బయోడేటాతోనే భయపడుతున్నారా?

మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి ఈసారైనా ఛాన్స్ ఉంటుందా? లేక ఆయనకు ఈసారి కూడా కేసీఆర్ హ్యాండ్ ఇస్తారా? ప్రస్తుతం తెలంగాణలో రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు [more]

Update: 2020-03-08 09:30 GMT

మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి ఈసారైనా ఛాన్స్ ఉంటుందా? లేక ఆయనకు ఈసారి కూడా కేసీఆర్ హ్యాండ్ ఇస్తారా? ప్రస్తుతం తెలంగాణలో రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండు రాజ్యసభ స్థానాలు, ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుంది. మరి ఈ మూడింటిలో సురేష్ రెడ్డికి కేసీఆర్ అవకాశం కల్పిస్తారా? లేదా? అన్న చర్చ గులాబీ పార్టీలోనూ జరుగుతుంది. ఇప్పటి వరకూ సురేష్ రెడ్డి కేసీఆర్ ను కలవలేదు. ఆయన పిలుపు కోసం సురేష్ రెడ్డి ఎదురు చూస్తున్నారు.

ఎన్నికలకు ముందు చేరి….

గత శాసనసభ ఎన్నికలకు ముందు కేఆర్ సురేష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. అప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న సురేష్ రెడ్డి కేసీఆర్ కోరిక మేరకే పార్టీలో చేరినట్లు చెబుతారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నేత కావడంతో కేసీఆర్ కూడా సురేష్ రెడ్డికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించినప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె ఓటమి పాలు కావడంతో ఆ జిల్లా నేతల పట్ల కేసీఆర్ కొంత ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇద్దరూ హామీ ఇచ్చినా…..

నిజానికి సురేష్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి వరసగా నాలుగు సార్లు గెలిచిన సురేష్ రెడ్డి తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆర్మూరుకు మారి 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. స్పీకర్ గా పనిచేయడంతో ఆ సెంటిమెంట్ కూడా కొంత పనిచేసి ఉండవచ్చు. అప్పటి నుంచి ఆయన పెద్దగా రాజకీయ కార్కక్రమాల్లో పాల్గొనడం లేదు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ అక్కడ నాయకత్వ లేమి, ఇక కోలుకోలేదని భావించి టీఆర్ఎస్ లో చేరారు. సురేష్ రెడ్డికి కేసీఆర్ తో పాటు ఆయన తనయుడు కేటీఆర్ కూడా అప్పట్లో పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.

ఏ పదవి దక్కనుంది?

అయితే సురేష్ రెడ్డి ఈసారి తనకు రాజ్యసభ పదవి దక్కుతుందని ఆశించారు. ఉన్న రెండు రాజ్యసభ పదవుల్లో సురేష్ రెడ్డికి కేసీఆర్ ఇచ్చే ఛాన్స్ లేదంటున్నారు. అలాగే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి కూడా ఎన్నిక జరగబోతోంది. ఈపదవి కేవలం రెండేళ్లు మాత్రమే ఉండనుంది. అందుకే సురేష్ రెడ్డి ఈ పదవిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదంటున్నారు. ఈ పదవి కోసం కేసీఆర్ సురేష్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద సురేష్ రెడ్డికి ఈసారైనా పదవి దక్కుతుందా? లేదా? అన్న టెన్షన్ తో ఆయన సన్నిహితులు, అనుచరులు ఉన్నారు. రెడ్డి సామాజికవర్గానికి పదవి ఇస్తేనే సురేష్ రెడ్డికి అందులో చోటుండే అవకాశముంది.

Tags:    

Similar News