“జడ్జిమెంట్” ఇక మీదే

సుప్రీంకోర్టు సంస్కరణలను వేగంగా చేపడుతోంది. కొలీజియంను ఏర్పాటు చేసి వేగంగా న్యాయమూర్తుల నియామకాన్ని చేపట్టింది. న్యాయమూర్తుల నియామకం లేక అనేక కేసులు పెండింగ్ లో ఉంటున్నాయి. ఏళ్ల [more]

Update: 2019-08-01 18:29 GMT

సుప్రీంకోర్టు సంస్కరణలను వేగంగా చేపడుతోంది. కొలీజియంను ఏర్పాటు చేసి వేగంగా న్యాయమూర్తుల నియామకాన్ని చేపట్టింది. న్యాయమూర్తుల నియామకం లేక అనేక కేసులు పెండింగ్ లో ఉంటున్నాయి. ఏళ్ల తరబడి కేసులు పరిష్కారం కాక కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే కొలీజియం ఏర్పాటయిన తర్వాత దాదాపు 31 మంది న్యాయమూర్తుల నియామకంతో పెండింగ్ కేసులు వేగంగా పరిష్కారమవుతున్నాయి. ఇక తాజాగా అన్ని భాషల్లో తమ తీర్పును అందరికీ అందుబాటులో తెచ్చే విధంగా తీసుకున్న నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

సామాన్యుడికి అర్థమయ్యేలా….

సామాన్యుడికి అర్థమయ్యేలా తీర్పులను అన్ని భాషల్లో అందుబాటులో ఉంచాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. కోర్టు తీర్పులో ఏముందో తెలియక చాలా మంది కక్షిదారులు న్యాయవాదులపైనే ఆధారపడుతున్నారు. 2017లో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈ ప్రతిపాదన చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రతులు ప్రతి వారికీ అర్థమయ్యేలా వారి భాషలో అందుబాటులో ఉంటే మంచిదని సూచించారు. దీంతో అపెక్స్ కోర్టు అన్ని భాషల్లో తీర్పు ప్రతులను వెబ్ సైట్ లో అందుబాటులోకి తెచ్చింది.

తీర్పు ను చదువుకునేలా…

ప్రజలకు న్యాయం చేయడమే ముఖ్యం కాదని, వారికి తమకు జరిగిన న్యాయాన్ని తమకు అర్థమయ్యేలా చదువుకోవడం ముఖ్యమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేకు ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇంగ్లీష్ తో పాటు అస్సామీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, మరాఠీ, ఒడియా, తమిళం, బెంగాలి, తెలుగు వంటి భాషల్లో తీర్పు ప్రతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. మొత్తం 9 భాషల్లో తీర్పు ప్రతులు అందుబాటులో ఉండనున్నాయి.

ప్రాంతీయ భాషల్లో…..

ఇప్పటి వరకూ తీర్పు వెలువడిన రోజే వెబ్ సైట్ లో ఇంగ్లీష్ లో తీర్పు కాపీలు అందుబాటులో ఉండేవి. కానీ ఈ ప్రాంతీయ భాషల్లో తీర్పు ప్రతులు తీర్పు వెలువడిన వారం రోజులకు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చెందిన 116 తీర్పులను వెబ్ సైట్ లో ప్రాంతీయ భాషల్లో అనువదించి ఉంచారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 9 తీర్పులు తెలుగులో ఉన్నాయి. ఇలా సుప్రీంకోర్టు చేపట్టిన సంస్కరణలు న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత దగ్గరకు చేరుస్తున్నాయనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News