సుజనాకు చెంప పెట్టు లాంటిదే కదా?

బిజెపి లో ఉంటూ టిడిపి అజండా పట్టుకు తిరిగే వారికి ఇక రోజులు చెల్లినట్లే తాజా పరిణామాలు స్పష్టంగా కుండబద్దలు కొట్టేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ బిజెపి దళపతిగా సోము [more]

Update: 2020-07-31 05:00 GMT

బిజెపి లో ఉంటూ టిడిపి అజండా పట్టుకు తిరిగే వారికి ఇక రోజులు చెల్లినట్లే తాజా పరిణామాలు స్పష్టంగా కుండబద్దలు కొట్టేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ బిజెపి దళపతిగా సోము వీర్రాజు ఇలా బాధ్యతలు చేపట్టారో లేదో హస్తిన పెద్దలను కలిసేందుకు వెళ్లారు. అక్కడ మీడియా సమావేశం కూడా పెట్టేశారు. అమరావతి అంశంలో మొదటి నుంచి బిజెపి ఎపి పార్టీ ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్, ఎంపి జివిఎల్ నరసింహారావు, సోము వీర్రాజు ఈ ముగ్గురు మొదటి నుంచి ఒకే విధమైన బాణీతో మాట్లాడేవారు. కేంద్రానికి రాజధాని అంశం సంబంధం లేదన్నది వీరి వాదన. రాష్ట్ర పార్టీ గా అమరావతి లో రాజధాని ఉండాలని కోరుకుంటున్నామని రైతులకు న్యాయం జరగాలన్నదే తమ విధానం పోరాటమని కేంద్రం ఇందులో జోక్యం చేసుకోదని మరోసారి బిజెపి ఎపి అధ్యక్షుడు సోము విస్పష్టంగా చెప్పేశారు.

ఇరుకున పడ్డ సుజనా …

సోము ప్రకటనకు ముందు బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి రాజధాని అంశంలో కేంద్రం సరైన సమయం లో సరైన విధంగా స్పందిస్తుందని అంగుళం కూడా రాజధాని కదలదని ప్రకటించారు. ఆయన ఇలా చెప్పారో లేదో హస్తినలో పార్టీ త్రిమూర్తులు సుజనా చేసిన ప్రకటనకు భిన్నంగా స్పందించి టిడిపి సుజనా తో ఆడుతున్న మైండ్ గేమ్ కి చెక్ పెట్టేశారు. అక్కడితో ఆగలేదు. ఆంధ్రప్రదేశ్ బిజెపి అధికారిక ట్విట్టర్ లో సుజనా చౌదరి అమరావతిపై చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని పార్టీకి సంబంధం లేదని పేర్కొంది. ఎపి రాజధానిపై సోము వీర్రాజు పార్టీ వైఖరిని స్పష్టం చేశారని అదే ఫైనల్ అనేశారు. ఇది సుజనాకు చెంప పెట్టులాంటిదే.

ఎంత చెప్పినా విన్నదే లేదు …

సునీల్ దేవధర్ గతంలో కూడా పార్టీ వైఖరిపై ఇలాగే స్పందించారు. అయితే కన్నా లక్ష్మీనారాయణ మాత్రం సుజనా చౌదరి వాదనని వినిపించడంతో ఆ పార్టీలో అగ్గి రాజుకుంది. దీనిపై మరో రాజ్యసభ సభ్యుడు జివిఎల్ పదేపదే కేంద్రానికి ఈ అంశంపై సంబంధం లేదని చెప్పినా అయోమయం కొనసాగింది. మొత్తానికి ఈ వ్యవహారం మాత్రం పాత, కొత్త బిజెపి నేతల ఎజెండా లు వేరు వేరు అన్నది ప్రజలకు స్పష్టం చేయడంతో బాటు కమలం శ్రేణులను గందరగోళానికి గురిచేసింది.

కోవర్ట్ ల ఏరివేతే సోము టార్గెట్ … ?

ఎపి లో టిడిపి నీరస పడ్డాక దూసుకుపోతుంది అనుకున్న పార్టీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండటానికి కారణాలను కమలం అధిష్టానం ఆరా తీసింది. గ్రౌండ్ రిపోర్ట్ పూర్తిగా వచ్చాక చడీ చప్పుడు లేకుండా హార్డ్ హిట్టర్ సోము వీర్రాజు కు పగ్గాలు అప్పగించి కోవర్ట్ ల సంగతి చూడాలని దిశా నిర్ధేశం చేసినట్లు తెలుస్తుంది. దాంతో ఆయన బాధ్యతలు చేపట్టి రంగంలోకి దిగి దిగడంతోనే తన రాక దేనికో సూటీగా చెప్పేశారు. దాంతో ఇప్పుడు బిజెపి తొలి టార్గెట్ టిడిపి నే అన్నది తేలిపోయింది. దాని పని పూర్తి అయ్యాక వైసిపి పై పడాలన్నదే కాషాయ దళం హస్తిన వ్యూహం గా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News