సిక్కోలులో వైసీపీ ఆశలు తీరేనా..?

Update: 2018-11-19 02:00 GMT

వైసీపీకి ఉత్తరాంధ్రలో పట్టు చిక్కడం లేదు. 2014 ఎన్నికల్లో కేవలం తొమ్మిది అసెంబ్లీ సీట్లు మాత్రమే సాధించి చతికిలపడిన ఆ పార్టీ ఈసారి పోయిన చోటనే వెతుక్కోవాలనుకుంటోంది. అందుకోసం గత నాలుగు నెలలుగా జగన్ అలుపెరగని రీతిలో పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికి విశాఖపట్నం, విజయనగరం జిల్లాలను కవర్ చేసిన వైసీపీ అధినేత ఇపుడు శ్రీకాకుళంపై దృష్టి సారించారు. అయితే ఆ జిల్లా వైసీపీకి అంత సులభంగా దొరికేట్లు లేదని తెలుస్తోంది.

26 నుంచి పాదయాత్ర

శ్రీకాకుళం జిల్లాలోకి జగన్ ఈ నెల 26వ తేదీన అడుగుపెట్టనున్నారు. అది మొదలు దాదాపుగా యాభై రోజులకు పైగా పాదయాత్ర సాగనుంది. ఈ జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అన్ని నియోజకవర్గాలలో జగన్ పాదయాత్ర కవర్ అయ్యేలా రూట్ మ్యాప్ ను రూపొందిస్తున్నారు. . మొత్తం 38 మండలాలలో జగన్ పాదయాత్ర చేస్తారని పార్టీ వర్గాల సమాచారం. ప్రతీ మారుమూల పల్లెను చుట్టేసేలా పాదయాత్ర ఉండాలని వైసీపీ నేతలు జాగ్రత్త పడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆశావహులు కూడా ఎక్కువగానే ఉన్నారు. వారంతా జగన్ చుట్టు అప్పుడే ప్రదక్షిణలు మొదలెట్టేశారు. టికెట్ తమకే వస్తుందని ధీమాతో వర్గ పోరును కూడా పెంచేస్తున్నారు.

గ్రూపుల తంటా

వైసీపీకి శ్రికాకుళం జిల్లా కొరుకుడు పడని విధంగా మారుతోంది. ఇక్కడ ఇంచార్జిలు కూడా ఇద్దరేసి ఉన్నారు. వారంతా అధిపత్యం కోసం పోరాడటంతో పార్టీ చీలికలు పేలికలు అవుతుంతూంది. ఇవన్నీ జగన్ పాదయాత్రలో బయటపడే అవకాశాలు ఉన్నాయి. జగన్ సైతం ఈ కుమ్ములాటలకు ఏ రకమైన పరిష్కారం చూపుతారో తెలియడం లేదు. మరోవైపు అధికార పార్టీ ఇక్కడ బలంగానే ఉంది. వైసీపీ నుంచి పెద్దగా ఆందోళనలు లేకపోవడం, ప్రజాసమస్యలపై పోరాడలేకపోవడం వంటి పరిణామాలు టీడీపీ బలాన్ని పెంచుతున్నాయి. మొత్తానికి చూసుకుంటే శ్రీకాకుళం పాదయాత్ర వైసీపీకి, జగన్ కి కూడా పరీక్షలా మారుతోంది.

Similar News