బూమ్ రాంగ్ అవుతుంది గురూ

ఈ మాటలు ఏ జాతీయ రాజకీయ పార్టీలో పుట్టి పెరిగిన నాయకుడు అంటే కొంత సబబుగా ఉంటుంది. కానీ అన్నది నిన్నటి టీడీపీ నేత, నేటి బీజేపీ [more]

Update: 2019-08-31 03:30 GMT

ఈ మాటలు ఏ జాతీయ రాజకీయ పార్టీలో పుట్టి పెరిగిన నాయకుడు అంటే కొంత సబబుగా ఉంటుంది. కానీ అన్నది నిన్నటి టీడీపీ నేత, నేటి బీజేపీ కొత్త పూజారి అయిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి. అసలు ఆయన ఏ కాంగ్రెస్ పార్టీ నుంచో రాజకీయ జీవితం ఆరంభించలేదు. ఆయన ఫక్తు ప్రాంతీయ పార్టీ టీడీపీ నుంచే తన కెరీర్ మొదలుపెట్టారు. పైగా నిన్నటివరకూ ఆ పార్టీలోనే ఉన్నారు. అటువంటి సుజనా చౌదరి బీజేపీలోకి చేరగానే జాతీయ వాదిగా ఒక్కసారి అయిపోయారు. పైగా తనకు రాజకీయ జన్మని ఇచ్చింది ఓ ప్రాంతీయ పార్టీ అన్న సంగతి కూడా మరచి జై జాతీయ పార్టీ అంటున్నారు. అయితే ఇందులో చిత్తశుద్ధ్ది ఎంత ఉందన్నది కమలనాధులతో సహా అందరికీ సందేహమైనా కూడా సుజనాచౌదరి నోటి వెంట ప్రాంతీయ పార్టీలు ఇక దేశంలో ఉండవు, రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతకంటే ఉండవు అన్న ప్రకటన రావడాన్నే విడ్డూరంగా చూస్తున్నారు.

ఆ రెండింటి గురించేనా..?

నిజానికి ఏపీలో అధికారం ఉన్న వైసీపీ అధినేత జగన్ కానీ తెలంగాణాలో సీఎం గా ఉన్న కేసీఆర్ కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు కానీ రాజకీయ అరంగేట్రం చేసింది కాంగ్రెస్ పార్టీ నుంచే. అంటే జాతీయ పార్టీ నుంచే వారు రాజకీయ జన్మ ఎత్తారు. తరువాత కాలంలో సొంతంగా జగన్, కేసీయార్ పార్టీలు పెట్టుకుంటే చంద్రబాబు రెడీమేడ్ గా ఉన్న టీడీపీని మామ ఎన్టీయార్ దగ్గర నుంచి కొట్టేశారు. సరే వీరంతా ప్రాంతీయ పార్టీల ద్వారా జనాలకు మేలు చేద్దామనే రాజకీయం చేస్తున్నారు. పైగా గత నలభయ్యేళ్ళుగా తెలుగు రాష్ట్రాలు సైతం ప్రాంతీయ రాజకీయానికే అలవాటు పడ్డాయి. ఈ ట్రెండ్ ని మార్చడం అంటే బీజేపీలో తలపండిన వారికే సాధ్యం కాలేదు. ఇపుడు కొత్తగా పార్టీలో చేరిన సుజనాచౌదరి ప్రకటన అతి ఉత్సాహంతో చేసినదిగానే భావించాలి తప్ప మరోటి కాదని అంటున్నారు. ఇక సుజన చౌదరి ద్రుష్టిలో ప్రాంతీయ పార్టీలు అంటే వైసీపీ, టీయారెస్ మాత్రమేనని కూడా కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే ఆయన మనసు టీడీపీదేనని కూడా అంటున్నారు.

అవకాశం లేదుగా…?

ఇక ఏపీలో బీజేపీ ఎదిగితే దానితో పాటు తాను ఎదిగి ముఖ్యమంత్రి కావాలన్నది సుజనా చౌదరి ఆలోచనగా ఉందని అంటున్నారు. ఆయనకు అర్ధబలం, అంగబలం ఉన్నా కూడా ఏపీలో బీజేపీకి బేస్ లేదు, సుజనాచౌదరి లాంటి వారు జనంలో నుంచి వచ్చిన నాయకులు కారు. పైగా ఏపీలో టీడీపీ ఓడిపోయినా బలంగానే ఉంది. వైసీపీకి యువనాయ‌కత్వం ఉంది. ఈ రెండు పార్టీలను తట్టుకుని నిలబడడం అంటే అది బీజేపీకి కష్టమే కాదు, చేదించలేని బిగ్ టాస్క్ అని కూడా రాజకీయ పండితులు అంటున్నారు. ప్రాంతీయ పార్టీలు వద్దు, జాతీయ పార్టీలే ముద్దు అన్న మాట చాలా కాలం నుంచి కాంగ్రెస్ కూడా అంటోంది. చివరికి ఆ పార్టీ ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. జనంలో పెరుగున్న ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపంగా వస్తున్న మార్పులలో భాగంగానే వేళ్ళూనుకుంటోంది ప్రాంతీయ రాజకీయం. సుజనాచౌదరి వంటి వారు ఈ బేసిక్ పాయింట్ అర్ధం చేసుకోకుండా బీజేపీ కండువా కప్పుకున్నాం కదా అని ఏది పడితే అది మాట్లాడితే బూమరాంగ్ అవుతుందని కూడా అంటున్నారు.

Tags:    

Similar News