సుజయ పనికిరాడంటున్నారే… మారుస్తారా?

అప్పుడప్పుడు తళుక్కుమంటే రాజకీయాల్లో ప్రజలు ఆదరిస్తారా? తాను అధికారంలో ఉండగా విర్రవీగడమే తప్ప నియోజకవర్గానికి ఎటువంటి ఉపయోగం చేయలేదన్నది ఆయనపై ఉన్న విమర్శ. ఇప్పుడు ఓటమి పాలు [more]

Update: 2020-09-15 11:00 GMT

అప్పుడప్పుడు తళుక్కుమంటే రాజకీయాల్లో ప్రజలు ఆదరిస్తారా? తాను అధికారంలో ఉండగా విర్రవీగడమే తప్ప నియోజకవర్గానికి ఎటువంటి ఉపయోగం చేయలేదన్నది ఆయనపై ఉన్న విమర్శ. ఇప్పుడు ఓటమి పాలు కావడంతో నియోజకవర్గానికే దూరమయిపోయారు. ఆయనే బొబ్బిలి రాజు సుజయ కృష్ణ రంగారావు. సుజయ కృష్ణ రంగారావు ఓటమి దగ్గర నుంచి నియోజకవర్గంలో కన్పించడమే మానేశారు.

అన్నింటికి దూరంగా…..

ఇక పార్టీ కార్యక్రమాలకు సుజయ కృష్ణ రంగారావు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లకు కూడా ఆయన హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. ఇక బొబ్బిలి నియోజకవర్గంలో కార్యకర్తలు ఇటీవల ఈ విషయాన్ని కేంద్ర పార్టీ కార్యాలయానికి కూడా తెలియజేశారు. తమకు నాయకుడు లేరని, పార్టీ కార్యక్రమాలను నిర్వహించలేకపోతున్నామని కొందరు కార్యకర్తలు కేంద్ర పార్టీ కార్యాలయానికి ఫోన్ చేసి మరీ ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.

ఓటమి దగ్గర నుంచి….

నిజానికి సుజయ కృష్ణ రంగారావు 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి బొబ్బిలి నుంచి గెలిచారు. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన టీడీపీలో చేరిపోయారు. టీడీపీలో చేరిన వెంటనే సుజయ కృష‌్ణరంగారావుకు మంత్రి పదవి దక్కింది. ఒక మూడేళ్ల పాటు గనుల శాఖ మంత్రిగా రాజుగారు చెలరేగిపోయారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సుజయ కృష్ణ రంగారావు ఓటమి పాలయ్యారు. దీంతో అప్పటి నుంచి ఆయన నియోజకవర్గాన్నే పట్టించుకోవడం లేదు.

నాయకత్వాన్ని మార్చాలంటూ…..

కానీ అప్పుడప్పుడు విశాఖలోనూ, విజయవాడలోనో మీడియా సమావేశం పెట్టి సుజయ కృష్ణ రంగారావు ప్రభుత్వంపై ఫైర్ అవుతారు తప్పించి పూర్తి స్థాయి రాజకీయాలు చేయడం లేదు. బొబ్బిలిలో పార్టీకి సరైన నాయకత్వం లేదని ద్వితీయ శ్రేణి నాయకులు చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఆయన మళ్లీ ఎన్నికల వరకూ ఇక్కడకు రారని, మరో నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలని చంద్రబాబును బొబ్బిలిరాజులకు వ్యతిరేక వర్గం కోరనున్నట్లు సమాచారం. మరి చంద్రబాబు సుజయకృష్ణ రంగరావును కాదని వేరేవారికి బాధ్యతలు అప్పగిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News