అమరావతి కథ తేలేనా? సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది?

అమరావతి భూ కుంభకోణంపై సుప్రీంకోర్టు విచారణ చేయాలని ఆదేశిస్తుందా? లేదా? ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. వచ్చే నెల 7వ తేదీన అమరావతి [more]

Update: 2021-03-29 14:30 GMT

అమరావతి భూ కుంభకోణంపై సుప్రీంకోర్టు విచారణ చేయాలని ఆదేశిస్తుందా? లేదా? ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. వచ్చే నెల 7వ తేదీన అమరావతి భూముల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అమరావతి భూముల వ్యవహారంలో పెద్ద కుంభకోణం జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తుంది. మంత్రి వర్గ ఉపసంఘం దాదాపు నాలుగువేల ఎకరాలను టీడీపీ నేతలు అమరావతి భూములను కైవసం చేసుకున్నారని తేల్చి చెప్పింది.

ప్రముఖుల పేర్లు….

మంత్రివర్గం ఉపసంఘం సిఫార్సు మేరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో కూడా అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. బినామీ పేర్లతో పెద్దయెత్తున భూములను కొనుగోలు చేశారని, తెల్ల రేషన్ కార్డుల దారుల పేరిట కూడా భూములు కొనుగోలు చేశారని సిట్ దర్యాప్తులో వెల్లడయింది. ప్రముఖ టీడీపీ నేతల డ్రైవర్లు, ఇంటి పనిమనుషుల పేర్లమీద కూడా భూముల కొనుగోళ్లు జరిగాయని తేల్చింది.

హైకోర్టు స్టే ఇవ్వడంతో…..

అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే ఈ కొనుగోళ్లు జరిగాయని తేల్చింది. ఈ భూముల కొనుగోళ్లలో కొందరు ప్రముఖుల కుటుంబాల పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాము స్వతంత్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేత విచారణకు జరిపించడానికైనా సిద్ధమని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరించింది.

వచ్చే నెల 7న విచారణ….

మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాల పాటి శ్రీనివాస్ తో సహా పదమూడు మందిపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. అయితే దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఎటువంటి చర్యలకు దిగబోమని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 7వ తేదీన అమరావతి భూ కుంభకోణం అంశం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. విచారణకు సుప్రీంకోర్టు ఆదేశిస్తే విపక్ష తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడే అవకాశముంది. మొత్తం మీద సుప్రీంకోర్టు నుంచి ఏ తీర్పు వెలువడనుందన్న అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News