మహిళా అధికారి మీద వైసీపీ యుద్ధం… ?

ప్రజా ప్రతినిధులు అయిదేళ్ళ పాటే ఉంటారు. కానీ అధికారులు మాత్రం రిటైర్ అయ్యేంతవరకూ అధికారాన్ని చలాయిస్తూనే ఉంటారు. అలా కనుక చూసుకుంటే వారే ఎపుడూ సూపర్ పవర్ [more]

Update: 2021-09-05 11:00 GMT

ప్రజా ప్రతినిధులు అయిదేళ్ళ పాటే ఉంటారు. కానీ అధికారులు మాత్రం రిటైర్ అయ్యేంతవరకూ అధికారాన్ని చలాయిస్తూనే ఉంటారు. అలా కనుక చూసుకుంటే వారే ఎపుడూ సూపర్ పవర్ అని చెప్పాలి. ఇక అధికారులను కొత్తగా పాలనకు వచ్చిన వారు మార్చేస్తూంటారు. గత ప్రభుత్వ వాసనలు ఎవరికైనా ఉంటే తమకు వద్దు అనుకుంటారు. లూప్ లైన్ లో తోసేస్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక చాలా మంది అధికారులను లూప్ లైన్ లోకి నెట్టేశారు. అయితే విశాఖ వంటి కాబోయే రాజధాని నగరానికి కమిషనర్ గా ఉన్న ఒక మహిళా అధికారి విషయంలో ఇపుడు మొత్తానికి మొత్తం పార్టీ ఇపుడు పోరాడుతోంది. ఆమె వద్దు అంటోంది. దీని భావమేమి వైసీపీ నేతా అంటే ఆమె టీడీపీకి అనుకూలమైన అధికారి అని ముద్ర వేసేస్తున్నారు.

వద్దంటే వద్దుట…

ఏపీలో అతి ముఖ్య నగరంలో ఉన్న విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ జి సృజనను బదిలీ చేయండి మహాప్రభో అని విశాఖ మొత్తం వైసీపీ నేతలు మొర పెట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ చెవిన ఈ మాట వేసి మా పరువు దక్కించండి అని కూడా అంటున్నారు. తాజాగా విశాఖలో వైసీపీకి చెందిన నేతలు అంతా విజయసాయిరెడ్డిని కలసి ఈ మేరకు విన్నపాలు తెలియచేఅశారుట. వీరంతా కమిషనర్ బాధితులే అని అంటున్నారు. అంత వరకూ ఎందుకు విశాఖ జిల్లాకు చెందిన ఏకైక మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా కమిషనర్ నా మాట అసలు వినడంలేదు అంటూ విజయసాయిరెడ్డికి ఫిర్యాదు చేశారుట. ఇక మేయర్ సహా కార్పోరేటర్లు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులు ఒకరేంటి అందరూ కలసి మూకుమ్మడిగా కమిషనర్ మీద దాడి చేశారుట. ఆమె టీడీపీ నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారు అని కూడా ఫిర్యాదు చేశారుట.

సీమ‌ బిడ్డగా…

ఇదిలా ఉంటే జి సృజన రాయలసీమకు చెందిన ఆడపడుచు. ఆమె తండ్రి కూడా ఐఏఎస్ అధికారిగానే పనిచేసి రిటైర్ అయ్యారు. సృజన విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఉంటే జగన్ వచ్చి ఆమెకు విశాఖ కార్పోరేషన్ కమిషనర్ గా కీలక బాధ్యతలు అప్పగించారు. సీమ బిడ్డగా జగన్ ఆమె విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరి నగరాభివృద్ధి కోసం నియమించారు. అంతే కాదు ఈ ఏడాది మొదట్లో జీవీఎంసీ ఎన్నికలు జరిగితే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆమెను తాత్కాలికంగా బదిలీ చేశారు. ఎన్నికలు ముగియడంతోనే తిరిగి కమిషనర్ సీట్లోకి తెచ్చారు. మరి ఇదంతా చేసింది జగన్ సర్కారే. ఆమె పనితీరు అంతగా నచ్చడం వల్లనే జగన్ ఆమెను కొనసాగిస్తున్నారు అనుకోవాలి. ఇక విజయసాయిరెడ్డి, జగన్ లకు కమిషనర్ పనితీరు నచ్చుతోంది కానీ వైసీపీ నేతలు మాత్రం విభేదిస్తున్నారు. దాంతో ఆమెను బదిలీ చేస్తారా లేదా అని పట్టుబట్టి కూర్చున్నారు.

వారిని గెలిపిస్తారా…?

ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది జగన్. విజయసాయిరెడ్డి ఈ విషయంలో జగన్ కి చెప్పినా కూడా ఆయనకు నచ్చకపోతే ఆ పని చేయరు. సృజన విషయంలో జగన్ ఎంత నమ్మకంగా ఉన్నారంటే చాలా మంది ఐఏఎస్ అధికారులను అటూ ఇటూ రెండున్నరేళ్ల కాలంలో మార్చారు. కానీ విశాఖ కమిషనర్ జోలికి రాలేదు. పైగా విశాఖ మీద జగన్ కి ప్రత్యేక ఫోకస్ ఉంది. రాజధానిగా ప్రతిపాదించిన జగన్ కి అక్కడ ఏమి జరుగుతోందో తెలియకుండా ఉండదు. కానీ తమ సొంత పార్టీ నేతలు వద్దు అంటున్నారు. ఆమెను బదిలీ చేస్తేనే తాము గెలిచినట్లు అంటున్నారు. లేకపోతే తాము పదవులలో ఉన్నా ఓడినట్లే అని చెప్పేస్తున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి మీద ఈ బృహత్తర బాధ్యతను నేతలంతా పెట్టారు. ఇంతకీ కమిషనర్ బదిలీ అవుతుందా. అదే కనుక జరిగితే సంచలనమే అవుతుంది. టీడీపీకి ఒక ఆయుధం కూడా అవుతుంది. ఎందుకంటే ఆమె ముక్కు సూటిగా పనిచేసే అధికారిణి. మహిళా అధికారిణిని ఇలా రాజకీయ వేధింపులతో బదిలీ చేస్తే అది వైసీపీకి కూడా మచ్చగానే ఉంటుంది.

Tags:    

Similar News