సుజనాకు సీరియస్ వార్నింగ్ వచ్చినట్లేనా?

“అమరావతిని జగన్ మోహన్ రెడ్డి అంగుళం కూడా కదల్చలేరు. కేంద్రం సరైన సమయంలో సరైన రీతిలో స్పందిస్తుంది. మీకెందుకు నేను ఉన్నా అని” బెజవాడ, గుంటూరు రైతులకు [more]

Update: 2020-08-13 11:00 GMT

“అమరావతిని జగన్ మోహన్ రెడ్డి అంగుళం కూడా కదల్చలేరు. కేంద్రం సరైన సమయంలో సరైన రీతిలో స్పందిస్తుంది. మీకెందుకు నేను ఉన్నా అని” బెజవాడ, గుంటూరు రైతులకు ఇప్పటికే కోట్ల రూపాయలు దీనిపై పెట్టిన రియల్టర్లకు ఒకప్పటి చంద్రబాబు కుడి భుజం ప్రస్తుత బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇచ్చిన అభయం. మూడు రాజధానుల అంశం ప్రస్తావన రాగానే సుజనా చౌదరి ఢిల్లీ లో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా, అమరావతి లో ఉన్నా తక్షణం టిడిపి అనుకూల మీడియా ఛానెల్స్ లో ప్రత్యక్షం అయిపోయేవారు. కొన్ని ఛానెల్స్ కి అయితే ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలను కరోనా సమయం లో కూడా ఇచ్చేసేవారు.

అధిష్టానం వ్యూహం అర్థమైందా … ?

ఇప్పుడు ఎపి రాజకీయాలపై బిజెపి అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టింది. తమ పార్టీ లో టిడిపి వాసనలు పోగొట్టేందుకు పైకి ఒప్పుకోకపోయినా అధ్యక్షుడిని సైతం మార్చేసింది. పనిలో పనిగా మూడు రాజధానుల అంశంపై కమలం ఎపి రాష్ట్ర శాఖ స్పష్టత ఇచ్చినా టిడిపి వాదనను వినిపించే వారిపై వరుసగా వేటు వేస్తూ వస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో తదుపరి వేటు పడాలిసింది సుజనా చౌదరి పైనే. అయితే ఆయన ప్రస్తుతం రాజ్యసభలో సభ్యుడు కావడం అవసరమైన బిల్లులు ఆమోదం పొందాలంటే అక్కడ మెజారిటీ కావాలిసి ఉండటంతో నేరుగా ఆయనపై బాణాలు సంధించకుండా సుజనా చౌదరికి అర్ధం అయ్యేలా వ్యవహారం నరుక్కొస్తుంది బిజెపి.

ఏడాదిన్నర తరువాత …

మరో ఏడాదిన్నర తరువాత సుజనా చౌదరి పదవీకాలం పూర్తి కానుంది. అప్పుడు ఆయన ఇదే పార్టీలో కొనసాగుతారా లేదా అన్నది స్పష్టం కానుంది. మరోపక్క ఇటీవల తన పదవిలోకి వచ్చిన సోము వీర్రాజు కూడా ఏడాదిన్నర తరువాత బిజెపి అంటే ఏమిటో ఏపీ లో తడాఖా చూపిస్తుందంటున్నారు. ఆయన హెచ్చరికల నేపధ్యమా లేక సమయం అనుకూలంగా లేదని భావించో మొత్తానికి సుజనా చౌదరి తాజాగా మీడియా ముందుకు రావడం మానేశారు. ఆయన బాధ్యతను ప్రస్తుతం వైసిపి రెబెల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు స్వీకరించి టిడిపి మీడియా లో కథ నడిపిస్తున్నారు. అయితే గతంలో సుజనా చౌదరి రాజధానుల అంశంలో వాడిగా వేడిగా చేసే వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు తెరపై లేకుండా పోవడంతో పసుపు మీడియా లో అమరావతి చర్చలు మాత్రం చప్పగా సాగుతున్నాయి.

Tags:    

Similar News