ఈ ఎమ్మెల్యేపై అధిష్టానం సీరియ‌స్‌.. ఏం జ‌రిగిందంటే…?

క‌ర్నూలు జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కొత్తవారికి కూడా ఛాన్స్ ఇచ్చినా.. అన్నీ గెలుచుకుంది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇక్కడ అదే [more]

Update: 2021-05-24 03:30 GMT

క‌ర్నూలు జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కొత్తవారికి కూడా ఛాన్స్ ఇచ్చినా.. అన్నీ గెలుచుకుంది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇక్కడ అదే రికార్డును సొంతం చేసుకోవ‌డం సాధ్యం కాద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీకి కంచుకోట వంటి.. ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ పెద్ద సాహ‌స‌మే చేశారు. ఇక్కడ ఎన్నిక‌ల‌కు కొన్ని నెల‌ల ముందు.. హ‌త్యకు గురైన చెరుకుల‌పాడు నారాయ‌ణ‌రెడ్డి స‌తీమ‌ణి.. శ్రీదేవికి టికెట్ ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆమె బంప‌ర్ మెజార్టీతో విజ‌యం సాధించారు. ద‌శాబ్దాల చ‌రిత్ర ఉన్న కేఈ ఫ్యామిలీకి చెందిన వార‌సుడు కేఈ శ్యాంబాబుపై ఏకంగా 40 వేల ఓట్ల బంప‌ర్ మెజార్టీతో శ్రీదేవి గెలిచారు.

కుటుంబం వసూళ్ల పర్వంతో….?

అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి శ్రీదేవికి టికెట్ ల‌భించ‌డం క‌ష్టమ‌నే వ్యాఖ్యలు వినిపిస్తుండ‌డం ఇప్పుడు రాజ‌కీయ చ‌ర్చకు దారితీస్తోంది. టీడీపీ దూకుడుకు క‌ళ్లెం వేశామ‌ని చెప్పుకొన్నా.. అధికార పార్టీ కేంద్రంగా కేఈ కుటుంబం చేస్తున్న రాజ‌కీయాలకు మాత్రం వీరు క‌ళ్లెం వేయ‌లేక పోతున్నారు. పైగా.. కుటుంబం మొత్తం వ‌సూళ్ల ప‌ర్వానికి తెర‌దీసింద‌నే కామెంట్లు నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా వినిపిస్తున్నాయి. పార్టీలో త‌న గెలుపున‌కు కృషి చేసిన వారిని అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. కార్యక‌ర్తల నుంచి దిగువ స్థాయి నాయ‌కుల వ‌ర‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ద‌వులు, పెత్తనం అంతా ఒకే వ‌ర్గం క‌నుస‌న్నల్లో ఉంటోంద‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి.

క్లాస్ పీకినా…?

ఇక నియోజ‌క‌వ‌ర్గంలో ద్వితీయ శ్రేణి కేడ‌ర్ అసంతృప్తులు, ఫిర్యాదుల‌ను ప‌రిశీల‌న‌కు తీసుకున్న పార్టీ అధిష్టానం.. ఇటీవ‌ల శ్రీదేవికి క్లాస్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని.. కుటుంబ రాజ‌కీయాల‌ను ప‌క్కన పెట్టాల‌ని కూడా సూచించిన‌ట్టు చెబుతున్నారు. అయినప్పటికీ.. శ్రీదేవి కుటుంబం మాత్రం గాడిలో ప‌డిన‌ట్టు అయితే లేదు. మ‌రోవైపు కేఈ కుటుంబం నియోజ‌క‌వ‌ర్గంలో తిరిగి త‌మ ప‌ట్టుకోసం ప‌ట్టుద‌ల‌తో ఉంది. కేఈ అనుచ‌రులు యాక్టివ్ అవుతుండ‌డంతో పాటు ఎమ్మెల్యే శ్రీదేవి వైఖ‌రిని ఎండ‌గ‌డుతున్నారు. ప్రజ‌ల స‌మ‌స్యలు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ప్రజ‌లకు అందుబాటులో కూడా ఉండ‌డం లేద‌ని.. వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇవే ప్రజ‌ల్లో బ‌లంగా ప‌నిచేస్తున్నాయి.

రాజకీయ అనుభవం లేకపోవడం కూడా..?

శ్రీదేవికి రాజ‌కీయ అనుభ‌వం లేక‌పోవ‌డం కూడా మైన‌స్సే. ఇక‌, వైసీపీ త‌ర‌ఫున వాయిస్ వినిపించ‌డంలోనూ శ్రీదేవి పెద్దగా ఆస‌క్తి చూపించ‌డం లేదు. గ‌త రెండేళ్లలో ఇప్పటి వ‌ర‌కు ప్రజ‌ల మ‌ధ్య ఉన్నది చాలా త‌క్కువ స‌మ‌య‌మేన‌ని వైసీపీ నేత‌లే చెబుతున్నారు. ప‌త్తికొండ‌లో పార్టీ కేడ‌ర్ స‌మ‌స్యలు, ప్రజా స‌మ‌స్యల విష‌యంలోనూ శ్రీదేవికి క‌మాండింగ్ లేదు. ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న అధిష్టానం… ఆమె ఇంఫ్రూవ్ కాక‌పోతే ప‌క్కన పెట్టే అవ‌కాశాలే ఉన్నాయంటున్నారు.

Tags:    

Similar News