ఇక వెంకయ్య పాత్రలో ఆయనే

ఇపుడు రాజ్యాంగ పదవిలో కుదురుకున్నారు కానీ ఏపీ బీజేపీ అంటే ముప్పవరపు వెంకయ్యనాయుడు అందరికీ గుర్తుకువచ్చేవారు. దేశంలో బీజేపీ పెద్దలు ఎక్కడ వేలు పెట్టినా తెలుగు రాష్ట్రాలకు [more]

Update: 2019-10-18 05:00 GMT

ఇపుడు రాజ్యాంగ పదవిలో కుదురుకున్నారు కానీ ఏపీ బీజేపీ అంటే ముప్పవరపు వెంకయ్యనాయుడు అందరికీ గుర్తుకువచ్చేవారు. దేశంలో బీజేపీ పెద్దలు ఎక్కడ వేలు పెట్టినా తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి మాత్రం వెంకయ్యనాయుడు నిర్ణయానికే వదిలేసేవారు. అలాంటి పట్టు పార్టీలో ఆయనకు ఉండేది. ఇక వెంకయ్య శకం ముగింది. ఆ లోటు ఎలా భర్తీ చేసుకోవాలా అని మధన పడుతున్న టీడీపీ రాజకీయ చాణక్యుడు చంద్రబాబు వేసిన సరికొత్త ఎత్తుగడలో భాగమే ఆయన అనుంగు శిష్యుడు సుజనా చౌదరి బీజేపీ ప్రవేశం అని అంటారు. అది చాలా సందర్భాల్లో రుజువు అవుతూ వచ్చింది. అప్పట్లో తలసాని శ్రీనివాస యాదవ్ ని కేసీయార్ తన పార్టీలోకి తీసుకుంటే చండ్ర నిప్పులు కురిపించిన ఇదే చంద్రబాబు ఏకంగా తనతో పాటు మరో ముగ్గురు రాజ్యసభ ఎంపీలను కమలం గూటికి సుజనా చౌదరి చేర్చినా కిక్కురుమనకపోవడం బట్టే ఏదో తెర వెనక జరిగిందన్న ప్రచారమూ ఉంది.

దోస్తీ కలుపుతారా…?

చంద్రబాబు ఇపుడు మోడీ అన్నా, బీజేపీ అన్నా తెగ ఉబలాటపడుతున్నారు. కమలం కొంగు పట్టుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఇదంతా ఆయన బయటకు చెప్పేసుకుంటున్నారు. తన రాజకీయ గురువు ఇలా మధనపడుతూంటే బీజేపీ కొత్త పూజారి సుజనా చౌదరి మనసు ఒప్పుతుందా. అందుకే ఆయన మీడియా ముఖంగానే భారీ ప్రకటన చేసేశారు. బీజేపీ, టీడీపీ బంధం మళ్ళీ కలవాలనుకుంటే తాను అందుకు రాయబారిని అవుతానని కూడా గట్టిగా చెప్పారు. చంద్రబాబు బీజేపీలో చేరుతాను అంటే తాను సహకరిస్తానని సుజనా చౌదరి చెప్పడం అంటే కధ అనుకున్నట్లుగానే సాగుతుందనుకోవాలేమో. అయితే బీజేపీలో సుజన పాత్ర ఎంత, ఏమిటీ అన్నది కూడా ఇక్కడ ముఖ్యమని అంటున్నారు. పైగా సుజనా చౌదరి బాబు గారి మీద ఉన్న భక్తిని ఎక్కడా దాచుకోవడంలేదు. ఇది అసలు బీజేపీ నేతలకు కూడా ఒళ్ళు మండించే పరిణామమే. ఇక పొత్తులను కుదిర్చే స్థాయిలో సుజనా చౌదరి లేకపోయినా బీజేపీ కోపం మంటలు బాబు మీద పడకుండా కాపాడేంత సామర్ధ్యం మాత్రం ఉందని అంతా ఒప్పుకుంటున్నారు.

ఇంతకీ నమ్ముతున్నారా…?

కేంద్రంలో బీజేపీ ఏర్పడిన మరుసటి రోజునే ఆ పార్టీలో చేరిన సుజనా చౌదరిని బీజేపీ నమ్ముతోందా అన్న ప్రశ్నలు కూడా ఇపుడు ఉదయిస్తున్నాయి. అయితే ఏపీ బీజేపీలో జరిగిన కొన్ని పరిణామాలు చూసుకుంటే ఏపీ వరకూ సుజనా చౌదరికి ప్రాధాన్యత దక్కుతోంది అని చెప్పాలి. ఇంతకు ముందు జీవీఎల్ నరసింహారావు, రాం మాధవ్ వంటి నాయకులు ఏపీకి వచ్చి మాట్లాడేవారు, ఇపుడు వారి జోరు తగ్గింది. సుజనా చౌదరి ఆ పాత్రను పోషిస్తున్నారు. ఈ మధ్యనే కేంద్ర మంత్రి షెకావత్ ని కలసిన ఏపీ బృందంలో సుజనా చౌదరి కూడా అతి ముఖ్యుడిగా ఉన్నారు. ఓ విధంగా సుజనా చౌదరి ఏపీ వరకూ కుదురుకుంటే చాలు అన్న మాట కూడా టీడీపీలో ఉందిట. డిసెంబర్లో జరిగే ఏపీ బీజేపీ ఎన్నికల తరువాత ప్రెసిడెంట్ కిరీటం కనుక సుజనా చౌదరికి దక్కితే ఇక టీడీపీ, బీజేపీ పొత్తుకు ఆయన రాయబారి కావడం తధ్యం. చూడాలి మరి సుజనా చౌదరి చంద్రబాబు భక్తి ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో.

Tags:    

Similar News