మొత్తానికి బొబ్బిలి రాజులను కదిలించారుగా..?

బొబ్బిలి రాజులు అంటే పౌరుషానికి ప్రతీకలుగా చెప్పుకుంటారు. నాడు జరిగిన బొబ్బిలి యుధ్ధం చరిత్రలో నిలిచిపోయింది. ఇక ఆధునిక కాలంలో కూడా బొబ్బిలి రాజులు రాజకీయంగా కూడా [more]

Update: 2021-01-21 06:30 GMT

బొబ్బిలి రాజులు అంటే పౌరుషానికి ప్రతీకలుగా చెప్పుకుంటారు. నాడు జరిగిన బొబ్బిలి యుధ్ధం చరిత్రలో నిలిచిపోయింది. ఇక ఆధునిక కాలంలో కూడా బొబ్బిలి రాజులు రాజకీయంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. బొబ్బిలికి చెందిన వారు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా మంత్రులుగా కీలకమైన భూమిక పోషించారు. వారి వారసుడిగా సుజయ కృష్ణ రంగారావు 2004లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా బొబ్బిలి నుంచి గెలిచారు.

వైఎస్సార్ చలువతోనే …?

వైఎస్సార్ ప్రేరణతో 2004 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన సుజయ కృష్ణ రంగారావు రెండు మార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2014 ఎన్నికల నాటికి ఆయన వైసీపీలో చేరి గెలిచారు. మూడేళ్ళ పాటు జగన్ పక్షాన ఉండి అధికార టీడీపీ మీద పోరాటం చేశారు. బొబ్బిలి రాజులకు జగన్ ఎంతో విలువ గౌరవం ఇచ్చారు. అయితే టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కి ఆయన పడిపోయి సైకిలెక్కేశారు. దాంతో మంత్రి అయ్యారు కానీ ఆ యోగం మూడు నాళ్ళ ముచ్చటే అయింది. 2019 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే అప్పటికి రాజకీయంగా పెద్దగా జనంలో లేని శంబంగి చిన అప్పలనాయుడుని పోటీగా వైసీపీ పెడితే సుజయ కృష్ణ రంగారావు దారుణంగా ఓడిపోయారు.

జగన్ నో అన్నారా…?

ఓడిన నాటి నుంచి టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్న సుజయ కృష్ణ రంగారావు మళ్ళీ వైసీపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఆయనను తీసుకోవడానికి జగన్ నో చెప్పారని తాజాగా వినిపిస్తున్న మాట. తాను కష్టాల్లో ఉన్నపుడు కాదని వెళ్ళిన వారు ఇపుడు అధికారంలో ఉంటే వస్తామనడాన్ని జగన్ సహించలేకుండా ఉన్నారని టాక్. దాంతో ఆయన బొబ్బిలి రాజుల చేరికకు ససేమిరా అంటున్నారని తెలుస్తోంది. మరో వైపు విజయనగరం జిల్లా రాజకీయాల్లో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పలుకుబడి అధికంగా ఉంది. ఆయన్ని కాదని బొబ్బిలి రాజులను తెచ్చిపెట్టుకుని కొత్త తలనొప్పులు ఎందుకు భరించాలి అన్నది కూడా వైసీపీ పెద్దలకు ఉందని అంటున్నారు. ఈ పరిణామంతో బొబ్బిలి రాజులకు వైసీపీలో తలుపులు మూసుకుపోయాయని చెబుతున్నారు.

కాషాయం కట్టేస్తారా …?

ఇక మిగిలింది ఒక్కటే మార్గం అని అంటున్నారు. అదే కాషాయం పార్టీలో చేరి బొబ్బిలి రాజులు తమ‌ రాజకీయ అదృష్టాన్ని మరో మారు పరీక్షించుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. అయితే ఉత్తరాంధ్రా జిల్లాల్లో బీజేపీకి ఉన్న అస్థిత్వం ఎంత అన్న దాని మీదనే కాస్తా మధనం జరుగుతోందిట. సొంత బలం ఎంత ఉన్నా కూడా పార్టీ అండ కూడా ఉంటే తప్ప విజయం సాధ్యం కాదని సుజయ కృష్ణ రంగారావు ఆలోచిస్తున్నారుట. అయితే ఇప్పటికే బొబ్బిలి రాజులకు దగ్గర బంధువు అయిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ బీజేపీలో చేరిపోయారు. దాంతో ఆయన కూడా వత్తిడి తెస్తున్నారుట. తిరుపతి ఉప ఎన్నికకు ముందే సుజయ కృష్ణ రంగారావు కమలం కండువా కప్పుకుంటారన్నది తాజాగా వినిపిస్తున్న మాట. అదే కనుక జరిగితే రెండేళ్ళుగా సైలెంట్ గా ఉన్న బొబ్బిలి రాజులను కదిలించిన క్రెడిట్ కచ్చితంగా బీజేపీ పెద్దలకే దక్కుతుంది అంటున్నారు.

Tags:    

Similar News