా స్వరాజ్ వ్యవహరించిన తీరులో పార్టీలు వేరైనప్పటికీ ఇందిర పోలికలు కనిపిస్తాయని చెబుతుంటారు రాజకీయ పరిశీలకులు. డైనమిక్ లీడర్షిప్, పవర్ ఫుల్ డెసిషన్ మేకింగ్ , పక్కా డిసిప్లిన్, ప్రశ్నించే గొంతు. ఇవే సుష్మను సాధారణ రాజకీయవేత్తల నుంచి వేరు చేసి చూపిస్తాయి.

తెలుగుల చిన్నమ్మ…

సంప్రదాయ వస్త్రధారణ, నిండైన మూర్తిమత్వంతో భారత స్త్రీకి రోల్ మోడల్ గా కనిపిస్తారు సుష్మ. నిండైన అమ్మతనం ఆమెలో కనిపిస్తుంది. సమస్యల పై సివంగిలా విరుచుకుపడే సుష్మ మానవత్వానికి అమ్మలా కరిగిపోతుంది. తెలంగాణ ఉద్యమంలో రాలిపోతున్న విద్యార్థులపై గట్టిగా గళమెత్తి ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీసింది సుష్మ మాత్రమే. ప్రధాన ప్రతిపక్ష నాయకురాలిగా తనకు లభించే అవకాశంతో అత్యున్నత చట్టసభలో ఈ సమస్య తీవ్రతను ప్రతిధ్వనింపచేశారామె. ఆ తర్వాతనే తెలంగాణ విషయమై అధికార కాంగ్రెసులో వేగం పెరిగిందని చెప్పాలి. లోక్ సభలో పునర్విభజన నాటికి కాంగ్రెసుకు మెజార్టీ లేదు. బిల్లును ప్రతిఘటించి బీజేపీ అడ్వాంటేజ్ పొందే దశలో ఉన్నప్పటికీ రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి తెలంగాణ బిల్లుకు సంపూర్ణంగా సహకరించారు సుష్మ. భారతీయత అంటే ఆమెకు పిచ్చిప్రేమ. సోనియా గాంధీ ప్రధాని కావడానికి సర్వం సిద్దమైన దశలో సుష్మ అడ్డుచక్రం వేశారు. సెంటిమెంటును రగిలించారు. ఆమె చేసిన హెచ్చరిక కాంగ్రెసు నాయకత్వాన్నే పునరాలోచనలో పడేసింది. సోనియా గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలుచేపడితే తాను జీవితాంతం గుండు గీయించుకుని జీవిస్తానని సుష్మ సవాల్ విసరడం అప్పట్లో సంచలనం. మంచిచెడ్డల సంగతి పక్కనపెడితే అంతటి మొండితనం సోనియాపై ప్రభావం చూపింది. కాంగ్రెసు అధినేత్రిపై బళ్లారిలో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఆ గడ్డను మరువకుండా , అక్కడ ప్రజల పండుగల్లోపాల్గొనడం అనుబంధాన్ని కొనసాగించడం సుష్మ ప్రత్యేకతను చాటి చెబుతాయి. గెలుపోటములతో సంబంధం లేకుండా పౌరులతో నిరంతరం సంబంధాలు కొనసాగించడం ప్రజానాయకత్వానికి ఉండాల్సిన లక్షణం. సుష్మా స్వరాజ్ నుంచే దానిని నేర్చుకోవాలి. దేశభక్తి, సైద్ధాంతిక నిబద్ధత, పౌరహక్కులు, ప్రజాస్వామిక విలువలు, మాత్రుహ్రుదయం, మహిళా సాధికారతల సమాహారం సుష్మా స్వరాజ్. పోరాటపథంలో పోటెత్తే స్వరం . చట్టసభల గంభీరగళం . విదేశాంగ విధానంలో భారత్ గొంతు . అందుకే ఆమె జ్ణాపకాలు జాతియావత్తుకు స్మరణీయ ఘట్టాలు… అందుకే దేశమంతా ఆమెకు కన్నీటి నివాళులు.

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News