సర్వేలు వచ్చేస్తున్నాయి....జాగ్రత్త....!

Update: 2018-09-23 15:30 GMT

సర్వేల సందడితో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణల్లో రాజకీయ సంబరాలు జరుగుతున్నాయి. పార్టీ సర్వేలు, ప్రత్యర్థులపై సర్వేలు, వ్యక్తిగత సర్వేలు.. ఇలా వివిధ రూపాల్లో అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. వందల సంఖ్యలో సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. జాతీయ స్థాయి సంస్థలనుంచి లోకల్ మేడ్ తాత్కాలిక సర్వేల వరకూ జోరెత్తుతున్నాయి. మీడియా సంస్థలూ రంగంలోకి దిగుతున్నాయి. పాఠకుల ఆసక్తిని పట్టుకుని తమ పత్రిక, మీడియా రేటింగు పెంచుకోవడానికి టీవీ, పేపర్లు సర్వేలు చేయడం ఒక ఎత్తు. పార్టీలు భారీగా సొమ్ములు ముట్టచెబితే వారికి అనుకూలమైన విధంగా క్రోడీకరించి సర్వేలు ఇచ్చేయడం మరో తంతు. ఈ విన్యాసాల్లో ప్రధాన స్రవంతిలోని మీడియా సంస్థలూ భాగస్వాములవుతున్నాయి. ఎంత ముట్టచెబితే అంత అనుకూలమైన సర్వేలను ఇచ్చేస్తున్నారనే అపప్రధను మూటగట్టుకుంటున్నాయి. అయినప్పటికీ జోస్యం లో ఉండే మజాతో అందరూ నిజానిజాలను పక్కనపెట్టి తమకూ ఒక సర్వే కావాలంటూ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. అనుకూల నివేదికలతో ప్రజలను మభ్యపెడుతూ అధిష్టానాలను ఆకర్షించాలని చూస్తున్నారు.

ప్రత్యర్థులే టార్గెట్....

తమ పార్టీలోని ప్రత్యర్థులు, ఇతర పార్టీల్లో ప్రధాన నాయకులను లక్ష్యంగా చేసుకుంటూ సర్వేలు నిర్వహించే కొత్త తంతు ఇటీవల మొదలైంది. తమకే టిక్కెట్టు ఇస్తే ప్రయోజనదాయకమనే కోణంలో సర్వేలను నిర్వహించుకుంటున్నారు. తమకున్న బలం, తమను ప్రజలు కోరుకుంటున్న తీరుపై ఔత్సాహికులు ఒక వేవ్ క్రియేట్ చేయాలని భావిస్తున్నారు. అయిదు నుంచి పదిలక్షల రూపాయల వరకూ వెచ్చించి నియోజకవర్గ సర్వేలను కాంట్రాక్టుకు ఇచ్చేస్తున్నారు. తమకు కావాల్సిన పారామీటర్లను ముందుగానే నిర్దేశిస్తున్నారు. బీసీ, ఎస్సీ లు, అగ్రవర్ణాల వారీగా క్లాసిఫైడ్ సర్వేలు, యాధృచ్ఛిక రాండమ్ సర్వేలు, వయో , వృత్తి వర్గాల వారీగా సైతం సర్వే ఫలితాలను తెలుసుకుంటున్నారు. తమకు ఏయే వర్గాల్లో ఎడ్జ్ కావాలో ముందుగానే చెప్పేస్తున్నారు. దానికి అనుగుణంగానే రిజల్టులను వండి వారుస్తున్నారు. ప్రత్యర్థులు తమకంటే బాగా బలహీనంగా ఉన్నారని తేల్చి చెప్పేందుకు ఈ సర్వేలను ప్రాతిపదికగా చేసుకుంటున్నారు. వ్యక్తిగతంగా నిర్వహించుకుంటున్న సర్వేల్లో ఎక్కువ భాగం ఈ కోవకు చెందినవే.

పార్టీకి రక్షణ కవచం..

పార్టీలకు సర్వేలు రక్షణ కవచంగా ఉపయోగపడుతున్నాయి. ప్రధానమైనపార్టీల తరఫున నియోజకవర్గాల్లో అనేక మంది పోటీ పడుతున్నారు. తమకే టిక్కెట్లు ఇవ్వాలంటూ అధిష్టానాల వద్ద డిమాండ్లు పెడుతున్నారు. తాము పార్టీకి అందించిన సేవలను గుర్తు చేస్తున్నారు. పార్టీ కోసం ఎంత సొమ్ము వెచ్చించిందీ గణాంకాల సహా వివరిస్తున్నారు. ప్రజలతో తమ అనుబంధాన్నీ విశ్లేషిస్తున్నారు. తద్వారా తమకు టిక్కెట్టు ఇవ్వకపోతే ఇబ్బంది తప్పదని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అసంతృప్తి, అసమ్మతి లకు బాటలు వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెసు పార్టీ ఈరకమైన చిక్కులను ఎదుర్కొంటోంది. దీనికి పరిష్కారంగా, ప్రత్యామ్నాయంగా పార్టీలు కనిపెట్టిన రక్షణ కవచం సర్వేలు. అభ్యర్థులు గెలుపు అవకాశాలపై సర్వేలు నిర్వహిస్తున్నట్లు పార్టీలు ప్రకటిస్తున్నాయి. ప్రజల్లో ఎక్కువ ఆదరణ వ్యక్తమైన వారికే టిక్కెట్లు కేటాయిస్తామంటూ పార్టీ నాయకులు చెబుతున్నారు. తమకు కావాల్సిన అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చేందుకు అడ్డు లేకుండా చూసుకునే ఎత్తుగడ ఈ సర్వేల్లో వ్యక్త మవుతోంది. ఇంతవరకూ ఇన్ ఛార్జులుగా ఉన్నవారిని మార్చాల్సి వచ్చినా , ఎమ్మెల్యేలకు టిక్కెట్టు నిరాకరించాల్సి వచ్చినా ప్రజల్లో వారికి ఆదరణ లేదని చెప్పేందుకు ఈ సర్వే అస్త్రం ప్రయోగిస్తున్నారు.

పాక్షిక సత్యాలే...

దాదాపు అన్ని సర్వేలు పాక్షిక సత్యాలే అనేది నిరూపితమైన నిజం. ప్రజల్లో సాగుతున్న చర్చ, ధోరణిని అనుసరించి సర్వే ఫలితాలను అందచేసే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. నమూనా సైజు, ఏయే వర్గాల నుంచి సమాచారం సేకరించారన్న వివరాలను బయటపెట్టడం లేదు. కులాలు, వృత్తులు, వయసు, లింగభేదాలను అనుసరించి శాంపిల్ సైజు ఎంపిక చేసుకుంటే కొంత మేరకు వాస్తవిక ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఆయా అంశాలను సర్వే సంస్థలు పెద్దగా పట్టించుకోవడం లేదు. తమకు బాధ్యతలు అప్పగించిన పార్టీ ఆలోచనలకు అనుగుణంగానే ఫలితాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ఆయా సంస్థల విశ్వసనీయత దెబ్బతింటున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. అంతిమంగా ఫలితాలు రివర్స్ అవుతున్నాయి. ప్లస్ ఆర్ మైనస్ ఎర్రర్ అవకాశాలను, మారిన పరిస్థితులను సాకుగా చెబుతూ రిజల్టు తప్పిన సందర్బాలను సమర్థించుకుంటున్నాయి ఆయా సంస్థలు. ఇటీవల వెల్లడైన అనేక ఎన్నికల ఫలితాల్లో సర్వే సంస్థలు బోల్తా పడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ విషయంలోనూ తప్పుదారి పట్టించాయి. ఏతావాతా సర్వేలను నమ్ముకోకూడదన్న విషయంలో పార్టీలకు స్పష్టత ఉంది. కానీ ప్రత్యర్థులకు టోపీ పెట్టేందుకు వీటిని సాకులుగా వాడుకుంటున్నారు. సర్వేల గోల్ ..కాంట్రాక్టదారుకు సాధికారత సాధించిపెట్టడమే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News