కమలం వైపే మొగ్గు చూపుతున్నారా…?

సుమలత ఖచ్చితంగా మాండ్య పార్లమెంటు నుంచి పోటీ చేస్తానని చెప్పేశారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది క్లారిటీ ఇవ్వకపోయినా సుమలత మాత్రం బీజేపీ వైపు [more]

Update: 2019-03-09 18:29 GMT

సుమలత ఖచ్చితంగా మాండ్య పార్లమెంటు నుంచి పోటీ చేస్తానని చెప్పేశారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది క్లారిటీ ఇవ్వకపోయినా సుమలత మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తొలుత కాంగ్రెస్ లో ఉండి టిక్కెట్ సాధించుకుందామన్న సుమలత చేసి ప్రయత్నాలు ఫలించలేదు. మాండ్య స్థానం జనతాదళ్ ఎస్ కు కేటాయించడం, ఆ పార్టీ మాండ్య నుంచి దేవెగౌడ మనవడు నిఖిల్ బరిలోకి దిగుతారని ప్రకటించడం చకా చకా జరిగిపోయాయి. మైసూరుకు కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఈ ప్రాంతంలో దళ్ కు పట్టు ఎక్కువగానే ఉంటుంది.

జేడీఎస్ కు కేటాయించడంతో…..

అలాగే కాంగ్రెస్ నేతగా అంబరీష్ మాండ్య ప్రజల మనస్సుల్లో నిలిచిపోయారు. అంబరీష్ మరణం తర్వాత అధికారంలో ఉన్న జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ లు బాగానే స్పందించాయి. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉండటంతో అంబరీష్ స్మారక మందిర నిర్మాణానికి కుమారస్వామి స్థలాన్ని కూడా కేటాయించారు. కాంగ్రెస్ నేతలు కోరకున్నప్పటికీ కుమారస్వామి ఆయనపై ఉన్న అభిమానంతో ఈ పనిచేశారంటున్నారు. అయితే టిక్కెట్ దగ్గరకు వచ్చేసరికి సుమలతకు హ్యాండిచ్చారు. కాంగ్రెస్ కూడా సుమలతను లైట్ గానే తీసుకున్నారు.

కొన్ని రోజులుగా ప్రజలతోనే….

గత కొన్ని రోజులుగా సుమలత తనకే టిక్కెట్ వస్తుందని మాండ్య ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ప్రజలను కలసుకుని కష్టనష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. అంబరీష్ ఆశయ సాధనకోసమే తాను రాజకీయాల్లోకి వచ్చాననిచెబుతున్నారు. అంబరీష్ అభిమానుల నుంచి కూడా ఆమెపై వత్తిడి ఎక్కువగా ఉంది. దీంతో సుమలతపై ఎదురుదాడి ప్రారంభించింది జనతాదళ్ ఎస్. ఆ పార్టీకి చెందిన మంత్రి తమ్మణ్ణ సుమలతపై ఫైర్ అయ్యారు. అంబరీష్ జీవించి ఉన్నప్పుడు ఆమె ప్రజలను పట్టించుకోలేదన్నారు. అంబరీష్ పేరు చెప్పుకుని తిరగడం మంచిది కాదని సుమలతకు హితవు పలికారు.

బీజేపీ ఆఫర్ కి….

అయతే సుమలత మాత్రం భారతీయ జనతా పార్టీవైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దేవెగౌడ మనవడికు గట్టి పోటీ ఇవ్వాలంటే తాను బీజేపీ నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ కూడా సుమలతకు మాండ్య టిక్కెట్ ఇచ్చేందుకు రెడీ గా ఉంది. తనకు అంబరీష్ అభిమానులతో పాటు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మద్దతు పలుకుతారన్న ధీమాగా సుమలత ఉన్నారు. అయితే ఆమె మరోసారి ముఖ్యులతో సంప్రదించి బీజేపీలో చేరాలా? స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలా? అన్నది తేల్చుకోనున్నారు.

Tags:    

Similar News