సుశాంత్ సూసైడ్.. మిస్టరీగానే మిగులుతుందా?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకూ అనేక మలుపులు తిరుగుతుంది. సుశాంత్ ఆత్మహత్య కేసు ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు [more]

Update: 2020-08-03 18:29 GMT

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకూ అనేక మలుపులు తిరుగుతుంది. సుశాంత్ ఆత్మహత్య కేసు ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది. బీహార్, మహారాష్ట్ర ల్లో ఈ కేసుకు సంబంధించి అధికార పార్టీలు మాటల యుద్ధానికి దిగుతున్నాయి. సుశాంత్ ముంబయిలోని తన ఫ్లాట్ లో పదిహేను రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన సూసైడ్ నోట్ కూడా రాశారు.

అనేక మలుపులు…..

అయితే సుశాంత్ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. బాలీవుడ్ మాఫియా వల్లనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలు విన్పించాయి. ముఖ్యంగా బాలీవుడ్ లోని కొందరు ఎదగనివ్వక పోవడం వల్లనే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డారన్న వార్తలు కూడా విన్పించాయి. దీనిపై సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని కూడా పోలీసులు విచారించారు. సుశాంత్ ఖాతా నుంచి పదిహేను కోట్ల రూపాయలు రియా అకౌంట్లోకి వెళ్లిపోయాయని సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పాట్నా పోలీసులకు ఫిర్యాదుతో…..

మరోవైపు సుశాంత్ తండ్రి కేకే సింగ్ బీహార్ లోని పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్ ఆత్మహత్య కేసులో రియాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ప్రమేయం కూడా ఉందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు సుశాంత్ ది ఆత్మహత్య కాదని, హత్యేనని, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ముంబయి మాఫియా పనిచేస్తుందని సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేయడం కూడా సంచలనమే అయింది.

సీబీఐకి అప్పగించాలని…..

అయితే తాజాగా పాట్నాలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాట్నా కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి వినయ్ తివారీ విచారణ నిమిత్తం ముంబయి వచ్చారు. అయితే ఆయనను బలవంతంగా ముంబయి కార్పొరేషన్ సిబ్బంది 14 రోజుల పాటు క్వారంటైన్ కు తరలించారు. దీనిపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ సయితం తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ముంబయి మాఫియా చేతిలో పావుగా మారారన్నారు. కేసులో దర్యాప్తు చేసేందుకు వచ్చిన వినయ్ తివారికి వసతి కల్పించాలని కోరితే క్వారంటైన్ ముద్ర ఎలా వేస్తారని ఆయన ప్రశ్నించారు. ముంబయి పోలీసులు ఈ కేసులో ఏదో దాచిపెడుతున్నారన్నది చెప్పకనే తెలుస్తోంది. మొత్తం మీద సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు మహారాష్ట్ర, బీహార్ ల మధ్య చిచ్చుపెట్టాయని చెప్పక తప్పదు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్ పెరుగుతోంది.

Tags:    

Similar News