స్టాలిన్ రూటు మారుస్తున్నారా…?

డీఎంకే అధినేత స్టాలిన్ పక్కా కాంగ్రెస్ కు అనుకూలుడు. బీజేపీతో వైరం.. కాంగ్రెస్ తో మైత్రి అనేది ఇంతకాలం డీఎంకే నినాదం. ఇటీవల జరిగిన లోక్ సభ [more]

Update: 2019-07-01 18:29 GMT

డీఎంకే అధినేత స్టాలిన్ పక్కా కాంగ్రెస్ కు అనుకూలుడు. బీజేపీతో వైరం.. కాంగ్రెస్ తో మైత్రి అనేది ఇంతకాలం డీఎంకే నినాదం. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సయితం డీఎంకే కాంగ్రెస్ తో పాటు ఇతర చిన్నా చితకా పార్టీలతో పొత్తుపెట్టుకుంది. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అంటూ స్టాలిన్ కూడా ఎన్నికలకు ముందే ప్రకటించి సంచలనం సృష్టించారు. అనుకున్నట్లుగానే తమిళనాడులో డీఎంకే కూటమి లోక్ సభ ఎన్నికల్లో విజయపథాన పయనించింది.

ఆలోచనలో పడేశాయా..?

కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు స్టాలిన్ ను ఆలోచనలో పడేశాయంటున్నారు. కాంగ్రెస్ తో దూరం జరగాలని స్టాలిన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే తమిళనాడులో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం కూడా స్టాలిన్ కాంగ్రెస్ తో దూరం జరగడానికి ఒక కారణంగా చెబుతున్నారు. రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను వెనక్కు తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపికలో కాంగ్రెస్ అగ్రనేతలు తలమునకలై ఉన్నారు.

విగ్రహావిష్కరణకు….

కాంగ్రెస్ కు ఇక భవిష్యత్ లేదని భావించిన స్టాలిన్ తమిళనాడులో కాంగ్రెస్ ను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ రకమైన సంకేతాలు డీఎంకే పార్టీ నుంచి వెలువడుతున్నాయి.త్వరలో జరగనున్న కరుణానిధి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా స్టాలిన్ కాంగ్రెస్ నేతలను దూరంగా ఉంచడం చర్చనీయాంశమైంది. కనీసం ఢిల్లీ పెద్దలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడపై డీఎంకేతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో…..

తమిళనాడులో తన వల్లనే కాంగ్రెస్ బతికి బట్టకడుతుందని స్టాలిన్ నమ్ముతున్నారు. త్వరలో జరిగే రెండు అసెంబ్లీ ఉప ఎన్నికలతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ డీఎంకే ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆగస్టు 7వతేదీన జరిగే కరుణానిధి విగ్రహావిష్కరణకు పశ్చిమబెంగాల్, కేరళ ముఖ్యమంత్రులు మమత బెనర్జీ, పినరయి విజయన్ లను మాత్రమే ఇప్పటి వరకూ స్టాలిన్ ఆహ్వానించారు. రాహుల్, సోనియాలను ఇప్పటి వరకూ ఆహ్వానించలేదు. దీంతో స్టాలిన్ జాతీయ రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తూ కాంగ్రెస్ కు దూరం జరగాలని నిర్ణయించుకన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా సమయం ఉంది కాబట్టి ఢిల్లీ పెద్దలను పిలిచే అవకాశాలు లేకపోలేదని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News