కంచికి చేరని కథ…ఇద్దరికీ ఇది…?

ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయినా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. రెండు వ్యవస్థల మధ్య ఏర్పడిన అభిప్రాయభేదాలు అలాగే ఉన్నాయి. తమకు నచ్చిన తీరులో [more]

Update: 2020-03-18 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయినా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. రెండు వ్యవస్థల మధ్య ఏర్పడిన అభిప్రాయభేదాలు అలాగే ఉన్నాయి. తమకు నచ్చిన తీరులో సుప్రీం తీర్పును ఇరుపక్షాలు అన్వయించుకోవచ్చు. రెంటికీ ఇది చెంప పెట్టే. సున్నితమైన సాధారణ న్యాయసూత్రాలను విస్మరించి రచ్చకెక్కి సాధించిందేమిటో ఎవరికీ అర్థం కాదు. అటు ఎన్నికల సంఘం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తమ పనితీరును, పద్ధతిని సమీక్షించుకోవాల్సిన అనివార్యతను సుప్రీం కోర్టు తీర్పు గుర్తు చేసింది. ఇరుపక్షాల వాదనల్లోని డొల్లతనాన్ని వెలికి తెచ్చింది. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థగా ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం ప్రశ్నించలేనిదని స్పష్టం చేసింది. అదే సమయంలో దీర్ఘకాలం ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటే అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదని తేటతెల్లం చేసింది. మొత్తంగా అర్థం చేసుకోవాల్సిన నీతి ఒక్కటే. ఎవరి పరిధిలో వారు పనిచేయాలి. అటు ఎన్నికల సంఘం, ఇటు రాష్ట్రప్రభుత్వమూ స్వతంత్ర వ్యవస్థలే . కానీ వాటికి కొన్ని పరిమితులు, పరిధులు ఉంటాయి. తమంతట తాము పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని ఒక రాజ్యాంగ సమస్యగా మార్చి ప్రతిష్టంభన సృష్టించారు. సర్వోన్నత న్యాయస్థానం కొత్తగా చెప్పిందేమీ లేదు. అందరికీ తెలిసిన విషయాన్నే చాటి చెప్పింది. శంఖంలో పోస్తేనే తీర్థమన్నట్లు ఇప్పుడిక ప్రభుత్వమూ, ఎన్నికల సంఘమూ సుప్రీం తీర్పును శిరోధార్యంగా భావించకతప్పదు.

పరిధులు గుర్తించండి…

స్థానిక సంస్థలు గ్రామస్వరాజ్యానికి పునాదులు. రాష్ట్రప్రభుత్వాలు వాటిని ఆరో వేలుగా మార్చేశాయి. ఉండీ లేని వ్యవస్థలుగా, పదవుల పంచాయతీకి మాత్రమే ఉపకరించే హోదాలుగా నిర్వీర్యం చేసేశాయి. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు 73,74 రాజ్యాంగ సవరణలు తెచ్చినప్పటికీ ఫలితం పెద్దగా చేకూరలేదు. రాష్ట్రప్రభుత్వాల ఇష్టారాజ్యమే చెల్లుబాటవుతోంది. ఆర్థిక సంఘాల సిఫార్సుల మేరకు ఎన్నికలు జరిపితే తప్ప నిధులు రావన్న పరిస్థితుల్లో మొక్కుబడిగా పని కానిచ్చేస్తున్నారు. అందువల్లనే పంచాయతీ ఎన్నికలకు ఉండే పవిత్రత తగ్గిపోయింది. అయినప్పటికీ ఎన్నికల పేరు చెబితే చాలు పార్టీల మధ్య రగులుకునే కక్షలు, కార్పణ్యాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోనూ ఎన్నికలు జరపతలపెట్టారు. అనేక చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. లోకల్ ఫైట్ లలో ఇది మామూలే. ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం లేదని న్యాయస్థానంలో ఫిర్యాదులు దాఖలయ్యాయి. మధ్యలో కరోనా వచ్చిపడింది. ఎన్నికల సంఘం వాయిదా మంత్రం పఠించింది. దూకుడు మీదున్న వైఎస్సార్ కాంగ్రెసుకు బ్రేకు వేసేందుకే ఈ నిర్ణయమని భావించిన ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పార్టీగా వైసీపీ ఎటువంటి విమర్శలు అయినా చేయవచ్చు. ప్రభుత్వంలోని బాధ్యులు మాత్రం సున్నితంగానే వ్యవహరించాలి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చి పెట్టాల్సింది ప్రభుత్వమే. శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత సైతం ప్రభుత్వానిదే. పరిధులు చెరిగిపోవడంతో ప్రతిపక్షాల మాదిరిగానే ప్రభుత్వమూ ఒక పార్టీగానే స్పందించింది. ఎన్నికల సంఘంతో ప్రత్యక్ష పోరాటానికి దిగింది.

తాత్కాలికమే…

ఎన్నికల వాయిదాను సుప్రీం కోర్టు సమర్థించింది. నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఎన్నికల సంఘానికి ఉంటుందని రాజ్యాంగబద్ధ అంశాన్ని మరోసారి స్పష్టంగా చెప్పింది. అదే సమయంలో రాష్ట్రప్రభుత్వానికి ఉపశమనం కలిగించే నిర్ణయం వెలువరించింది. ప్రభుత్వం ముందుగా నిర్ణయించుకున్న పథకాలు, కార్యక్రమాలు కొనసాగించవచ్చంటూ ఎన్నికల కోడ్ అమలు ను నిలిపివేసింది. ఈ రెండు వ్యవస్థల మధ్య ఏర్పడిన ప్రతిష్ఠంభనకు తాత్కాలికంగా సుప్రీం కోర్టు తెర దించింది. అయితే ఇంకా అనేక ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ఎన్నికల నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని భావించి కొందరు అధికారుల బదిలీకి ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. వాటిని అమలు చేయాల్సిన ప్రభుత్వం తొక్కిపట్టింది. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ తొలగించినందున వారిని ఆయా పదవుల్లో కొనసాగిస్తారా? లేక ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయంలో తన ఆదేశాల అమలుకు ఎన్నికల సంఘం పట్టుబడుతుందా? లేదా ప్రభుత్వ వైఖరిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుందా? తేలాల్సి ఉంది. ఈ విషయంలో స్పష్టత వచ్చినప్పుడే ఎన్నికల ప్రక్రియలో ఈసీకి , ప్రభుత్వానికి ఉండే అధికారాల పరిధి తెలుస్తుంది. అందువల్ల మరోసారి న్యాయస్థానమే జోక్యం చేసుకొని తీర్పు చెప్పాల్సిన అంశం ఇంకా మిగిలి ఉన్నట్లుగానే భావించాలి.

సామరస్యమే పరిష్కారం…

తెగే వరకూ లాగడం అటు ప్రభుత్వానికి, ఇటు ఎన్నికల సంఘానికి మంచిది కాదు. రెండు యంత్రాంగాలు కలిసి పనిచేస్తేనే స్థానిక ఎన్నికలు సక్రమంగా నిర్వహించడం సాధ్యమవుతుంది. పంతాలు, పట్టింపులు, సహాయ నిరాకరణల వల్ల రాష్ట్రం పరువు బజారున పడుతుంది. ప్రతి సందర్భంలోనూ న్యాయస్థానం జోక్యం చేసుకోవడం అనవసర జాప్యానికి దారి తీస్తుంది. ఎన్నికల సంఘం వర్సస్ ప్రభుత్వంగా వ్యవహారం నడుస్తుంటే రాజకీయపార్టీల ఆరోపణలకు కావాల్సినంత ముడిసరుకు దొరికినట్లే. ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాలకు ఈ వివాదాన్ని పెంచి పెద్ద చేస్తాయి. ప్రభుత్వ పక్షంపై మరక తప్పదు. అందువల్ల ప్రభుత్వాధినేత సంయమనం పాటించడమే మేలు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కలిసిగట్టుగా పనిచేసే వాతావరణం కల్పిస్తే ఆరోపణలకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. అది అధికార పార్టీకే ఎక్కువ ప్రయోజనదాయకమవుతుంది. స్థానిక ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి తన పార్టీని భుజాన వేసుకోవాల్సినంత అవసరం ఉండదు. వాటిని ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నాయకులు చూసుకుంటారు. సామరస్య వాతావరణంలో ఎన్నికలు జరిగిపోయేలా సహకరించాలి. అప్పుడే ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రావాల్సిన అయిదువేల కోట్ల రూపాయల పైచిలుకు నిధులు తెచ్చుకోవడం సులభసాధ్యమవుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News