అంతా అదే ఆధారం..ఆయనపైనే భారం?

తమిళనాడులో ఎన్నికలు సమయం దగ్గరపడింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరిగే అవకాశముంది. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే ఈసారి ఎలాగైనా విజయం [more]

Update: 2020-11-27 17:30 GMT

తమిళనాడులో ఎన్నికలు సమయం దగ్గరపడింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరిగే అవకాశముంది. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనుకుంటోంది. కరుణానిధి మరణంతో స్టాలిన్ పార్టీ పగ్గాలు చేపట్టారు. కరుణానిధి మృతి తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికలలో స్టాలిన్ తన సత్తా చాటారు. అదే దూకుడుతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు.

చావో…రేవో….?

తమిళనాడులో డీఎంకేకు ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్లు ఉన్నాయి. ఈసారి గెలవకుంటే డీఎంకే పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే స్టాలిన్ అన్ని జాగ్రత్తలు ఇప్పటి నుంచే తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ టీం రెండుసార్లు సర్వే నివేదికలు ఇచ్చింది. సర్వే నివేదికల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని స్టాలిన్ పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారు.

బలహీనంగా ఉన్న…..

ఏ నియోజకవర్గంలో డీఎంకే బలహీనంగా ఉందన్న విషయంపై ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం స్పష్టమైన నివేదిక ఇచ్చింది. అలాగే డీఎంకే కూటమిలోని పార్టీలో ఎక్కడ పోటీ చేస్తే గెలిచే అవకాశముందో కూడా త్వరలోనే పీకే టీం నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది. దీని ఆధారంగానే సీట్ల సర్దుబాటు చేయడానికి స్టాలిన్ రెడీ అయిపోయారు. కూటమిలోని పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేసినా సర్దిచెప్పాలనే స్టాలిన్ నిర్ణయించుకున్నారు.

ఎన్నికల ప్రచారాన్ని….

దీంతో పాటు ఇప్పటికే స్టాలిన్ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ప్రచారంలో ఇతర పార్టీలకంటే ముందున్నారు. ఇక జనవరి 5 నుంచి స్టాలిన్ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. మొత్తం పదిహేను వేల కిలోమీటర్లు స్టాలిన్ ప్రయాణించనున్నారు. పదిహేను వందల బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. పది లక్షల మంది ప్రజలను నేరుగా కలుసుకునే ప్రయత్నాన్ని స్టాలిన్ చేయనున్నారు. మొత్తం మీద స్టాలిన్ పడుతున్న కష్టానికి ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News