అదే జరిగితే… సీన్ రివర్సేనా…?

భారతీయ జనతా పార్టీ. పేరు ఎంతో సంప్రదాయబద్ధంగా ఉంటుంది. మొన్నటివరకూ రాజకీయం కూడా చాలా సాఫ్ట్ గానే సాగింది. కానీ మోడీ అమిత్ షా జమానాలో మాత్రం [more]

Update: 2020-10-22 12:30 GMT

భారతీయ జనతా పార్టీ. పేరు ఎంతో సంప్రదాయబద్ధంగా ఉంటుంది. మొన్నటివరకూ రాజకీయం కూడా చాలా సాఫ్ట్ గానే సాగింది. కానీ మోడీ అమిత్ షా జమానాలో మాత్రం చాణక్యుడు అక్కడే మళ్ళీ పుట్టాడంటున్నారు. బీజేపీ నేతల ఎత్తులు జిత్తులతో పాత పార్టీ కనుమరుగు అయిందని కూడా విమర్శలు ఉన్నాయి. ఏది చేసినా కూడా రాజకీయ లాభమే పరమార్ధం అవుతోంది. ఎన్ని లెక్కలు వేసినా అవి అధికార పీఠానికి నిచ్చెన మెట్లుగా మారాల్సిందే. ఈ రకమైన వ్యూహాలతోనే తనతో చిరకాలంగా ఉన్న మిత్రులు శివసేనను, అకాళీదళ్ పార్టీని బీజేపీ దూరం చేసుకుంది.

పెరగనున్న బలం…..

ఇవన్నీ ఇలా ఉంటే బీజేపీ అవసరార్ధం కొత్త స్నేహాలను కూడా పెంచుకుంటోంది. ఏపీలో ఆ పార్టీకి ఇపుడు వైసీపీ దగ్గర చుట్టం. జగన్ అంటే కాస్త ఎక్కువ మర్యాదలే బీజేపీలో చేస్తున్నారు. దానికి కారణం రాజ్య్జసభలో ఆయన పార్టీకి ఉన్న ఆరుగురు సభ్యుల బలం. లోక్ సభలో బీజేపీకి బండ మెజారిటీ ఉంది. కానీ పెద్దల సభకు వచ్చేసరికి మాత్రం సీన్ రివర్స్. అక్కడ ఎన్డీయే కూటమికి మెజారిటీ లేదు. దాంతో వైసీపీని బాగా దువ్వుతోంది. గడచిన ఏడాదిన్నర కాలంగా ప్రతీ ఒక్క బిల్లుకూ కనీసం అభ్యంతరం కూడా పెట్టకుండా వైసీపీ ఎంపీలు మద్దతు ఇచ్చారు. అయితే ఇపుడు హఠాత్తుగా కొత్త పరిణామం చోటు చేసుకోనుంది. అదేంటి అంటే పెద్దల సభలో బీజేపీ బలం పెరగనుంది.

ఆ సీట్లన్నీ అటే …..

రాజ్యసభ ఎన్నికల కోసం తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో కొత్తగా అవుతున్న ఖాళీలన్నీ కాంగ్రెస్ వి అయితే అవి భర్తీ అయ్యేది మాత్రం బీజేపీ ఎంపీలతోనే. ఉత్తరప్రదేశ్ లో పది, ఉత్తరాంచల్ లో ఒక సీటు కలుపుకుని మొత్తం 11 ఎంపీ సీట్లకు జరిగే ఎన్నికల్లో గంపగుత్తగా అన్నీ బీజేపీ ఖాతాలో పడనున్నాయట. అంటే ఒక్కసారిగా పదకొండు మంది కొత్త ఎంపీలు బీజపీకి పెద్దల సభలో వస్తారన్న మాట. ఈ దెబ్బకు బీజేపీ బలం కూడా అమాంతం అక్కడ పెరగనుంది అంటున్నారు. మరి అదే కనుక జరిగితే మెజారిటీకి కేవలం మూడు సీట్ల దూరంగానే ఎన్డీయే ఉంటుందని టాక్.

లెక్క చేస్తారా…?

ఈ పరిణామం కమలదళంలో సంతోషాన్ని నింపుతూంటే వైసీపీలో కొత్త చర్చకు దారి తీస్తోందట. ఇంతకాలం అమరావతి రాజధాని విషయంలో సహా అనేకమైన జగన్ నిర్ణయాలకు కేంద్రం తలూపింది. ఏపీలో బీజేపీ నేతలు ఎలా ఉన్నా ఢిల్లీ పెద్దలు మాత్రం జగన్ వైపే అన్నట్లుగా ఉంటూ వచ్చారు. కానీ ఇపుడు రాజ్యసభలో పెద్దగా వైసీపీ అవసరం పడకపోవచ్చునని తెలుస్తున్న నేపధ్యంలో మునుపటి సంబంధాలను బీజేపీ వైసీపీతో కంటిన్యూ చేస్తుందా అన్నది పెద్ద ప్రశ్న. అసలే మోడీ, షాల నాయకత్వంలోని బీజేపీ అది. కరివేపాకు కంటే హీనంగా పార్టీలను వాడుకుని వదిలేస్తారని కూడా అంటున్న సీన్ ఉంది. దాంతో ఇపుడు వైసీపీలో కొత్త కలవరం మొదలైందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News