కొండను తవ్వినా ..దొరకలేదా..?

పరిపాలనలో ఏకచ్ఛత్రాదిపత్యం. అడిగేవారు లేరు. పదికాలాల పాటు పునరధికారం వచ్చేలా హాయిగా అడ్మినిస్ట్రేషన్ చేసుకునేంత ప్రజాబలం ఉంది. లేనిపోని చికాకులు, తలపోట్లతో ఆంధ్రప్రదేశ్ సర్కారు అనవసర తగాదాలు [more]

Update: 2021-07-20 12:30 GMT

పరిపాలనలో ఏకచ్ఛత్రాదిపత్యం. అడిగేవారు లేరు. పదికాలాల పాటు పునరధికారం వచ్చేలా హాయిగా అడ్మినిస్ట్రేషన్ చేసుకునేంత ప్రజాబలం ఉంది. లేనిపోని చికాకులు, తలపోట్లతో ఆంధ్రప్రదేశ్ సర్కారు అనవసర తగాదాలు తెచ్చిపెట్టుకుంటోంది. రాజకీయ నిర్ణయాలకు న్యాయబద్ధత కల్పించాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. స్పష్టమైన వైఖరితో ముందుకు వెళితే ఇబ్బందులేమీ ఉండవు. తిమ్మినిబమ్మి చేయాలనుకునే యత్నాల వల్ల పదే పదే న్యాయస్థానాల్లో బోల్తా పడుతున్నారు. ఇదొక రకంగా న్యాయస్థానాలకు, సర్కారుకు మధ్య అగాధంగా మారుతోంది. కోట్ల రూపాయలు పోసి ప్రయివేటు న్యాయవాదులను పెట్టుకున్నా ఫలితం లభించడం లేదు. తాజాగా అమరావతి భూములలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశంపై సుప్రీంకోర్టు కూడా పిటిషన్ కొట్టేసింది. హైకోర్టు తీర్పుతోనే ఆగిపోయి ఉంటే ప్రభుత్వానికి హుందాగా ఉండేది. ఇది పెద్దగా రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడిన అంశం కాదు. ప్రయివేటు వ్యక్తుల మధ్య జరిగిన లావాదేవీలు దీనిపై ప్రభుత్వం పంతం పట్టడం సమయం వృథా. అయినా పట్టుదలకు పోయి, సర్వోన్నత న్యాయస్థానంలోనూ ఎదురుదెబ్బ తినడం నిత్యం అలవాటుగా మారిపోయింది.

పాలనపై బెడితే బెటర్…

అమరావతిలో రాజధాని ఏర్పాటుపై ముందస్తు సమాచారంతో నేతలు, రియల్ ఎస్టేట్ వాళ్లు భూములను కొనుగోలు చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏ స్థాయిలో జరిగిందనే దానిని ఎవరూ నిర్ధరించలేకపోతున్నారు. రాజధాని ఆ ప్రాంతంలో వస్తోందని తెలియకుండా అమ్మేశారనే వాదన అర్థ సత్యం. ఎకరా పదిలక్షల రూపాయల విలువ చేసే భూమి, కోటి నుంచి రెండు కోట్ల రూపాయల వరకూ పలకడంతో స్తానిక రైతులు అమ్ముకోవడానికి సుముఖత చూపించారు. ఆ తర్వాత కాలంలో అవే భూములు ఎకరా అయిదుకోట్ల రూపాయల వరకూ కూడా పలికాయి. ఇది వాస్తవం. అయితే అమ్మినవాళ్లు, కొనుగోలు చేసిన వాళ్ల మధ్య జరిగిన వ్యవహారం ఇది. ఎవరూ పెద్దగా ఫిర్యాదులు చేయలేదు. రాజధాని రావడంతోనే అంత రేటు పెట్టి కొంటున్నారనేది రైతులకు తెలుసు. అందువల్లనే ఫిర్యాదులు లేవు. ప్రభుత్వమే వకాల్తా పుచ్చుకుని రైతులు నష్టపోయారంటూ వ్యాజ్యం దాఖలు చేసి, పోరాటం సాగించింది. అయితే బాధిత పార్టీలుగా చెబుతున్న అమ్మకం దారుల నుంచి సర్కారుకు మద్దతు కొరవడింది. దీంతో ఈ కేసులకు తగిన సాక్ష్యాధారాలు సేకరించడంలో ప్రభుత్వం విఫలమైంది. హైకోర్టు తీర్పుతోనే ఇది స్పష్టంగా తేలిపోయింది. అయినా పోలీసు కేసులు, రెవిన్యూ కేసులు నిలబడతాయనే ఉద్దేశంతోనే న్యాయపోరాటం చేశారు. నిజానికి ప్రజలు స్పందించనపుడు సర్కారు ఏం చేసినా ప్రయోజనం ఉండదు.

చీటికిమాటికి చికాకులు..

అసాధారణ ధరలకు పెరిగిన భూముల అమ్మకం అనేది బ్లాక్ మార్కెటింగ్ వ్యవహారం లాంటిదే. ఇప్పటికీ వరకట్న దురాచారం దేశంలో కొనసాగుతోంది. చట్ట ప్రకారం శిక్షార్హమైన నేరం. అయినా ఇచ్చేవాడు, పుచ్చుకునే వాడు పరస్పరం అంగీకారంతో సంబంధాన్ని నెలకొల్పుకోవడంతో చట్టం తెల్లబోతోంది. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కూడా అదే తంతుగా సాగుతుంటాయి. కొనుగోళ్లలో ఎక్కువ మొత్తం బ్లాక్ మనీ రూపంలో ఉంటుంది. అందువల్ల ఎవరికి వారు గప్ చుప్ అన్నట్లుగా ఉంటారు. అమరావతిలో కూడా సాగింది అదే. కోట్లలో సొమ్మును చూడని రైతాంగం ఒక్కసారిగా వచ్చిన సొమ్మును తమ అదృష్టంగా భావించి విక్రయాలు జరిపారు. వచ్చిన దానితో సంతృప్తి పడ్డారు. రైతుల్లో ఉండే కట్టుబాటు కారణంగా ఆ తర్వాత కాలంలో భూములు మరింత విలువ పెరిగినా ఫిర్యాదులు లేవు. దీనిని ప్రభుత్వం పెద్ద వ్యవహారంగా తీసుకోవడానికి ప్రధాన కారణం రాజకీయమే. అమరావతిని విభజించి మూడురాజధానులు చేయాలని వైసీపీ సర్కారు నిర్ణయించింది. దీనికి సాంకేతికమైన సాకులు వెదుకుతోంది. నిజానికి మూడు రాజధానుల నిర్ణయానికి, అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ కు లింకు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. తమ విధానపరమైన నిర్ణయాన్ని నిర్భయంగా అమలు చేసుకోవచ్చు. ఆమేరకు తగిన ప్రాతిపదిక సిద్దం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పటికే అమరావతిపై ముందుకు అడుగు పడదని తెలియడంతో అక్కడ భూముల విలువలు పడిపోయాయి. దీంతో న్యాయపోరాటం చేస్తున్న ప్రభుత్వంపై స్తానికుల్లో వ్యతిరేకత నెలకొంటోంది. సానుకూలత రావడం లేదు. రైతులు నష్టపోయారంటున్న ప్రభుత్వానికి అదే రైతుల నుంచి సపోర్టు దొరకడం లేదు.

కేంద్రానికి అలుసు..

ప్రాంతీయంగా బ్యాలెన్స్ చేయడానికి మూడు రాజధానులు చేయాలనుకున్న సర్కారు, సాధ్యమైనంత తొందరగా దానిని అమలులోకి తేవడానికి ప్రయత్నించాలి. లేకపోతే త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుగా ఉంటుంది. న్యాయపరంగా చిక్కులు ఉంటే అమరావతిపై కేంద్రం నుంచి సానుకూలత తెచ్చుకోవాలి. ముందుగా ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు మార్చడం ద్వారా పాలనను మార్చుకోవచ్చు. దానికి ఎవరూ అభ్యంతరం పెట్టే అవకాశం ఉండదు. కర్నూలు కు హైకోర్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం, హై కోర్టు నుంచి అనుమతులు తెచ్చుకుంటే సరిపోతుంది. అందుకు అవసరమైన ప్రతిపాదనలు, సౌలభ్యాలతో సిద్ధం కావాలి. విధానపరమైన నిర్ణయాల అమలును పక్కనపెట్టి న్యాయపోరాటాలు చేయడం వల్ల ప్రయోజనం శూన్యం. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో నిరంతర భంగపాటును చూసిన తర్వాత కేంద్రం సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని చిన్న చూపు చూస్తుంది. అందుకే పోలీసు కేసులను నమ్ముకుంటూ పాత విషయాలను తిరగదోడటం కంటే పక్కా సమాచారంతో రంగంలోకి దిగినప్పుడే మేలు చేకూరుతుంది. అందుకు ప్రజల నుంచి మద్దతు సమీకరించుకోవాలి. లేకపోతే సుప్రీం కోర్టు తీర్పులవంటి ఎదురుదెబ్బలు మళ్లీ మళ్లీ తగులుతుంటాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News