దర్బార్ మూవీ రివ్యూ

బ్యానర్: లైకా ప్రొడక్షన్స్ నటీనటులు: రజినీకాంత్, నయనతార, నివేత థామస్, సునీల్ శెట్టి, యోగి బాబు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: అనిరుధ్ సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్ ఎడిటింగ్: [more]

Update: 2020-01-09 08:54 GMT

బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
నటీనటులు: రజినీకాంత్, నయనతార, నివేత థామస్, సునీల్ శెట్టి, యోగి బాబు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: అనిరుధ్
సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాత: అల్లిరాజ సుభాస్కరన్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్: ఏ ఆర్ మురుగదాస్

సౌత్ ఇండియాలో రజినీకాంత్ అంటే పడిచచ్చిపోయే అభిమానుల సంఖ్యను లెక్క గట్టడం అసాధ్యం. ఆయన స్టైల్ కె భారీ క్రేజ్, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంత క్రేజ్ ఉన్న రజినీకాంత్ గత కొన్నాళ్లుగా హిట్ అనే పదానికి చాలా దూరమయ్యాడు. రాజీకాంత్ సినిమాలంటే పిచ్చెక్కిపోయే అభిమానులకు రజిని వరసగా షాకిస్తూనే ఉన్నాడు. వయసైపోయిన రజనీలో మునుపటి చురుకు లేదు… ముప్పయ్‌లలో వున్న ఎనర్జీ అరవైలలో కనబడడం లేదు. ఒకటా రెండా అరడజను సినిమాలకు పైనే ప్లాప్స్ కొట్టిన రజినీకాంత్ .. ఇప్పుడు కోలీవుడ్ లో సెన్సేషనల్ డైరెక్టర్ మురుగదాస్ తో దర్బార్ సినిమాని చేసాడు. రజినీకాంత్ స్టయిల్, మూయనరిజం, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా మురుగదాస్ కి తెలుసు. అందుకు అనుగుణంగానే దర్బార్ అనే పవర్ ఫుల్ టైటిల్ తో మాస్ ఎంటెర్టైనెర్ గా ఈ సినిమాని స్టైలిష్ గా తెరకెక్కించాడని దర్బార్ ట్రైలర్ కానీ, పోస్టర్స్ కానీ చూస్తే తెలుస్తుంది. మురుగదాస్ డైరెక్టర్, రజినీకాంత్ హీరో అంటే ఆ సినిమాపై ఎంతగా అంచనాలుంటాయో చెప్పనలవి కావు.. అందులోను రజినీకాంత్ క్రేజ్ దృష్ట్యా ఆయన సినిమాల టైంమ్ లో చాలా ఐటి కంపెనీస్ తమ ఉద్యోగుల కోసం సెలవు ప్రకటించడం వంటి హంగామా ఒక్క రజినీకాంత్ కే చెల్లుతుంది. మరి దర్బార్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన మురుగదాస్ – రజినికాంత్ దర్బార్ సినిమాతో ఎలాంటి హిట్ కొట్టారో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
ఆదిత్య అరుణాచలం(రజినీకాంత్) మాంచి యాటిట్యూడిక్ పోలీస్ ఆఫీసర్. ముంబై యువత డ్రగ్స్ కి బానిసలుగా బతుకుతున్న స్థితిలో.. ఢిల్లీ నుంచి ముంబైకి ట్రాన్స్ఫర్ అయ్యి… ముంబైకి కమీషనర్ గా వస్తాడు. రావడంతోనే వేలమంది ఆడపిల్లలను సేవ్ చేస్తాడు. మరో పక్క తన కూతురు వల్లీ (నివేథా థామస్)తో సరదాగా గడుపుతుంటాడు. ఇదే నేపథ్యంలోమెయిన్ విలన్ హరి చోప్రా(సునీల్ శెట్టి) పేరు మోసిన డాన్ గా ఒక మాఫియాను నడిపిస్తుంటాడు. అయితే అడుగడుగునా తనకి అడ్డొస్తున్న ఆదిత్య అరుణాచలం ని హరి చోప్రా టార్గెట్ చేసాడు. అందులో భాగంగా ఆదిత్య అరుణాచలం జీవితంలో ఓ విషాదం చోటు చేసుకుంటుంది. దానికి ప్రతీకారంగా హరి చోప్రా మీద ఆదిత్య అరుణాచలం ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? అసలు కథలో ఆదిత్య అరుణాచలం కి హరి చోప్రా కి ఉన్న సంబంధం ఏమిటి? వీరిద్దరి మధ్యలో ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా?అసలు ఆదిత్య అరుణాచలం జీవితంలో చోటు చేసు కున్న విషయం ఏమిటి? అనేది వెండితెర మీద దర్బార్ చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల నటన:
ఈ సినిమాలో సూపర్ స్టార్ రాజీకాంత్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. రజనీకాంత్ తన స్టైలిష్ ఎనర్జిటిక్ నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. ట్రైన్ ఎపిసోడ్ లో మరియు కొన్ని సెంటిమెంట్ సీన్స్ లో అండ్ ఇంటర్వెల్ క్లైమాక్స్ లో రజిని తన మ్యానరిజమ్స్ తో తన శైలి నటనతో బాగా అలరిస్తారు. సినిమాకే అతి కీలక మైన పాత్రలో నటించిన నివేథా తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఆమెకు సంబంధించిన కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ లో నివేథా నటన సినిమాకే ప్రత్యేక హైలెట్ గా నిలుస్తోంది. విలన్ గా సునీల్ శెట్టి పర్వాలేదు అనిపించేలా ఉన్నాడు. పేరుకు పెద్ద డాన్ కానీ.. ఆ పవర్ ఫుల్ యాక్షన్ మాత్రం రెండు మూడు సీన్స్ కే పరిమితమైంది. ఇక హీరోయిన్ గా నయనతార పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్న కొన్ని సీన్స్ లో తన గ్లామర్ అండ్ స్క్రీన్ ప్రెజెన్సీతో మెప్పించింది. మిగతా నటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:
కొన్నాళ్లుగా రజినీకాంత్ కథలు వినడంలో పొరబాటో… లేదంటే కథల ఎంపిక గ్రహపాటో కానీ.. వరసగా ఒకే రకమైన కథలతో బోర్ కొట్టిస్తున్నాడు. ఏ దర్శకుడుగా అయినా కథ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేసి.. రజినీకాంత్ ని, ఆయన ఫ్యాన్స్ ని మెప్పించేలా మాత్రమే సినిమాలు తెరకెక్కిస్తున్నారు. రజిని కూడా దర్శకుల మాయలో పడి మూస కథలతో చెత్త సినిమాలు తీస్తున్నాడు. తాజాగా దర్బార్ కథ కూడా రొటీన్ ఫార్ములానే. చాలా సినిమాల్లో చూసిన కథే. కాకపోతే రజినీకాంత్ ఇక్కడ దర్శకుడు మురుగదాస్ కథనం, స్టయిల్ కి పడిపోయాడనిపిస్తుంది. మురుగదాస్ అంటే ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు కూడా కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే వాటిని ఫస్ట్ హాఫ్ లో మురుగదాస్ అందుకోలేకపోయాడనే చెప్పాలి. కాకపోతే రెండు మూడు ఇంటిలిజెన్స్ సీన్స్ ఫస్ట్ హాఫ్ లో మెప్పిస్తాయి. విదేశాలకు పారిపోయిన అజయ్ మల్హోత్రాన్ని తెలివిగా దేశానికీ రప్పించడం, అంతే తెలివిగా జైల్లోపెట్టే ఇంటరెవెల్ బ్యాంగ్ ఆకట్టుకునేలా ఉంది. ఇక మెయిన్ గా సెకెండ్ హాఫ్ స్లో అయింది. సెకెండాఫ్ లోని కొన్ని దృశ్యాలు అనవసరంగా సాగాతీశారు. తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ ఎక్కువైంది అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం చాలా వరకు లోపించింది. అలాగే చాల కీలకమైన సన్నివేశాలను కూడా దర్శకుడు చాలా సినిమాటిక్ గా చూపించాడు. సినిమాలోని మెయిన్ విలన్ కు పెట్టిన ట్రాక్ కూడా ఎపెక్టివ్ గా అనిపించదు. అయితే దర్శకుడు మురుగ స్క్రీన్ ప్లే మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ కథ మీద పెట్టలేదు. అందుకే ఈ సినిమా అంతగా ఆకట్టుకోదు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా చప్పగా అనిపిస్తాయి. ఇక ఫైనల్ గా రజిని స్టయిల్, అయన ఎనర్జీ పెరఫామెన్స్, అయన జోష్ మాత్రమే సినిమాకి హైలెట్.

సాంకేతికంగా..
సంగీత దర్శకుడు అనిరుధ్ అందించిన సంగీతం చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఉన్న యాక్షన్ ను ఇంకా ఎలివేట్ చేస్తూ బాగా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ కూడా సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని కెమరామెన్, దర్శకుడి ఆలోచనకు తగ్గట్లు భారీ విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ముఖ్యంగా రజినిని చాలా యంగ్ గా చూపించారు. ఇక ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్… అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్: రజినీకాంత్ స్టయిల్, ఆయన ఎనేర్జి నటన, స్క్రీన్ ప్లే, సంగీతం, నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్: కథ, ఎడిటింగ్, సెకండ్ హాఫ్

రేటింగ్: 2.5/5

Tags:    

Similar News