నేను సైతం అంటున్న ద్రోణంరాజు వారసుడు ?

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎంతో పేరు పడిన రాజకీయ కుటుంబం ద్రోణంరాజు సత్యనారాయణది. విశాఖ జిల్లాలోని జుత్తాడ కరణంగా తన వృత్తిని మొదలుపెట్టిన ద్రోణంరాజు దేశ అత్యున్నత చట్ట [more]

Update: 2020-12-27 02:00 GMT

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎంతో పేరు పడిన రాజకీయ కుటుంబం ద్రోణంరాజు సత్యనారాయణది. విశాఖ జిల్లాలోని జుత్తాడ కరణంగా తన వృత్తిని మొదలుపెట్టిన ద్రోణంరాజు దేశ అత్యున్నత చట్ట సభ అయిన పార్లమెంట్ లో మెంబర్ కావడం అంటే అది అతని చాణక్య రాజకీయంగానే చూడాలి. లోక్ సభ, రాజ్యసభల్లో రెండు దశాబ్దాలకు పైగా సభ్యునిగా కొనసాగిన ద్రోణంరాజు ఒక దశలో జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. ఆయన వారసుడిగా వచ్చిన కుమారుడు శ్రీనివాస్ రెండు మార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా, వీఎమ్మార్డీయే చైర్ పర్సన్ గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు.

మూడవతరం రెడీ….

కరోనా మహమ్మారి పుణ్యమాని ఈ ఏడాది అక్టోబర్ లో ద్రోణంరాజు శ్రీనివాస్ దివంగతులయ్యారు. ఆయన కుమారుడు శ్రీవాత్సవ మీద ఇపుడు తండ్రి తాత రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత పడింది. ద్రోణంరాజు శ్రీనివాస్ అకాల మృతితో సాఫ్ట్ వేర్ వృత్తిని సైతం వదులుకు వచ్చిన శ్రీ వాత్సవను తండ్రి సంస్మరణ సభలోనే రాజకీయాల్లోకి రావాలంటూ ఎంపీ విజయసాయిరెడ్డి సభాముఖంగా ఆహ్వానించారు. దానికి సుముఖత వ్యక్తం చేసిన ద్రోణంరాజు శ్రీవాత్సవ గత కొన్ని రోజులుగా వైసీపీ సభల్లో సమావేశాల్లో కనిపిస్తూ వస్తున్నారు.

సత్తా చాటారుగా…?

ఇక ప్రతీ ఏటా దివంగత ద్రోణం రాజు సత్యనారాయణ జయంతిని విశాఖలో ఘనంగా ద్రోణంరాజు శ్రీనివాస్ నిర్వహించేవారు. ఈ ఏడాది ఆ బాధ్యతలను మనవడిగా శ్రీ వాత్సవ నెత్తిన వేసుకోవడమే కాదు సక్సెస్ ఫుల్ గా జరిపించి తన సత్తాను చాటుకున్నారు. వైసీపీకి చెందిన అతిరధ మహారధులంతా ఈ సభకు హాజరు కావడం వెనక ద్రోణంరాజు శ్రీ వాత్సవ కృషి చాలానే ఉంది. విజయసాయిరెడ్డి మంత్రి అవంతి శ్రీనివాస్ సహా ప్రముఖులంతా శ్రీ వాత్సవ్ నాయకత్వ లక్షణాలను కొనియాడారు. రాజ‌కీయాల్లో రాణిస్తాడంటూ దీవించేశారు.

పోటీపడతారా…?

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ద్రోణం రాజు శ్రీనివాస్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన తనకున్న మంచితనాన్నే పెట్టుబడిగా పెట్టి కడదాకా ప్రజ‌లకు సేవలు అందించారు. ఇపుడు ఆ పెట్టుబడినే అందుకుని ద్రోణంరాజు శ్రీ వాత్సవ్ కూడా ముందుకు సాగనున్నాడు. విశాఖ సౌత్ లో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దూసుకుపోతున్నారు. ఆయన వైసీపీకి మద్దతు ప్రకటించి మరీ జై జగన్ అంటూ దూకుడుగా కార్యక్రమాలు చేపడుతున్నారు. బలమైన మత్స్యకార వర్గానికి చెందిన వాసుపల్లికి తోడు అదే సామాజికవర్గానికి చెందిన కోలా గురువులు అక్కడ పార్టీ ఇంచార్జిగా ఉన్నారు. ఈ ఇద్దరినీ దాటుకుని ఇపుడు ద్రోణం రాజు వారసుడు ముందుకు సాగాలి. జనం మద్దతు సాధిస్తే తప్పకుండా జగన్ టికెట్ ఇస్తారు. కానీ అది అంత ఈజీనా అన్నదే తేలాల్సి ఉంది. ఏది ఏమైనా తండ్రికి తగిన వారసుడిగా ఎదిగేందుకు ద్రోణంరాజు శ్రీ వాత్సవ్ చేస్తున్న కృషికి మాత్రం వైసీపీలో పెద్దల నుంచి మద్దతు దక్కుతోంది.

Tags:    

Similar News