మాజీ మంత్రి రాజకీయ వైరాగ్యం..?

రాజకీయాలు వాసన పట్టాలే కానీ దానికి వైరాగ్యం సన్యాసం అన్న పదాలు అసలు కుదిరేవి కావు. ఆ మత్తు అలాంటిది. కానీ కొందరు మాత్రం దాని నుంచి [more]

Update: 2021-04-13 05:00 GMT

రాజకీయాలు వాసన పట్టాలే కానీ దానికి వైరాగ్యం సన్యాసం అన్న పదాలు అసలు కుదిరేవి కావు. ఆ మత్తు అలాంటిది. కానీ కొందరు మాత్రం దాని నుంచి వేరు పడి తమ సొంత జీవితాలను తిరిగి కొనసాగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వారిలో విజయన‌గరం జిల్లాకు చెందిన పూసపాటి వంశాధీశుడు ఆనందగజపతిరాజుని చెప్పుకోవాలి. రెండు సార్లు ఎంపీగా, ఒకసారి రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఆనంద్ రాజకీయాలలో రొచ్చుని చూసి ఇక చాలు అంటూ దండంపెట్టేసి తప్పుకున్నారు.

ఈయనదీ అదే రూటా …

ఇక ఇదే విజయనగరం జిల్లాకు చెందిన బొబ్బిలి రాజు, ఘనమైన వంశ చరిత్ర కలిగిన మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు కూడా ఇపుడు రాజకీయాల పట్ల పెద్దగా వ్యామోహం కనబరచలేదుట. ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఒకసారి మంత్రి కూడా అయ్యారు. అయితే ఆయన విజయాలు అన్నీ కూడా కాంగ్రెస్ వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. 2017లో వైసీపీ నుంచి బయటకు వచ్చి సైకిలెక్కేశారు. అలా మంత్రి అయిన సుజయ కృష్ణ రంగారావు ఆ వైభోగాన్ని గట్టిగా రెండేళ్ళైనా అనుభవించకుండా మాజీ అయిపోయారు, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

ఫుల్ సైలెంట్ ….

ఓడిన తరువాత నుంచి సుజయ కృష్ణ రంగారావు యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు. ఆయన విశాఖలోనే ఉంటారని అంటారు. ఇక నియోజకవర్గం బాధ్యతలను కూడా ఆయన తప్పించేసుకున్నారు. ఆయన అనాసక్తిని చూసిన చంద్రబాబు తమ్ముడు బేబీ నాయనకు బొబ్బిలి టీడీపీ ఇంచార్జి పదవి ఇచ్చారు. ఆయనే స్థానిక ఎన్నికల్లో వైసీపీతో పోరాడి పార్టీని ఉనికిలో ఉంచారు. అయినా సరే ఇక్కడ వైసీపీ ఘన విజయాలే సాధించింది. బొబ్బిలి మునిసిపాలిటీని కూడా తాజాగా వైసీపీ గెలుచుకుని మొత్తం విజాయాలను సంపూర్ణం చేసుకుంది.

తమ్ముడే దిక్కా…?

ఈ నేపధ్యంలో బొబ్బిలి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం కష్టమే అన్న మాట ఉంది. గత నాలుగు ఎన్నికల నుంచి ఇక్కడ టీడీపీ వరసగా ఓడిపోతూనే ఉంది.వైఎస్సార్ కాంగ్రెస్ కి తెచ్చిన ఊపుతో ఆ పార్టీ పుంజుకుంది. ఆ తరువాత జగన్ పార్టీ పెడితే ఆ వైపు మొత్తం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా షిఫ్ట్ అయింది. దాంతో వైసీపీ ఇక్కడ బలంగా ఉంది. మరి టీడీపీ బొబ్బిలి రాజులను నమ్ముకుంది. దాంతో ఇన్నాళ్ళూ పార్టీ జెండాను మోసిన వారు, ఇతర నాయకులు పార్టీ మీద గుర్రుమంటున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉంటే మంత్రిగా చేసిన సుజయ కృష్ణ రంగారావు దూరంగా ఉండడం కూడా దెబ్బే అంటున్నారు. మొత్తం భారమంతా తమ్ముడు బేబీ నాయన మీదనే ఉంది. ఆయనే ఇపుడు టీడీపీకి బొబ్బిలికో పెద్ద దిక్కుగా మారారు. 2024లో ఏమైనా అద్భుతం జరిగితే తప్ప ఇక్కడ టీడీపీ గెలిచే సీన్ లేదని అంటున్నారు.

Tags:    

Similar News