ఎంత ఎదిగిపోయావయ్యా…?

జాతికి సేవలందించిన వారు ప్రత్యర్థి పార్టీలకు చెందినా అవమానించకూడదు. వారు ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయాలుగా నిలవాలి. గుండెల్లో పెట్టుకోవాలి. అప్పుడే నాయకత్వం పరిమళిస్తుంది. అదే ఆదర్శాన్ని [more]

Update: 2021-05-06 16:30 GMT

జాతికి సేవలందించిన వారు ప్రత్యర్థి పార్టీలకు చెందినా అవమానించకూడదు. వారు ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయాలుగా నిలవాలి. గుండెల్లో పెట్టుకోవాలి. అప్పుడే నాయకత్వం పరిమళిస్తుంది. అదే ఆదర్శాన్ని ఆచరించి చూపించారు తమిళ జనహృదయ విజేత, డీఎంకే అధినేత స్టాలిన్. మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో కక్షలు , కార్పణ్యాలతో అధికార, ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. యుక్తాయుక్త విచక్షణ లేకుండా తలపడుతున్నారు. రాజకీయ , స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలనూ పణంగా పెడుతున్నారు. ఇంకోవైపు ఎన్నిక ముగిసిన పశ్చిమబెంగాల్ కక్షలతో, ప్రతీకార దాడులతో రగులుతోంది. దేశంలో చాలా రాష్ట్రాలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఇదే వాతావరణం. ఇటువంటి నేపథ్యంలో తొలిసారి గద్దెనెక్కుతున్న స్టాలిన్ రాజనీతిజ్ణుడిగా తనను తాను నిరూపించుకున్నారు. ప్రత్యర్థిపార్టీ ఏఐఏడీఎంకే అగ్రనాయకురాలైన స్వర్గీయ జయలలిత చిత్రపటంతోపాటు, ఆమె నెలకొల్పిన అమ్మక్యాంటీన్లపై విద్వంసానికి పాల్పడిన డీఎంకే కార్యకర్తలను పార్టీ నుంచి తొలగించారు. సొంతపార్టీ కార్యకర్తలపైనే కేసులు నమోదు చేయించారు. కొన్నేళ్ల క్రీతం తమిళనాడులో అసలు ఇటువంటి పరిణామం ఊహించలేం. నాయకత్వమే పరస్పర దాడులకు ప్రోత్సహించేది. ఎంతటి ఘోరానికి పాల్పడినా తమ వారికి అండగా నిలిచేది. అటువంటి చోట ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది.

గతం గత:….

తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే పరస్పర కత్తులు దూసుకుంటూ దాదాపు మూడు దశాబ్దాలు రాజకీయం నడిపాయి. కరుణానిధి, జయలలిత ఆయా పార్టీల సారథులుగా రాష్ట్ర ప్రజలనే రెండు వర్గాలుగా చీల్చి విభజించి పాలించారని చెప్పవచ్చు. మానవసంబంధాలను సైతం దెబ్బతీసే విధంగా రెండుపార్టీలకు చెందిన వారి మధ్య వివాహసంబంధాలు, వేడుకలు సైతం నిషిధ్ధంగా మారాయి. ప్ర్తత్యర్థి పార్టీలకు చెందిన నేతల శుభకార్యాలకు అగ్రనేతలే కాదు, స్తానిక నాయకులు కూడా హాజరయ్యేవారు కాదు. అంతటి విద్వేషం రెండు పార్టీల మధ్య కొనసాగుతుండేది. దానికి ముగింపు పలకాలనే 2016లోనే తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణస్వీకార కార్యక్రమానికి స్టాలిన్ హాజరయ్యారు. దానిని డీఎంకే, ఏఐడీఎంకే వర్గాలు పెద్ద వింతగా చెప్పుకున్నాయి. కొత్త తరానికి ప్రాతినిధ్యం వహించే తాము మార్పునకు శ్రీకారం చుడుతున్నామనే సంకేతాలు స్టాలిన్ ఆరోజే అందించారు. ప్రతిపక్షంలో ఉండి మంచి సంబంధాల కోసం ఏదో చేశారనుకోలేం. తాజాగా ఘన విజయం సాధించిన తర్వాత కూడా తమ కార్యకర్తల అత్యుత్సాహానికి కళ్లెం వేశారు. తమిళనాడుకు సేవలందించిన నేతలను అవమానించడం సహించేది లేదని తన చర్యల ద్వారా స్పష్టం చేశారు. ఇది మిగిలిన రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సిన గుణపాఠం. తమిళనాడుకు మంచి పరిణామం.

కొత్త బాటలో…

ఏఐఏడీఎంకే పై పెద్దగా వ్యతిరేకత లేకపోయినా డీఎంకే ను ప్రజలు ఆదరించడానికి స్టాలిన్ నాయకత్వమూ ఒక కారణంగా చెప్పాలి. గడచిన అయిదేళ్లుగా ఏఐఏడీఎంకే చాలా స్వల్పమైన ఆదిక్యంలో మాత్రమే ఉంది. పైపెచ్చు ఆ పార్టీలో అంతర్గత కలహాలు, దినకరన్ తిరుగుబాటు వంటి అనేక సమస్యలు ఉన్నాయి. సైగ చేస్తే చాలు గోడ దూకి వచ్చే వాళ్లు చాలా మందే ఉండేవారు. సరైన ప్రయత్నం చేస్తే ఏఐఏడీఎంకే కుప్పకూలి అధికారం డీఎంకే పరమై ఉండేది. అయినా విలువలకు కట్టుబడి ప్రజలు తమకు అధికారం ఇవ్వలేదని ఎన్నికల వరకూ వేచి చూశారు స్టాలిన్. అంతే కాకుండా 2019 లోక్ సభ ఎన్నికలలో స్వీపింగ్ విక్టరీ సాధించిన తర్వాత కూడా కంగారు పడలేదు. బలమైన పార్టీగా ఉండి కూడా ప్రభుత్వ పక్షం బలహీనంగా ఉందని పాలిట్రిక్స్ ప్లే చేయలేదు. ఆ పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలకు పాల్పడలేదు. అంతేకాకుండా అధికారపార్టీని పెద్దగా ఇబ్బంది పెట్టకుండా నిర్మాణాత్మక సహకారాన్నే అందించారు. తమ పార్టీ నాయకుడు రాజా ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షమాపణ చెప్పించారు. ఇవన్నీ నేటి రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిన , అలవరచుకోవాల్సిన లక్షణాలు. కేవలం తిట్లు, దూషణలు, అనుచిత ఆరోపణలతోనే ప్రజలు పట్టం గట్టరు. రాజకీయ హుందాతనం, నాయకత్వ సంయమనం కూడా చూస్తారనేందుకు స్టాలిన్ చక్కని ఉదాహరణ.

పాఠం నేర్వని ఏపీ,బెంగాల్…

ఎన్నికలు ముగిశాయి. పశ్చిమబెంగాల్ రావణకాష్టంగా రగులుతోంది. ప్రత్యర్థులపై దాడులు సాగుతున్నాయి. ఒకనాడు దేశానికి దారి చూపిన రాష్ట్రం . ప్రగతి శీల భావ జాలానికి పునాదులు వేసిన ప్రాంతం. బీజేపీకి భవిష్యత్తులో జాతీయ స్తాయి ప్రత్యామ్నాయానికి మార్గం చూపిందని దేశమంతా సంతోషిస్తోంది. కానీ ఆ రాష్ట్రంలో సంకుచిత ధోరణితో రాజకీయ పక్షాలు కొట్టుకుంటున్నాయి. అధికార తృణమూల్ ఆజ్యం పోస్తోంది. ఆంధ్రప్రదేశ్ విషయం చెప్పనే అవసరం లేదు. చంద్రబాబు నాయుడు, జగన్ రాజకీయ ప్రత్యర్థులన్న మాట మరిచిపోయారు. పరస్పరం పాత కక్షలున్న శత్రువులుగా ప్రవర్తిస్తున్నారు. గతంలో విలువలు మరిచి ఎమ్మెల్యేలను చేర్చుకుని తెలుగుదేశం పార్టీ అధినేత వైసీపీని దెబ్బతీయాలని చూశారు. ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోకుండానే ఆ పార్టీలో అగ్ర నాయకులందర్నీ టార్గెట్ చేస్తూ తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారు . ప్రజలకు కక్షా పూరిత రాజకీయాలు అవసరం లేదు. మంచి పరిపాలన మాత్రమే కావాలి. తమిళనాడు నుంచి వివిధ సంక్షేమ పథకాలను మనవాళ్లు కాపీ కొడుతుంటారు. అక్కడి నాయకులలోని మార్పును, మంచితనాన్ని కూడా అనుసరిస్తే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది.

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News