చౌదరి గారి చేటు మాటలు… అందుకేనటగా ?

బీజేపీకి అసలే పరపతి తక్కువ హడావుడి ఎక్కువ అన్నట్లు ఏపీలో సీన్ ఉంటుంది. దానికి తోడు అన్నట్లుగా ఆ పార్టీలో చేరిన సుజనా చౌదరి వంటి వారు [more]

Update: 2021-02-17 09:30 GMT

బీజేపీకి అసలే పరపతి తక్కువ హడావుడి ఎక్కువ అన్నట్లు ఏపీలో సీన్ ఉంటుంది. దానికి తోడు అన్నట్లుగా ఆ పార్టీలో చేరిన సుజనా చౌదరి వంటి వారు తమదైన వాచాలత్వంతో పూర్తిగా పరువు తీస్తున్నారు అంటున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ఏపీకి ఏ ఒక్క సాయం చేయలేదని బీజేపీ మీద ఇప్పటికే ఏపీ జనాలకు పీక బండెడు కోపం ఉంది. ఇపుడు హఠాత్తుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించడానికి కేంద్రం సిద్ధపడిపోయింది. దాని మీద ఒక్కసారిగా విశాఖ జనం మండిపోతున్నారు. ఇటువంటి కీలకమైన వేళ ఏపీ బీజేపీ నేతలు ఎలా మాట్లాడాలి.

రెచ్చగొట్టేలా….?

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తే ఏం పోయింది అది విశాఖలోనే ఉంటుందిగా ఎవరూ ఎక్కడికీ ఎత్తుకుపోరుగా అంటూ సుజనా చౌదరి చేస్తున్న కామెంట్స్ దారుణంగానే ఉన్నాయి. విశాఖ ఉక్కు అంటే మరీ అంత చులకన చేస్తూ ఆయన మాట్లాడిన తీరుకు విశాఖ వాసులు రగిలిపోతున్నారు. జాతీయ సంపదను ఇలా విదేశీ కంపెనీ అధిపతుల పరం చేసి విశాఖలోనేఉంటుందిగా, అది మీదే అనుకోమని సుజనా చౌదరి సుద్దులు చెప్పడాన్ని జనం ఏ రకంగానూ సహించరు అంటున్నారు. ఇది పుండు మీద కారం చల్లినట్లుగానే ఉందని చెబుతున్నారు.

బీజేపీ మీదనే ….

సుజనా చౌదరి బీజేపీకి చెందిన ఎంపీగా ఉన్నారు. ఆయన ఈ సమయంలో ఏదైనా చెప్పదలిస్తే సహనంతో అర్ధవంతంగా మాట్లాడాలి. అంతే కానీ ప్రైవేట్ రంగంలో స్టీల్ ప్లాంట్ ఉంటే తప్పేంటి అంటూ ఎదురు ప్రశ్నలతో మాట్లాడడం ద్వారా బీజేపీ మీద కూడా జనాలకు ఉన్న కోపాన్ని రెట్టింపు చేసేలా ఉన్నారని కామెంట్స్ పడుతున్నాయి. తాను ఉన్న పార్టీకి చెరుపు చేసేలా సుజనా చౌదరి మాట్లాడడం వెనక రాజకీయ వ్యూహాలు ఏమైనా ఉన్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇన్నాళ్ళూ మౌనంగా ఉండి ఇపుడు సరైన సమయంలో ఆయన బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకోవడం అంటే కచ్చితంగా అది కమలానికి శల్య సారధ్యమేనని అంటున్నారు.

అంతేనా చూశారు …..

విశాఖ స్టీల్ ప్లాంట్ ని జనాలు తమ గుండె కాయగా చూస్తున్నారు. విశాఖకు ఒక గర్వకారణంగా చూస్తున్నారు. ఈ ప్లాంట్ వల్ల ప్రత్యక్షంగా యాభై వేల మంది పరోక్షంగా అయిదు లక్షల మంది జనాభా వరకూ అనేక రకాలుగా లబ్ది పొందుతున్నారు. రేపటి రోజున దీన్ని ప్రైవేట్ పరం చేస్తే వీరంతా ఏమవుతారు అన్న ప్రశ్న కూడా ఉంది. మరో వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ తమ సొత్తు అని జనం భావిస్తారు. అదే ప్రైవేట్ పరం అయితే పరాయిది అయిందని తెగ బాధపడతారు. మరి ఈ మాత్రం సెంటిమెంట్ ని కూడా అర్ధం చేసుకోకుండా సుజనా చౌదరి ప్లాంట్ ప్రైవేట్ పరం అయి తీరుతుంది. ఎవరు అరచి గీ పెట్టినా అది ఆగదంటూ రెచ్చగొట్టుడు కామెంట్స్ చేయడాన్ని విశాఖ వాసులు తప్పుపడుతున్నారు. మొత్తానికి సుజనా చౌదరి తన అనవసర వాచాలత్వంతో బీజేపీ కొంపనే ముంచాడని అంటున్నారు.

Tags:    

Similar News