ఏపీకి అసలైన శత్రువులు…ఎవరు ?

అదేం జాతకమో కానీ ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భావం నుంచి అష్టకష్టాలే పడుతోంది. 1915లోనే ఆంధ్రా ఉమ్మడి మద్రాస్ నుంచి వేరు పడాలనుకున్నా అది సాకారం అయ్యేసరికి నాలుగు [more]

Update: 2021-01-27 00:30 GMT

అదేం జాతకమో కానీ ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భావం నుంచి అష్టకష్టాలే పడుతోంది. 1915లోనే ఆంధ్రా ఉమ్మడి మద్రాస్ నుంచి వేరు పడాలనుకున్నా అది సాకారం అయ్యేసరికి నాలుగు దశాబ్దాలు పట్టింది. అంటే ఆంధ్రులంటే ఆనాటికీ జాతీయ స్థాయి నేతలకు ఎంతటి చులకనభావం ఉందో అర్ధమవుతుంది. ఆ తరువాత అయినా కలసి ఉండాలనుకున్నారా అంటే లేనే లేదు. కాళ్ల పారాణి ఆరకముందే గిల్లి కజ్జాలు రాజధాని పేరిట పెట్టుకున్నారు. అటు రాయల‌ నేతలు, ఇటు కోస్తా నాయకులు కయ్యానికి దిగి మొత్తానికి కర్నూలు రాజధాని అనుకున్నా కూడా దాన్ని కూడా విచ్చిన్నం చేయడానికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్న రాజకీయం నడిపారు అన్నది కూడా బహిరంగ రహస్యమే.

నవ్యాంధ్రాలోనూ…?

ఇక ఉమ్మడి ఏపీలోనూ నిందలు నిష్టూరాలతోనే ఆరు దశాబ్దాల కాపురం సాగింది. ఆ సమయంలో పెద్దగా ఆంధ్ర రాష్ట్రానికి చేసుకున్నది కూడా లేదు. కనీసం పోలవరం వంటి బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ కలసి ఉన్నపుడే కట్టుకుంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కావు, రాయలసీమ కరవుకు శాశ్వత దారిని చూపించలేకపోయారు. పారిశ్రామికీకరణ అన్న మాట కూడా లేదు. ఏడేళ్ల క్రితం రెండుగా రాష్ట్రం విడిపోయింది. ఇకనైనా నవ్యాంధ్రాలో అయినా అంతా కలసి ముందుకు అడుగులు వేస్తున్నారా అంటే ఎంతసేపూ పదవీ రాజకీయాలే తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఎవరికీ పట్టకుండా పోతోంది.

ఆ ఊసే లేదుగా…?

ఇక విభజన వేళ ప్రత్యేక హోదా అన్నారు. రెవిన్యూ లోటు భర్తీ అన్నారు. ఆస్తుల పంపకం అని చెప్పారు, నిధుల సాయం, రమ్యమైన రాజధాని అని కూడా ఆశలు పెట్టారు. మొదటి అయిదేళ్ల పాలనలో టీడీపీ వైసీపీ రాజకీయాల మూలంగానే కేంద్రంలోని బీజేపీ ప్రత్యేక హోదా తొక్కేసింది అన్నది సగటు రాష్ట్ర పౌరునికి తెలుసు. పిట్ట పోరు పిల్లి తీర్చిదన్నట్లుగా సామరస్యం లేని నాయకుల మధ్యన ఏపీ ప్రయోజనాలు పూర్తిగా శూన్యం కాగా బీజేపీ తాపీగా హామీల బెడద నుంచి తప్పించుకుంది. ఇక ఇపుడు ఆ ఊసే లేకుండా ఉంది. కనీసం ప్రత్యేక హోదా అన్న మాట కూడా అంటే తప్పు అన్నట్లుగా రాజకీయాన్ని మార్చిన ఘనత బీజేపీకే దక్కింది.

ప్రమాదకర క్రీడలోకి…

ఇక అప్పులతో తప్పులతో ఏడేళ్ళుగా ఏపీ తప్పటడుగులు వేస్తూంటే అది కూడా చాలదు అన్నట్లుగా మత రాజకీయాలను తెచ్చి మరీ నెత్తిన రుద్దుతున్నారు. ఏకంగా నిప్పుతోనే చెలగాటం ఆడుతున్నారు. మతాల చిచ్చుని పెట్టి మరీ మారణహోమం సృష్టించాలనుకుంటున్నారు. అసలే ఏ నికరమైన ఆదాయ వనరూ లేని రాష్ట్రం, సరైన రాజధాని కూడా లేని చోట ఇబ్బందులో ఉన్న వేళ ఇలా మతాల పేరిట అలజడులు రేపి ఏపీని భయంకరమైన పరిస్థితులకు రాజకీయ నేతాశ్రీలు తీసుకువస్తున్నారు.. ఇందులో ఒక్కరిది తప్పు కాదు, అందరిదీ ఉందని అనుకోవాలి. లేకపోతే విడిపోయిన రాష్ట్రాన్ని కలసి నిర్మించుకోవాలన్న కనీస స్పృహ కూడా లేకుండా తగుదునమ్మా ఆంటూ మతాల మధ్యన మంటలు పెడితే ఏపీ ఎప్పటికైనా బాగుపడుతుందా. ఆ ఇంగితం లేకుండా చేస్తున్న విష రాజకీయాలకు చిక్కి ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి నెట్టబడుతోందా అని మేధావులు ఆందోళన చెందుతున్నారు అంటే అర్ధముందిగా.

Tags:    

Similar News