సుజనాపై నజర్

కేంద్రమాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై జగన్ సర్కార్ నజర్ పెట్టినట్లుంది. రాజధాని ప్రాంతంలో ఆయనకు గాని, ఆయన బినామీల పేరిట [more]

Update: 2019-09-20 00:30 GMT

కేంద్రమాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై జగన్ సర్కార్ నజర్ పెట్టినట్లుంది. రాజధాని ప్రాంతంలో ఆయనకు గాని, ఆయన బినామీల పేరిట ఉన్న భూముల వివరాలను తెలుసుకునేందుకు అధికారయంత్రాంగం రంగంలోకి దిగిందంటున్నారు. కొందరు రెవెన్యూ విజిలెన్స్ అధికారులు గత వారం రోజులుగా ఇదే పనిలో ఉన్నట్లు సమాచారం. సీఐడీ, విజెలెన్స్, రెవెన్యూ విభాగాలతో పాటు ఏసీబీ అధికారులు కూడా సుజనా చౌదరికి చెందిన చుట్టుపక్కల గ్రామాల్లో విచారణ జరుపుతున్నారు.

బీజేపీలో చేరిన తర్వాత….

సుజనా చౌదరి కొంత కాలం క్రితం తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన బీజేపీలో చేరిన నాటి నుంచి వైసీపీ ప్రభుత్వంపైన ఒంటికాలి మీద లేస్తున్నారు. అమరావతి రాజధాని విషయంలో సుజనా చౌదరి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పోలవరం నిర్మాణం విషయంలో కూడా జగన్ తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టారు. దీంతోపాటు కేవలం ప్రతీకార చర్యలతోనే వైసీపీ సర్కార్ కాలం వెళ్లదీస్తుందని, పాలనను పక్కన పెట్టేసిందని సుజనా చౌదరి ఘాటు విమర్శలే చేశారు. దీంతో సుజనా చౌదరి తన బినామీల పేరుతో రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని వైసీపీ ఆరోపించింది.

రాజధానిపై విమర్శలు…..

రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, సుజనా చౌదరికి సోదరుడుకు చెందిన కంపెనీ, ఆయన సోదరుడు కుమార్తెకు రాజధాని ప్రాంతంలో 14 ఎకరాల భూమి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అలాగే సుజనా చౌదరికి చెందిన కంపెనీ రాజధాని ప్రాంతంలో 110 ఎకరాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. దీనికి సుజనాచౌదరి కూడా ఘాటుగానే స్పందించారు. తన పేరిట గాని, తన బినామీల పేరిట గాని ఒక్క సెంటు భూమి ఉన్నా తాను ప్రభుత్వానికి రాసిచ్చేస్తానని సవాల్ విసిరారు. బొత్స చెప్పిన భూముల లెక్కలు రాజధాని ప్రాంతంలోనివి కావని, అవి తమ తాతముత్తాతల నాటి ఆస్తులని సుజనా చౌదరి చెప్పారు.

గట్టి కౌంటర్ ఇవ్వడానికే….

అయితే ఈవివాదానికి ఇంతటితో తెరపడలేదు. సుజనా చౌదరి, ఆయన బినామీల భూముల బాగోతాన్ని వెలికితీసేందుకు అధికార యంత్రాంగమే రంగంలోకి దిగడం విశేషం. సుజనా చౌదరి సొంత ప్రాంతంలో విచారణ చేపట్టింది. చెవిటికల్లు, బత్తిన పాడు, మున్నలూరు, మొగులూరు గ్రామాల్లో భూముల వివరాలను సేకరిస్తుంది. అమరావతి రాజధాని ప్రకటనకు ముందు, తర్వాత భూములు కొనుగోలు చేసిన వారి వివరాలను ఆరా తీస్తుంది. గతంలో ఈ భూముల హక్కుదారులు ఎవరు? ఇప్పుడు ఎవరు? అన్నదానిపై వివరాలను సేకరిస్తున్నారు. సుజనాకు గట్టి కౌంటర్ ఇవ్వడానికే ఈ విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News