కాస్కో నా రాజా అంటున్నారే

మరోసారి రాజులకు ప్రతిష్టగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని బొబ్బిలి రాజులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. టీడీపీ నేత [more]

Update: 2020-03-07 02:00 GMT

మరోసారి రాజులకు ప్రతిష్టగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని బొబ్బిలి రాజులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. టీడీపీ నేత సుజయకృష్ణ రంగారావు బొబ్బిలి మున్సిపాలిటీలో పసుపు జెండా ఎగరవేయాలని శ్రమిస్తున్నారు. అదే సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ సయితం బొబ్బిలి మున్సిపాలిటిని వైసీపీ కైవసం చేసుకుని రాజులను బొబ్బిలి నుంచి పంపించేయాలని శపథం చేశారట. ఇలా బొబ్బిలి కేంద్రంగా మళ్లీ రాజకీయాలు హీటెక్కాయి.

తొలి నుంచి బొబ్బిలి…..

తొలి నుంచి బొబ్బిలి నియోజకవర్గం నిజంగా రాజులకు కోట లాంటిదే. బొబ్బిలి నియోజకవర్గం నుంచి సుజయ కృష్ణ రంగారావు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు కాంగ్రెస్, ఒకసారి వైసీపీ నుంచి విజయం సాధించారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన తర్వాత సుజయ కృష్ణరంగారావు టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. తాను టీడీపీలో చేరడానికి కారణం బొత్స సత్యనారాయణ వైసీపీలోకి రావడమే అని సుజయ కృష్ణ నాడు బహిరంగంగానే చెప్పారు. అంటే బొత్స వర్సెస్ సుజయ్ వార్ ఎప్పటి నుంచో నడుస్తోంది.

మున్సిపాలిటీలో పైచేయి……

అందుకే గత ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ తెలివిగా శంబంగి చిన అప్పలనాయుడును వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దించారు. శంబంగి చిన అప్పలనాయుడు కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన నేత. ఇక్కడ కొప్పుల వెలమ, కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకు బలంగా ఉంది. అందుకే శంబంగి అప్పలనాయుడు సుజయ కృష్ణరంగారావుపై గెలిచారు. ఇప్పుడు బొబ్బిలి మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకోవాలని సిద్ధమవుతున్నారు. అయితే ఎనిమిది నెలలుగా మున్సిపాలిటీలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, ప్రజల ముందుకు వెళ్లేందుకు సుజయ కృష్ణ రంగారావు సిద్ధమవుతున్నారు.

ప్రధాన సమస్యలపై……

ముఖ్యంగా తోటపల్లి కాల్వల భూ సేకరణ, వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులతో పాటు బొబ్బిలి పట్టణంలో రోడ్ల విస్తరణ విషయంలో ప్రభుత్వం విఫలమైందని సుజయ కృష్ణ రంగరావు ఆరోపిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. అయితే బొబ్బిలిని తమ పరం చేసుకోవాలని బొత్స ఇప్పటి నుంచే అక్కడ పర్యటనలు చేస్తున్నారు. మున్సిపల్ శాఖ నుంచి నిధులు ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు. తరచూ కొప్పల వెలమ, కాపు సామాజిక వర్గ నేతలతో సమావేశమవుతున్నారు. తన మేనల్లుడు చిన్న శ్రీనును కూడా బొబ్బలిని దక్కించుకునే పనిలో పెట్టారు. ఇలా బొబ్బిలి మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు ఇటు బొత్స సత్యనారాయణ, అటు సుజయ కృష్ణ రంగారావు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. మరి ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.

Tags:    

Similar News