ఇప్పుడొక బ్రేక్…?

ఆంధ్రప్రదేశ్ లో లోకల్ బాడీ ఎన్నికలంటే ఒక పరిహాసాస్పదమైన ఘట్టంగా మారిపోయాయి. రాజకీయ పార్టీలు రోడ్డున పడి కొట్టుకోవడం, తిట్టుకోవడం వేరు. రాజ్యాంగ వ్యవస్థలే అపహాస్యం పాలవ్వడం [more]

Update: 2021-04-07 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో లోకల్ బాడీ ఎన్నికలంటే ఒక పరిహాసాస్పదమైన ఘట్టంగా మారిపోయాయి. రాజకీయ పార్టీలు రోడ్డున పడి కొట్టుకోవడం, తిట్టుకోవడం వేరు. రాజ్యాంగ వ్యవస్థలే అపహాస్యం పాలవ్వడం చూస్తున్నాం. గడచిన ఏడాది కాలంగా రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు హైకోర్టు, సుప్రీం కోర్టు గడప తొక్కాయో చెప్పలేం. న్యాయవ్యవస్థకు ఇదొక పెద్ద తలనొప్పిగా మారింది. పదిరోజుల గడువులో ముగిసిపోయే ఎన్నికలను ఆధిపత్య పోరాటంతో నానా హంగామా సృష్టిస్తున్నారు. ఫలితం ముందే తెలిసినా రాజకీయ ప్రయోజనాల కోణంలో ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థలు మొక్కుబడి అధికారంతో నామమాత్రంగా ఉన్నాయి. పేరుగొప్పకు చెప్పుకోవడానికే తప్ప, తూతూ మంత్రంగానే నిధులు, విధులు అప్పగిస్తున్నారు. తాజాగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆగమేఘాల మీద నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల కమిషనర్ కు హైకోర్టు బ్రేక్ వేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం సుప్రీం కోర్టు తీర్పును సైతం అధ్యయనం చేయకుండా కమిషనర్ నోటిఫికేషన్ ఎలా ఇచ్చారనేది చర్చనీయమవుతోంది.

పంతం ..పట్టుదల..

రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. ఒకసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కమిషనర్ తన, పర వివక్ష లేకుండా విధి నిర్వహణ చేయాలి. న్యాయం, రాజ్యాంగం ప్రమాణంగా పనిచేయాల్సి ఉంటుంది. గత ఎన్నికల కమిషనర్ ప్రభుత్వంతో పేచీకి పోయి , ప్రతిపక్ష పార్టీల చేతిలో పావుగా మారిపోయారు. కానీ అదే కమిషనర్ చివరికి ప్రతిపక్షాల చేతిలోనూ భంగపాటుకు గురయ్యారు. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత కమిషనర్ సక్రమంగా పనిచేయలేదని విపక్షాలు ఆరోపించాయి. గత ఏడాది మునిసిపల్ ఎన్నికల తొలి దశ ప్రక్రియలో ఎన్నికల కమిషనర్ ను అన్నివిధాలా ప్రశంసించింది ప్రభుత్వం. కరోనా పేరుతో వాయిదా అనగానే కమిషన్ ను రోడ్డున పడేసింది. నిమ్మగడ్డ రమేశ్ ను వ్యక్తిగతంగానూ నిందించింది. ప్రతిష్ఠను మసకబార్చే యత్నాలు చేసింది. తన కనుసన్నల్లోనే అంతా జరగాలనే ఆధిపత్య ధోరణి తో సర్కారు శాసిస్తోంది. ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి ప్రజల సానుభూతి పొందాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయి. మధ్యలో రాజ్యాంగ వ్యవస్థ అయిన కమిషన్ ఇరుకున పడుతోంది. ఎవరు నియమించినా తాము రాజ్యాంగానికి అనుగుణంగానే పనిచేస్తామని నిరూపించుకోవాల్సిన బాధ్యత కమిషనర్లపై ఉంటుంది. లేకపోతే వ్యవస్థ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చినవారవుతారు. కనీసం రాజకీయ పార్టీల అభిప్రాయాలను సైతం స్వీకరించకుండా నోటిఫికేషన్ జారీ చేశారు కమిషనర్ నీలం సాహ్ని. ఈ విషయంలో న్యాయనిబంధనలు పాటించలేదని తేటతెల్లమైంది. ఎస్ ఈ సీ ని , ప్రభుత్వాన్ని ఒకేగాటన కట్టి ప్రతిపక్షాలు విమర్శించడానికి ఒక అస్త్రం చేజేతులారా అందించారు. రాజ్యాంగ వ్యవస్థకు ఇదేమంత శోభస్కరం కాదు.

తెగని పంచాయతీ…

స్థానిక ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలనే ఉద్దేశంతో సుప్రీం కోర్టు కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల కోడ్ కనీసం నెలరోజుల ముందు విధించాలని నిర్దేశించింది. దీనివల్ల ప్రభుత్వం ఓటర్లను ప్రలోభపెట్టి తక్షణ ప్రయోజనం పొందకుండా నిరోధించడం సాధ్యమవుతుంది. ప్రతిపక్షాలు సమానస్థాయిలో అవకాశం పొందుతాయని సర్వోన్నత న్యాయస్థానం ఉద్దేశం. నిజానికి లోకల్ బాడీల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక రకాల అడ్వాంటేజ్ ఉంటుంది. జిల్లా యంత్రాంగం , శాసనసభ్యుల అదుపాజ్ణల్లోనే ఉంటాయి ఆయా సంస్థలు. నిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వంపై ఆధారపడుతూ ఉంటాయి. ఆర్థికసంఘాల పేరిట నిదులు నేరుగా వస్తున్నట్లు కనిపిస్తాయి. సకాలంలో ఎన్నికలు పెట్టకపోతే నిధులు విడుదల చేయమంటూ కేంద్రం అప్పుడప్పుడూ హెచ్చరిస్తుంటుంది. ఇదంతా తంతు మాత్రమే. కాలం ముగిసిన తర్వాత రెండు, మూడేళ్లకు కూడా ఎన్నికలు పెడుతుంటారు. నిధులు వస్తూ ఉంటాయి. అందువల్ల సీరియస్ నెస్ లోపించింది. పైపెచ్చు వివిధ నిర్దేశాల పేరిట రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను తమ ఇష్టాలకు అనుగుణంగా వినియోగించేలా చూస్తుంటాయి. ఇందువల్ల పంచాయతీలు, ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటే తప్ప పనులు సాగవు. దీనిని అలుసుగా తీసుకుంటూ స్థానిక సంస్థలను ప్రభుత్వాలు పూర్తిగా తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నాయి. ఎన్నికలను సకాలంలో జరపడం లేదు. అందుకోసమే రాష్ట్ర ఎన్నికల సంఘాలను నియమించినా వాటిని కూడా కర్రపెత్తనంతో నియంత్రిస్తున్నాయి.

రాజ్యాంగ పరిష్కారమే…

పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థ వంటి ప్రజా మౌలిక వసతుల బాధ్యత స్థానిక సంస్థలదే. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన సంస్థలవి. ప్రజలకు చేరువగా ఉండాల్సిన లోకల్ బాడీలను పై నుంచి ప్రభుత్వాలు నియంత్రించడంలో అర్థం లేదు. పౌరులు ఎన్నుకున్న ప్రజాప్రాతినిధ్య సంస్థలను రద్దు చేసే అధికారం కూడా కలెక్టర్లకు ఉంటుంది. ఇదొక విడ్డూరమైన ధోరణి. సకాలంలో ఎన్నికల నిర్వహణ, నిధుల కేటాయింపు, వినియోగం, శాసనసభ తరహాలోనే చర్చలు, మెజార్టీ నిర్ణయానికి అనుగుణంగానే స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్ఛ అవసరం. ఇందుకు అనుగుణంగా రాజ్యాంగం స్పష్టతనివ్వాలి. అది లేకపోవడం వల్లే ఆంధ్రప్రదేశ్ లో ఆటాడుకుంటున్నారు. హైకోర్టు లో రెండు బెంచ్ లు, ఆ తర్వాత సుప్రీం కోర్టు అంటూ కక్షిదారులు తిరుగుతూనే ఉంటారు. తాము చేసేది కరెక్టు కాదని కామన్ సెన్స్ కు తెలిసినా న్యాయపోరాటం పేరిట కాలయాపన చేస్తుంటారు. అందుకే స్థానిక సంస్థలను వ్యక్తుల ఇష్టారాజ్యాలకో, ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకో వదిలేయకుండా నిర్దిష్ట నియమావళి అవశ్యం. లేకపోతే అపహాస్యం పాలవుతాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఈవిషయంలో రికార్డు సృష్టించింది. తాజా బ్రేక్ కూడా తాత్కాలికమే. మళ్లీ న్యాయవివాదాలు కొనసాగుతూనే ఉంటాయి.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News