ఈయన వెనక ఉన్నది ఆయనేనటగా?

కడప జిల్లా ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా. అక్కడ చీమ చిటుక్కుమన్నా జగన్ కు తెలియకుండా పోదు. అయితే జమ్మలమడుగులో ఏంజరుగుతుందో నిజంగా జగన్ కు తెలియదా? [more]

Update: 2020-11-10 15:30 GMT

కడప జిల్లా ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా. అక్కడ చీమ చిటుక్కుమన్నా జగన్ కు తెలియకుండా పోదు. అయితే జమ్మలమడుగులో ఏంజరుగుతుందో నిజంగా జగన్ కు తెలియదా? లేక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని వెనకుండి సీనియర్ నేత నడిపిస్తున్నారా? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది. జమ్మలమడుగు వైసీపీలో విభేదాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డికి మధ్య పొసగడం లేదు.

టీడీపీ నుంచి వచ్చి….

జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీకి దశాబ్దాల నుంచి నేతగా ఉన్న రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిపోయారు. దీంతో జమ్మలమడుగులో టీడీపీని జగన్ ఒకరకంగా లేకుండా చేయగలిగారు. మరో నేత ఆదినారాయణరెడ్డి కూడా బీజేపీలో చేరడంతో అక్కడ టీడీపీ క్యాడర్ కు దిక్కుమొక్కు లేకుండా పోయారు. ఈనేపథ్యంలో రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరినా ఆయనకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సహకరించడం లేదు.

ఎన్నిసార్లు చెప్పుకున్నా….

దీంతో రామసుబ్బారెడ్డి ఇప్పటికే పలు దఫాలు ఈవిషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. కడప జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ను కలసి స్వయంగా వివరించారు. అయినా ఫలితం లేదు. రోజురోజుకూ సుధీర్ రెడ్డి రామసుబ్బారెడ్డిని పట్టించుకోక పోగా, పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదు. కనీసం తనకు గాని, తన వెంట తిరిగే వారికి కాని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గుర్తించడం లేదన్నది రామసుబ్బారెడ్డి ఆవేదన.

సీనియర్ నేత సూచనలతోనే…..

అయితే దీని వెనక వైసీపీ సీనియర్ నేత ఒకరున్నారని సమాచారం. అంతా ఆయన చెప్పినట్లే సుధీర్ రెడ్డి నడుచుకుంటున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడం ఇష్టం లేని సదరు సీినియర్ నేత సుధీర్ రెడ్డికి రాజకీయ సలహాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. సుధీర్ రెడ్డికి బంధువు కావడంతో ఆయన వైసీపీ లో లేకపోయినా జమ్మలమడుగు రాజకీయాలపై దృష్టిపెట్టినట్లు చెబుతున్నారు. మొత్తం మీద జగన్ తో విభేదించి వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోయిన ఒక సీనియర్ నేత సుధీర్ రెడ్డికి డైరెక్షన్ ఇస్తున్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

Tags:    

Similar News