స్టాలిన్ సత్తా తేలిపోనుందా…??

ఒకవైపు సర్వేలు అనుకూలంగా వస్తుండటం, మరోవైపు అన్నాడీఎంకే నాయకత్వ లోపాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు డీఎంకే అధినేత స్టాలిన్. స్టాలిన్ కు వచ్చే ఎన్నికలు అగ్నిపరీక్ష లాంటివి. [more]

Update: 2019-02-02 18:29 GMT

ఒకవైపు సర్వేలు అనుకూలంగా వస్తుండటం, మరోవైపు అన్నాడీఎంకే నాయకత్వ లోపాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు డీఎంకే అధినేత స్టాలిన్. స్టాలిన్ కు వచ్చే ఎన్నికలు అగ్నిపరీక్ష లాంటివి. కరుణానిధి మరణించిన తర్వాత జరిగే తొలి ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికల్లో తన శక్తి చూపించకుంటే పార్టీ తన చేయి దాటి పోతుందని తెలుసు. అందుకే లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే డీఎంకే,కాంగ్రెస్ తో కలసి చిన్నా చితకా పార్టీలో కూటమిని ఏర్పాటుకు ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించారు. 39 స్థానాలున్న తమిళనాడులో ఇరవై నుంచి ఇరవై అయిదు స్థానాల్లో డీఎంకే పోటీ చేయాలని భావిస్తోంది.

బీజేపీతో ముడిపెట్టి…..

దీంతో పాటుగా నరేంద్రమోదీకి అన్నాడీఎంకే దగ్గరవుతుందన్న ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు స్టాలిన్. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు మోదీ జట్టు అని తేల్చేస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు డీఎంకేకు దక్కలేదు. ఈసారి సీన్ రివర్స్ చేయాలని చూస్తున్నారు. ఇక్కడ అత్యధిక స్థానాలను సాధిస్తే కేంద్రంలో చక్రం తిప్పవచ్చన్నది స్టాలిన్ వ్యూహంలా కన్పిస్తుంది. అనుకున్నట్లు యూపీఏ ప్రభుత్వం ఏర్పడితే ఇక్కడ అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూడా గద్దె దించడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే ఈ లెక్కలన్నీ వేసి స్టాలిన్ కరుణానిధి విగ్రహాలను ఆవిష్కరిస్తూ క్యాడర్ లో జోష్ పెంచుతున్నారు.

సెంటిమెంట్ తోనూ….

అంతేకాదు సెంటిమెంట్ ను కూడా రాజేస్తున్నారు. తమిళనాడులో ఇప్పటివరకూ జయలలిత మరణం మిస్టరీగానే మారింది. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం జయలలిత మృతిపై కమిషన్ ను ఏర్పాటు చేసింది. జయలలిత 75 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం వెనక మిస్టరీ ఉందన్నది ఇప్పటికీ తమిళనాడు వాసులు అనుమానం. ముఖ్యంగా జయ అభిమానుల్లోనూ ఈ అనుమానం పాతుకుపోయింది. అయితే పళనిస్వామి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం కమిషన్ వేసి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

మైండ్ గేమ్ మొదలుపెట్టి…..

ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ఓటు బ్యాంకును ఆకట్టుకునేందుకు స్టాలిన్ జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ జరిపి జయ మృతికి బాధ్యులైన వారిని జైలుకు పంపిస్తామని కూడా స్టాలిన్ గట్టిగానే హెచ్చరికలు పంపారు. నిజానికి కరుణానిధికి, జయలలితకు వ్యక్తిగతంగా కూడా విభేదాలున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే విధానాల్లోనూ తేడా ఉంది. ఈ నేపథ్యంలో స్టాలిన్ జయలలిత మృతిపై విచారణ జరుపుతామని చెప్పడం జయ అభిమానులతో పాటు అన్నాడీఎంకే క్యాడర్ ను కూడా ఆకట్టుకునేందుకేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద స్టాలిన్ ఇటు కూటమి ఏర్పాట్లు చేసుకుంటూనే, మరోవైపు ప్రత్యర్థి పార్టీపై మైండ్ గేమ్ మొదలుపెట్టారన్నమాట.

Tags:    

Similar News