ఆయన చెప్పారు… ఆచరిస్తారా..?

రెండు రాష్ట్రాల మధ్య రగులుతున్న జలవివాదాలపై సర్వోన్నత న్యాయస్తానం ఒక ఆచరణీయైన, ఆదర్శప్రాయమైన సూచన చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తెలుగువాడు కావడంతో [more]

Update: 2021-08-04 15:30 GMT

రెండు రాష్ట్రాల మధ్య రగులుతున్న జలవివాదాలపై సర్వోన్నత న్యాయస్తానం ఒక ఆచరణీయైన, ఆదర్శప్రాయమైన సూచన చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తెలుగువాడు కావడంతో చొరవ తీసుకుని ఇరు రాష్ట్రాలకు హితవు చెప్పారు. రెండు ప్రాంతాలు నష్టపోకుండా మధ్వవర్తిత్వంతో పరిష్కరించుకుంటే శ్రేయస్కరమని సూచించారు. ఒకవేళ అందుకు సమ్మతిస్తే ఆ పాత్ర పోషించేందుకు సుప్రీం కోర్టు సిద్ధమని వెల్లడించారు. తెగేదాకా లాగుతాం. నష్టపోయినా ఫర్వాలేదు. న్యాయపరమైన ముగింపే కావాలంటే కేసును వేరే ధర్మాసనానికి బదిలీ చేసి, తాను తప్పుకుంటానన్నారు. దానివల్ల రెండు రాష్ట్రాల తో సంబంధం లేని న్యాయమూర్తుల చేతిలో తీర్పు వెలువడుతుంది. అప్పుడు చట్టమే ప్రామాణికమవుతుంది. హేతుబద్దత, మానవత వంటి అంశాలకు రెండో ప్రాధాన్యమే దక్కుతుంది. ఇప్పుడు రెండు రాష్ట్రాలు తమలో తాము తేల్చుకోవాల్సిన కీలకాంశమిది. సుప్రీం కోర్టు నుంచి న్యాయపరంగానే తీర్పు కోరుకుంటారా? లేదా మధ్యేమార్గాన్ని ఎంచుకుంటారా? ఇద్దరు ముఖ్యమంత్రుల కోర్టులోకి చేరింది బంతి.

జాప్యం తగ్గుతుంది…

సుప్రీం కోర్టు విచారణ చేపడితే జలవివాదం పై పరిష్కారం లో మరింత జాప్యం చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. చట్టపరమైన అంశాలు, న్యాయపరమైన కోణాలు, ట్రిబ్యునళ్ల తీర్పులు, ఇంతవరకూ అమలవుతున్న జలపంపిణీలు, వివాదానికి సంబంధించిన పూర్వాపరాలపై పూర్తి స్థాయి అధ్యయనం చేయవలసి ఉంటుంది. పైపెచ్చు కేంద్రం అభిప్రాయం కూడా తెలుసుకోవాలి. ఈలోపు రెండు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. తీర్పు చెప్పేందుకు నిర్దిష్ట కాల వ్యవధి ఉండదు. రెండు రాష్ట్రాల రాజకీయం రచ్చ కెక్కి గొడవ మామూలుగానే సాగుతుంటుంది. పరిష్కారం కంటే పేచీలకే కాలం సరిపోతుంది. కోర్టులో కేసు ఎవరికి అనుకూలంగా వస్తుందో చెప్పలేరు. పైపెచ్చు ఇద్దరూ నష్టపోయే అవకాశాలూ ఉంటాయి. తమ రాష్ట్రాలకు అనుచిత ప్రయోజనం ఆశిస్తూ రెండు రాష్ట్రాలు చేస్తున్న వాదనలు అర్థ సత్యాలే. ఆయా వాదనల్లోని డొల్లతనమూ సుప్రీం తీర్పుతో బట్టబయలు కావచ్చు. ఏదేమైనా న్యాయపరమైన తీర్పు దీర్ఘకాలంలో శాశ్వత పరిష్కారమే తప్ప ప్రస్తుతం రగులుతున్న సమస్య నుంచి బయటపడేయలేదు.

కేంద్రానికి రిలీఫ్…

రెండు రాష్ట్రాల గొడవతో కేంద్రం ఇప్పటికే తల పట్టుకుంటోంది. ఇటీవలనే కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ ఉత్తర్వులిచ్చింది. పునర్విభజన చట్టం ప్రకారం సమకూరిన అధికారంతోనే ఈ చర్య తీసుకుంది. అయినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంతృప్తిగా లేవు. తమ వాదనలకే కట్టుబడి ఉన్నాయి. చట్టప్రకారం ఏర్పాటైన ఆయా బోర్డుల నిర్వహణకు అవసరమైన సహకారం అందించేందుకు సిద్దంగా లేవు. తాజాగా జరిగిన బోర్డు సమావేశానికి తెలంగాణ డుమ్మా కొట్టింది. నోటిఫికేషన్ లోని అంశాలపై తమకు అభ్యంతరాలున్నాయి. మరింత స్పష్టత కావాలంటూ ఆంధ్రప్రదేశ్ తమ వాదన వినిపించింది. మొత్తమ్మీద తమ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టులపై వివరాలు సమర్పించేందుకు రెండు రాష్ట్రాలూ సుముఖంగా లేవు. కేంద్రానికి సైతం రాజకీయ ప్రయోజనాలున్నాయి. అందువల్ల రెండు రాష్ట్రాలతో ఘర్షణకు దిగేందుకు ఇష్టపడదు. యాజమాన్య బోర్డుల నియంత్రణాధికారం కేంద్రం పరిధిలోనే ఉంటుంది. అందువల్ల సాంకేతికంగా బోర్డులు తీసుకునే నిర్ణయాల ప్రభావం సహజంగానే కేంద్రంపై పడుతుంది. టీఆర్ఎస్ అటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తోంది. తెలంగాణలో ఎదుగుదలకు ప్రయత్నిస్తున్న బీజేపీని కట్టడి చేసేందుకు జలవివాదాలు, కేంద్రం జో్క్యం వంటివి అందివచ్చిన అస్త్రాలుగా కేసీఆర్ భావిస్తున్నారు. మద్యవర్తిత్వానికి సుప్రీం కోర్టు ముందుకు రావడం కేంద్రానికి చల్లని కబురు.

పరస్పర విశ్వాసరాహిత్యం..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కొలువైన రెండు ప్రభుత్వాలు పరస్పర విశ్వాస రాహిత్యాన్ని కనబరుస్తున్నాయి. రకరకాల కారణాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. వ్యక్తిగతంగా చూస్తే కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి మద్య సత్సంబంధాలే ఉన్నాయి. ఇప్పటికీ కేసీఆర్ నేరుగా జగన్ ను వేలెత్తి చూపడం లేదు. ఆంద్రప్రదేశ్ పేరునే ప్రస్తావిస్తున్నారు. అటువైపు నుంచి చూస్తే జగన్ మోహన్ రెడ్డి అసలు కేసీఆర్ పేరునే జలవివాదంలోకి లాగడం లేదు. పైపెచ్చు కేసీఆర్ చేసిన విమర్శలకు సైతం స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో బదులివ్వడం లేదు. ప్రభుత్వ సలహాదారు మాత్రమే వివరణ ఇస్తున్నారు. రాజకీయ అటాక్ లో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ వెనకబాటు తనాన్నే కనబరుస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ ఆయా పార్టీలకు రాజకీయ ప్రయోజనాలున్నాయి. అందువల్ల వివాదాన్ని సాధ్యమైనంతవరకూ సాగదీసేందుకే ప్రయత్నించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పరస్పరం నష్టపోయేందుకూ అవకాశాలే ఎక్కువ.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News